Niluvu Dopidi: నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ అన్నదమ్ములుగా నటించిన రెండవ చిత్రం ‘నిలువు దోపిడీ’. అంతకు ముందు వీరిద్దరూ ‘స్త్రీ జన్మ’లో అన్నదమ్ములుగానే అభినయించారు. విశేషమేమిటంటే, ఎన్టీఆర్‌తో కృష్ణ నటించిన ఐదు చిత్రాలలోనూ ఆయనకు తమ్మునిగానే నటించారు. కృష్ణ వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో రూపొందిన ‘నిలువు దోపిడీ’ చిత్రాన్ని ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన యు.విశ్వేశ్వరరావు నిర్మించారు. తరువాతి రోజుల్లో విశ్వేశ్వరరావు కూతురును యన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ వివాహం చేసుకోవడంతో వారిద్దరూ వియ్యంకులు కూడా అయ్యారు. మంజులా సినీ సిండికేట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సి.యస్.రావు దర్శకత్వం వహించారు. 1968 జనవరి 25న ‘నిలువు దోపిడి’ విడుదలయింది.
‘నిలువు దోపిడి’ కథ విషయానికి వస్తే – జమీందార్ జగపతి రాయలుకు ఇద్దరు కొడుకులు – రాము, కృష్ణ. జగపతి రాయలు ఎన్నో దానధర్మాలు, సేవాకార్యక్రమాలు చేసి ఉంటారు. చనిపోతూ, తనయుల బాధ్యతను చెల్లెళ్ళు చుక్కమ్మ, శేషమ్మకు అప్పగిస్తాడు. కానీ చుక్కమ్మ కుటిలోపాయంతో తన సమీపబంధువు భూషణం సాయంతో ఆ ఇద్దరు పిల్లలను మట్టుపెట్టాలని చూస్తుంది. అయితే దయార్ద్ర హృదయుడైన చుక్కమ్మ మొగుడు వారిని రక్షించి, జగపతి నెలకొల్పిన అనాథ శరణాలయంలో చేర్పిస్తాడు. పెద్దయ్యాక రాము మెకానిక్ అయి, సొంతగా షాప్ నడుపుతూ ఉంటాడు. అతని తమ్ముడు కృష్ణ కాలేజీలో చదువు కొంటూంటాడు. శేషమ్మ కూతురు జానకి, రాము ప్రేమించుకుంటారు. అలాగే కాలేజ్ లో కృష్ణను, చుక్కమ్మ కూతురు రాధ ప్రేమిస్తుంది. రాధను తన కొడుకు రాజుకు ఇచ్చి పెళ్ళి చేయాలని ఆశిస్తూంటాడు భూషణం. రాధ ప్రేమ విషయం తెలిసిన భూషణం వచ్చి కృష్ణను కొడతాడు. దాంతో ఆవేశంతో పోయి భూషణాన్ని కొడుతున్న రాముకు అక్కడ తమ అనాథ శరణాలయం నెలకొల్పిన జగపతి రాయలు ఫోటో కనిపిస్తుంది. అది చూసి ఆగిపోతాడు. తరువాత అనాథ శరణాలయం స్వామిజీ ద్వారా అన్ని విషయాలూ తెలుసుకున్న రాము, కృష్ణ మారు వేషాల్లో రంగాపురం వెళ్ళి, అక్కడ పెత్తనం చెలాయిస్తున్న చుక్కమ్మకు, ఆమె అన్న భూషణానికి తగిన గుణపాఠం చెబుతారు. చుక్కమ్మ భర్త వెంకట్రామయ్య ఓ నాటకం ఆడి ఆమెకు కళ్ళు తెరిపిస్తాడు. రాము, జానకిని, రాధను కృష్ణ పెళ్ళి చేసుకుంటారు. వేంకటేశ్వర స్వామికి నిలువు దోపిడి ఇవ్వమని వెంకట్రామయ్య, చుక్కమ్మకు చెబుతాడు. చుక్కమ్మ భర్త చెప్పినట్టు ముడుపు కడుతుంది. అందరూ ఆనందంగా ఉండడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో యన్టీఆర్ కు జోడీగా దేవిక, జయలలిత సరసన కృష్ణ నటించారు. నాగభూషణం, నాగయ్య, రేలంగి, కాంతారావు, రాజనాల, ధూళిపాల, ప్రభాకర రెడ్డి, పద్మనాభం, హేమలత, సూర్యకాంతం ముఖ్యపాత్రధారులు.
ఈ చిత్రానికి త్రిపురనేని మహారథి మాటలు రాయగా, శ్రీశ్రీ, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, కొసరాజు, సి.నారాయణ రెడ్డి, యు.విశ్వేశ్వర రావు పాటలు పలికించారు. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇందులోని “లోకం ఇది లోకం…”, “ఆడపిల్లలంటేనే…”, “చుక్కమ్మ అత్తయ్యరో బుల్ బుల్…”, “అయ్యలారా ఓ అమ్మలారా…”, “నీ బండారం పైన పటారం…”, “జీవులెనుబది నాల్గు లక్షల చావు పుట్టుక ఇక్కడ…”, “అయ్యింది అయ్యింది…అనుకున్నది…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించింది. రిపీట్ రన్స్ లోనూ భలేగా అలరించింది.
(జనవరి 25న ‘నిలువుదోపిడీ’కి 55 ఏళ్లు)