Yama Gola: ఇప్పుడంటే సామాజిక మాధ్యమం భలేగా హల్ చల్ చేస్తూ ఏ అంశంపై అయినా వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి వేదికగా మారడం చూస్తున్నాం. కానీ, ఆ రోజుల్లో ఎవరి భావాలు వారిలోనే ఉంచుకోవడమో లేక సన్నిహితులతో పంచుకోవడమో చేసేవారు. అప్పట్లో అధికార పార్టీలపై సెటైర్ వేయాలంటే సినీజనం భయపడిపోయేవారు. నటరత్న నందమూరి తారక రామారావు ఏ మాత్రం అదరక బెదరక తన చిత్రాలలో నాటి సమకాలీన రాజకీయాలపై విమర్శనాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. ఎమర్జెన్సీ రోజుల్లో దేశం అతలాకుతలమై పోయిన సంగతి ఈ నాటికీ కథలుగా చెప్పుకుంటారు. ఆ పాలనను ‘యముడి నిరంకుశత్వం’తో పోలుస్తూ, ‘ఎమర్జెన్సీ’ని ‘యమ అర్జెన్సీ’గా వ్యాఖ్యానిస్తూ పాటలు పాడుతూ యన్టీఆర్ ‘యమగోల’ చిత్రం తెరకెక్కింది. ఇందులో నాటి యువజన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ గాంధీపైనా సెటైర్స్ వినిపిస్తాయి. దాంతో ‘యమగోల’ డైలాగులకు జనం చప్పట్లు చరిచారు. పదే పదే చూసి ఆనందించారు. ఈ సినిమా 1977 అక్టోబర్ 21న దసరా కానుకగా జనం ముందు నిలచింది. యన్టీఆర్ తో దర్శకుడు తాతినేని రామారావు పనిచేసిన తొలి చిత్రమిదే. శ్రీపల్లవి ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యస్.వెంకటరత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. చక్రవర్తిని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మార్చినదీ ఈ సినిమాయే!
అంతకు ముందు 1960లో యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవాంతకుడు’ చిత్రం కథలాగే ఈ ‘యమగోల’ కూడా ఉంటుంది. హీరోకు ఓ కల రావడం, అందులో అతను యమలోకం, స్వర్గలోకం చుట్టిరావడం అక్కడ ఉన్న పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నాలు చేయడం వంటివి ప్రధానాంశాలుగా సాగుతాయి. అదే తీరున ఈ సినిమానూ రచయిత డి.వి.నరసరాజు సాయంతో తెరకెక్కించారు. ఇక ‘యమగోల’ కథలోకి తొంగి చూస్తే – ఊరి ప్రెసిడెంట్ సత్యంకు, మాజీ ప్రెసిడెంట్ రుద్రయ్యకు పడనే పడదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటిమీద వాలరాదు అన్నది రుద్రయ్య ఫిలాసఫీ. సత్యానికి రుద్రయ్య మామ వరసవుతాడు. రుద్రయ్య చేసే తప్పుడు పనులకు సత్యం అడ్డుతగులుతూ ఉంటాడు. రుద్రయ్య కూతురు సావిత్రి, సత్యాన్ని ప్రేమిస్తుంది. అది నచ్చని రుద్రయ్య, సత్యాన్ని మట్టుపెట్టడానికి ఓ పథకం వేస్తాడు. అందులో భాగంగా ఓ మంత్రగాడు వచ్చి, సత్యంను చావగొడతాడు. తన మంత్రశక్తితో సత్యం శవాన్ని కనుమరుగయ్యేలా చేస్తానని అంటాడు. దాంతో రుద్రయ్య, అతని అనుచరుడు కలసి సత్యం దేహం ముందు కాపాల కాస్తుంటారు. సత్యం మొదట స్వర్గలోకం వెళ్ళి అక్కడ రంభ, ఊర్వశి, మేనక నృత్యానికి తగ్గ పాట పాడి అలరిస్తాడు. తరువాత దేవేంద్రుని కూడా విమర్శిస్తాడు. ఆ పై అతను నరక లోకం వెళతాడు. అక్కడ యమధర్మరాజు, చిత్రగుప్తుడు చేసే పాత పని సరికాదని వాదిస్తాడు. కృతయుగం నాటి ధర్మశాస్త్రాలు చెల్లవనీ అంటాడు. యమలోకంలో కింకరులలో చైతన్యం తీసుకు వచ్చి, విప్లవం లేవదీస్తాడు. అతని సూచనల మేరకే యమలోకానికి యమధర్మరాజు, చిత్రగుప్తుడు సెలవు ప్రకటిస్తారు. సత్యం కూడా మళ్ళీ భూలోకానికి రావడం, రుద్రయ్య చెంతకు చేరడం చేస్తాడు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు భూలోకంలో ఆంధ్రదేశానికి వచ్చి పలు పాట్లు పడతారు. ఓ కేసులో పోలీస్ స్టేషన్ లో వేస్తే సత్యం వెళ్ళి విడిపించుకు వస్తాడు. వారి ఆభరణాలు చూసిన రుద్రయ్య వాటిని తస్కరించే ప్రయత్నం చేస్తాడు. సత్యంను తమతో తీసుకు వెళ్ళాలని యముడు, చిత్రగుప్తుడు భావిస్తారు. ఓ పథకం ప్రకారం వారు తనను గుర్తు పట్టకుండా సావిత్రిని పెళ్ళాడతాడు సత్యం. ఆ నవ వధూవరులను ఆశీర్వదిస్తూ, సావిత్రిని ‘దీర్ఘసుమంగళీ భవ…’ అంటూ దీవిస్తాడు యముడు. ఆ తరువాత సత్యం తన ముసుగు తొలగిస్తాడు. ఇదేమిటంటే, ఆమెను దీర్ఘసుమంగళిగా దీవించారు కాబట్టి, తాను వారితో రావలసిన పనిలేదని అంటాడు సత్యం. అతని తెలివికి మెచ్చిన యమధర్మరాజు సంతోషిస్తాడు. ఈ లోగా సత్యంపైకి రుద్రయ్య మనుషులను తీసుకు వస్తాడు. గొడవ జరుగుతుంది. చివరకు సత్యాన్ని కాల్చబోతాడు. ఎంత కాల్చినా, సత్యంకు ఏమీ కాదు. అతను నవ్వుతూ ఉంటాడు. అప్పటి దాకాశవంలా పడి ఉన్న సత్యం నవ్వుతూ లేస్తాడు. అది చూసి కాపలాకాస్తున్న రుద్రయ్య, అతని అనుచరుడు జడుసుకుంటారు. మంత్రగాడుగా వచ్చిన వ్యక్తి కూడా సత్యంకు మిత్రుడే. అతను వెళ్ళి పోలీసులను తీసుకు వచ్చి, హత్యానేరం కింద రుద్రయ్యను అరెస్ట్ చేయించాలని చూస్తాడు. దాంతో తన కూతురునిచ్చి పెళ్ళి చేస్తాను కేసు పెట్టొద్దని బతిమాలుతాడు రుద్రయ్య. సరే నంటాడు సత్యం. సావిత్రిని సత్యం పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది. రుద్రయ్యను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు కూడా నకిలీవారేనని తేలడంతో రుద్రయ్య డంగై పోతాడు.
యన్టీఆర్ సరసన జయప్రద నటించిన నాలుగవ చిత్రమిది. అంతకుముందు మూడు చిత్రాలు ‘అడవిరాముడు, చాణక్య-చంద్రగుప్త, మా ఇద్దరి కథ’ కూడా అదే యేడాది విడుదలయ్యాయి. వాటిలో ‘అడవిరాముడు’ బ్లాక్ బస్టర్ కాగా, ఈ ‘యమగోల’ సైతం సంచలన విజయం సాధించింది. కొన్ని కేంద్రాలలో ‘అడవిరాముడు’ కన్నా మిన్నగా వసూళ్ళు చూసింది. సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, జగ్గారావు, నిర్మలమ్మ, ఝాన్సీ, జయమాలిని, ఛాయాదేవి, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, మంజుభార్గవి తదితరులు నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి స్వరకల్పన చేయగా, శ్రీశ్రీ, సి.నారాయణ రెడ్డి, వీటూరి, వేటూరి పాటలు పలికించారు. ఇందులోని “ఓలమ్మీ తిక్కరేగిందా…”, “చిలకకొట్టుడు కొడితే చిన్నదానా…”, “ఆడవె అందాల సురభావమిని…”, “వయసు ముసురుకొస్తున్నది…”, “సమరానికి నేడే ప్రారంభం…”, “గుడివాడ వెళ్ళాను… గుంటూరు పోయాను…” అంటూ సాగే పాటలు జనాన్ని ఓ ఊపు ఊపేశాయి. ఇందులోని పాటలకు జనం చిల్లరనాణ్యాలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
‘యమగోల’ సినిమా మొదటి రిలీజ్ లో 28 కేంద్రాలలోనూ, తరువాత మరో రెండు కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. భీమవరంలో డైరెక్ట్ జూబ్లీ జరుపుకుంది. మరో ఐదు కేంద్రాలలోనూ రజతోత్సవం చేసుకుంది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలో దాదాపు 40 వారాలు ప్రదర్శితమయింది.
ఈ చిత్రానికి మాతృక ‘దేవాంతకుడు’ అనే చెప్పాలి. ఆ సినిమాకు బెంగాలీలో రూపొందిన ‘జమాలయే జిబంత మనుష్’ అనే 1958 నాటి చిత్రం ఆధారం. ‘యమగోల’ ఘనవిజయంతో ఈ సినిమాను హిందీలో ‘లోక్-పరలోక్’ పేరుతో జితేంద్ర, జయప్రద జంటగా తాతినేని రామారావు దర్శకత్వంలోనే వెంకటరత్నం నిర్మించారు. తమిళంలో శివాజీగణేశన్ హీరోగా, యమధర్మరాజుగా ద్విపాత్రాభినయం చేయగా, ‘యమనుక్కు యమన్’ పేరుతో రీమేక్ చేశారు. దానికి డి.యోగానంద్ దర్శకుడు. ఈ రెండు చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. ‘యమగోల’ స్ఫూర్తితోనే తరువాతి రోజుల్లో చిరంజీవి హీరోగా ‘యముడికి మొగుడు’, ఆలీతో ‘యమలీల’, శ్రీకాంత్ తో ‘యమగోల మళ్ళీ మొదలయింది’ వంటి చిత్రాలు రూపొందాయి. జూనియర్ యన్టీఆర్ తో రాజమౌళి ‘యమదొంగ’కు కూడా ఈ ‘యమగోల’ స్ఫూర్తినిచ్చిందని చెప్పవచ్చు. ‘యమగోల’లోని “ఓలమ్మీ తిక్కరేగిందా…” పాటను ‘యమదొంగ’లో రీమిక్స్ చేయడం విశేషం. ఆ పాటను జూనియర్ యన్టీఆర్ ఆలపించడం మరింత విశేషం!