కేరళ ప్రభుత్వం స్టేట్ అవార్డులను శుక్రవారం ప్రకటించింది. ఆ రాష్ట్ర సాంస్కృతిక, మత్స్య, యువజన వ్యవహారాల శాఖా మంత్రి సాజీ చెరియన్ ఈ అవార్డులను ప్రకటించారు. నటిగా నలభై సంవత్సరాల కెరీర్ కలిగిన రేవతి మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రం నుండి ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం విశేషం. ‘భూతకాలం’ అనే చిత్రంలో కొడుకు ప్రేమకు ఎక్కడ దూరమౌతానో అని అపోహకు గురయ్యే సింగిల్ మదర్ క్యారక్టర్ ను ఆమె అత్యద్భుతంగా పోషించింది. ఇక ఉత్తమ నటుడు అవార్డును బిజూ మీనన్ (ఆర్కారియమ్), జోజు జార్జ్ (మధురం, ఫ్రీడమ్ ఫైట్, తురముఖం, నాయట్టు) పంచుకున్నారు.
మొత్తం 142 మలయాళ చిత్రాలు పరిశీలనకు రాగా ఎప్పటిలానే పాపులారిటీని బట్టి కాకుండా ప్రతిభకు పట్టంకడుతూ ఈ అవార్డుల ఎంపిక చేశారు. ఉత్తమ చిత్రంగా ‘ఆవాసవ్యూహం’ చిత్రం ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా దిలీష్ పోతన్ (జోజి) ఎంపికయ్యాడు. బెస్ట్ పాపులర్ మూవీ అవార్డు తో పాటు ‘హృదయం’ చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (హిషమ్ అబ్దుల్ వాహబ్) అవార్డు దక్కింది. అలానే బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డును జస్టిన్ వర్గీస్ (జోజి) అందుకున్నాడు. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ (మేల్) సురేశ్ మూర్ (కాలా), బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ (ఫిమేల్) ఉన్నిమాయా ప్రసాద్ (జోజి) ఎంపికయ్యారు. ఉత్తమ బాలల చిత్రం అవార్డ్ ‘కాదకాలమ్’ చిత్రానికి దక్కింది. బెస్ట్ వి.ఎఫ్.ఎక్స్. అవార్డ్ ఆండ్రూ డిసౌజా (మిన్నల్ మురళీ)కి లభించింది. షెర్రీ గోవిందన్ (అవనోవిలోనా), జియో బేబీ (ఫ్రీడమ్ ఫైట్), నేఘా ఎస్ (అంతరం) కు స్పెషల్ జ్యూరీ అవార్డులు దక్కాయి.