NTV Telugu Site icon

Movie Theaters :400 థియేటర్ల మూత… థియేటర్లకు దిక్కెవరు?

Theaters

Theaters

కరోనా కల్లోలం కారణంగా ప్యాండమిక్ లో జనం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అడిక్ట్ అయ్యారు. థియేటర్లు తెరచిన తరువాత కూడా పోలోమని సినిమాలకు వెళ్ళడం లేదు. రెండు, మూడు వారాలు ఆగితే ఎటూ బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన సినిమా ఓటీటీల్లోనూ వస్తుంది కదా అని ఉదాసీనత జనంలో ఏర్పడింది. అయితే పాపులర్ స్టార్స్ సినిమాలను థియేటర్లలోనే చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మౌత్ టాక్ తో ఆకట్టుకున్న చిన్న సినిమాలనూ ఆదరిస్తున్నారు. కానీ, వస్తోన్న సినిమాల్లో అన్నీ టాప్ స్టార్స్ సినిమాలు కావు, అలాగే యూత్ ఫుల్ మూవీస్ లోనూ అన్నీ ఆకట్టుకోవడం లేదు. దాంతో సినిమా థియేటర్లకు వెళ్ళి చూసేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ మధ్య వారానికి ఆరు, ఏడు సినిమాలు జనం ముందు నిలుస్తున్నాయి. కానీ, వాటిలో ఏదీ థియేటర్ల విద్యుత్ ఛార్జీలకు తగ్గ మొత్తాన్నీ రాబట్టడం లేదు. అందువల్ల ఆ సినిమాలను ఒక్క ఆటకే పరిమితం చేసి, తరువాత వేరే పాత చిత్రాలతో పబ్బం గడుపుకుంటున్నారు. పాత చిత్రాలు అంటే మరీ పాతవి కావు, ఏడాదిలోపు విడుదలై విజయం సాధించిన చిత్రాలనే మళ్ళీ థియేటర్లలో ప్రదర్శించుకుంటున్నారు. లేదంటే కొందరు థియేటర్లనే మూసేస్తున్నారు. సినిమా థియేటర్లలో ప్రదర్శించటానికి సరైన సినిమాలు ప్రస్తుతం అందుబాటులో లేవని ఎగ్జిబిటర్స్ వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వెయ్యికి పైగా థియేటర్లు ఉన్నాయి. వాటిలో నాలుగు వందల థియేటర్లు మూత పడటానికి కారణం సరైన ఫీడ్ లేక పోవడమేనని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఏ,బి,సి సెంటర్స్ లో విడుదలైన రోజున నూరుశాతం ఫుల్స్ చూసిన చివరి సినిమా ‘సర్కారువారి పాట’. ఈ సినిమా కూడా మూడు రోజులు ఫుల్స్ చూశాక, తరువాత జారిపోయింది. ఇలా కావడానికి టాప్ స్టార్స్ సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచడమే కారణమనీ థియేటర్లవారి మాట. అయితేనేమి, చివరగా మంచి వసూళ్లు చూసిన చిత్రంగా ‘సర్కారు వారి పాట’ నిలచింది. ‘ఎఫ్-3’ సినిమా టిక్కెట్ రేట్లు పెంచక పోయినప్పటికీ బి,సిల్లో సరైన వసూళ్ళు రాబట్ట లేకపోయిందట! ఆ తరువాత వచ్చిన ఏ సినిమా కూడా లాభసాటి వసూళ్ళు లేవు. డబ్బింగ్ మూవీగా వచ్చిన ‘విక్రమ్’ అందుకు మినహాయింపు. ఇది కూడా ఎగ్జిబిటర్స్ ఆశించిన నూరుశాతం ఫుల్స్ సాధించలేదు. వస్తున్న సినిమాల్లోనూ ఆశాజనకమైనవి ఏవీ కనిపించడం లేదు. కనీసం ఓ థియేటర్ కు రెండు వారాలు మంచి వసూళ్ళు తెచ్చిపెట్టే సినిమా ఏదీ రావడం లేదని, అందువల్లే సినిమా థియేటర్లను మూసి వేయవలసి వచ్చిందని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి కొన్ని బి, సి క్లాస్ సెంటర్స్ కే పరిమితమయింది. ఇలా అలరించలేని సినిమాలు వచ్చినట్లయితే థియేటర్లకు సరైన ఫీడ్ ఉండదు. అప్పుడు నగర, పట్టణ ప్రాంతాల్లోని థియేటర్లు సైతం మూసేసుకోవలసి వస్తుంది. విజయవాడలోనూ కొన్ని థియేటర్లను మూసేశారట. అంటే ఇప్పటికే ఇది మెల్లగా నగరాలకు పాకుతోందన్న మాట!

ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు దిక్కెవరు? ‘సినిమా రక్షితో రక్షితః’ అంటున్నారు పెద్దలు. సినిమాను రక్షించుకుంటే, అది థియేటర్ల వారిని రక్షిస్తుందని వారి మాట! అయితే ముందు థియేటర్ల వారిని రక్షించేదెవరు అన్నదే ప్రశ్న! థియేటర్లు మూత పడుతూ పోతే, సినిమాలు తీసేవారికి ఇక ఓటీటీలు, శాటిలైట్ ఛానల్స్ శరణ్యమవుతాయి. కుప్పలు తెప్పలుగా చిత్రాలు నిర్మించేవారికి అవే వేదికలు అవుతున్నాయి. ఇప్పటికే కొందరు అదే పనిగా ఓటీటీల కోసం వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ప్యాండమిక్ లో వెంకటేశ్, నాని వంటి స్టార్స్ తమ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేసిన విషయాన్నీ మరచిపోరాదు. ఇక థియేటర్లు మూతపడి, వాటి స్థానంలో మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్, అపార్ట్ మెంట్స్ వెలిస్తే మళ్ళీ స్క్రీన్స్ కోసం వెతుకులాడవలసి వస్తుంది. దొరకనప్పుడు ఓటీటీ, శాటిలైట్ ఛానల్స్, డిజిటల్స్ మాత్రమే దిక్కవుతాయి.

మంది ఎక్కువయితే మజ్జిగ పలచన అన్నారు. డిజిటల్, ఓటీటీ, శాటిలైట్ ప్లాట్ ఫామ్స్ లోనూ పోటీ పెరిగితే, ఇప్పుడున్న లావాదేవీలు కాకుండా, భవిష్యత్ లో సినిమాల కొనుగోలు ధరలు పడిపోవచ్చు. ఈ విషయం ఆలోచించకుండా థియేటర్లు లేకపోయినా పర్లేదని ఈ వేదికలను నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుంది.

మరి థియేటర్లను కాపాడడం ఎలా?
మూడు దశాబ్దాల క్రితం ఏడాదికి స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి వందకు పైగా సినిమాలు వస్తే సరిపోయేది. అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2750 పైగా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 1600 సింగిల్ థియేటర్లు, 300 మల్టీప్లెక్స్ ఉన్నాయి. ఈ యేడాది ఆరు నెలలకే 94 స్ట్రెయిట్ మూవీస్, 41 డబ్బింగ్ సినిమాలు మొత్తం 135 చిత్రాలు వచ్చాయి. వీటిలో ఓ 15 మాత్రమే నేరుగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. మిగిలిన 120 చిత్రాలు థియేటర్లలోనే వెలుగు చూశాయి. అప్పటి కంటే ఇప్పుడు థియేటర్ల సంఖ్య తగ్గింది; సినిమాల సంఖ్య పెరిగింది. కాబట్టి ఫీడ్ లేకపోవడం ఏమిటన్న ప్రశ్న తలెత్తవచ్చు. అయితే వస్తున్న చిత్రాలలో జనాన్ని ఆకట్టుకుంటున్న సినిమాలు ఎన్ని? వాటిలో పట్టుమని రెండు వారాలు ఆడినవి ఎన్ని అనే లెక్కలు తీస్తే మొహం వేలాడవేయవలసిన స్థితి. ఈ యేడాది సినిమాలను పరిశీలిస్తే చిన్న సినిమాల్లో ‘డీజే టిల్లు’, తరువాత ‘మేజర్’ బాగానే మురిపించాయి. ఇక పెద్ద సినిమాల్లో ‘ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్-2, సర్కారువారి పాట, విక్రమ్” జనాన్ని థియేటర్లవైపు సాగేలా ఆకర్షించాయి. దీనిని బట్టి, కాసింత విషయం ఉండి మౌత్ టాక్ తో సాగే సినిమాలు అలరిస్తున్నాయి. అలాగే సినిమాల్లో గ్రాండియర్ ఉన్నా, లేదా మల్టీస్టారర్స్ గా వచ్చినా ఆకట్టుకోగలిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని సినిమా జనం ముందుకు సాగితే మంచిది. అప్పుడే ఉన్న థియేటర్లను నిలుపుకోగలం. ఆ పైన ఇతర వేదికలపై కూడా అలరించవచ్చు. ఇది కేవలం ఒక్క తెలుగు సినిమా పరిశ్రమకే కాదు, మన దేశంలోని ఇతర భాషా చిత్ర సీమలకూ వర్తిస్తుంది. ఈ విషయంలో అన్ని భాషల సినిమా రంగాలవారు సంయుక్తంగా ఓ కార్యాచరణ రూపొందించుకుంటే, కొన్నాళ్ళకైనా ఓటీటీలను అధిగమించి, సినిమా థియేటర్లకే జనాన్ని రప్పించవచ్చు. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం.