NTV Telugu Site icon

Suryavamsam: పాతికేళ్ళ వెంకటేశ్ ‘సూర్యవంశం’!

Suryavamsam

Suryavamsam

Suryavamsam: తెలుగునాట రీమేక్స్ తో కింగ్ లా సాగారు హీరో వెంకటేశ్. తమిళంలో విజయవంతమైన ‘సూర్యవంశం’ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. తండ్రీకొడుకులుగా వెంకటేశ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో రాధిక, మీనా ఆయన సరసన నటించారు. సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. 1998 ఫిబ్రవరి 25న విడుదలైన ‘సూర్యవంశం’ ఆ యేడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలచింది.

‘సూర్యవంశం’ కథ ఏమిటంటే – తన ఊరిలో మకుటం లేని మహారాజు హరిశ్చంద్ర ప్రసాద్. ఆయనకు ముగ్గురు కొడుకులు ఓ కూతురు. అందరినీ బాగా చూసుకొనే హరిశ్చంద్ర ప్రసాద్ కు చిన్న కొడుకు భానుప్రసాద్ అంటే అఇష్టం. అందుకు ఒకప్పుడు తాను చెప్పిన అమ్మాయిని భానుప్రసాద్ పెళ్ళాడలేడన్నదే కారణం! నిజానికి భానుప్రసాద్, ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించి ఉంటాడు. కానీ, ఆమెకు అతనంటే ఇష్టం ఉండదు. ఆమెను హరిశ్చంద్రప్రసాద్ పెంచి పెద్ద చేసి ఉంటాడు.

అందువల్ల భానుప్రసాద్ ఆమెకు తన కన్నవారి ముందు అగౌరవం కలుగకుండా, తనకే ఆ పెళ్ళి ఇష్టం లేదని చెబుతాడు. ఇవేవీ తెలియని భానుప్రసాద్ ను తండ్రితో పాటు అన్నలు, ప్రేమించిన అమ్మాయి కూడా చులకనగా చూస్తూ ఉంటుంది. భానుప్రసాద్ చెల్లెలిని ఓ ధనవంతుల అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. వారి అమ్మాయి స్వప్నకు భానుప్రసాద్ మంచితనం గురించి తెలుస్తుంది. అతనిపై అభిమానం, ఆ తరువాత ప్రేమ పెంచుకుంటుంది. అతడినే పెళ్ళాడతానంటుంది. బాగా చదువుకొని సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తనను ప్రేమించడమేమిటని భానుప్రసాద్ కంగు తింటాడు. చివరకు ఆమె అతడిని ఒప్పిస్తుంది.

Read Also: AAP vs BJP: ఎంసీడీలో ముదిరిన కొట్లాట.. జై మోదీ, జై కేజ్రీవాల్‌ అంటూ కొట్టుకున్న కార్పొరేటర్లు

వారిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. తత్ఫలితంగా రెండువైపుల వారు వారిని దూరం పెడతారు. స్వశక్తితో భానుప్రసాద్ అంచెలంచెలుగా ఎదుగుతాడు. అతనికి ఓ కొడుకు పుడతాడు. భార్య కలెక్టర్ అవుతుంది. తన పేరున ట్రావెలింగ్ సర్వీస్ పెట్టిన చిన్న కొడుకు అంటే హరిశ్చంద్రప్రసాద్ కు కూడా అభిమానం కలుగుతుంది. తన మనవడిని చూసుకొని మురిసిపోతాడు హరిశ్చంద్ర ప్రసాద్. తొలి నుంచీ హరిశ్చంద్ర ప్రసాద్ అంటే గిట్టని సింగరాజు, పాయసంలో విషం కలుపుతాడు. అది తాగిన హరిశ్చంద్రప్రసాద్ ఆసుపత్రి పాలవుతాడు. తండ్రి అంటే గిట్టని భానుప్రసాద్ విషం కలిపిన పాయసం తన కొడుకుతో పంపించాడని సింగరాజు ప్రచారం చేస్తాడు. చివరకు హరిశ్చంద్రప్రసాద్ వచ్చి నిజం చెప్పి, సింగరాజును చితగ్గొడతాడు. మనస్పర్థలు తొలగి చిన్నకొడుకు కుటుంబంతో సహా అందరినీ కలుపుకొని హరిశ్చంద్రప్రసాద్ ఆనందించడంతో కథ సుఖాంతమవుతుంది.

సత్యనారాయణ, మాస్టర్ ఆనంద్, సంఘవి, ఆనందరాజ్, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, మల్లికార్జునరావు, నూతన్ ప్రసాద్, పి.యల్.నారాయణ, రాజా రవీంద్ర, మహర్షి రాఘవ, బెనర్జీ, అశోక్ కుమార్, వర్ష, కళ్ళు చిదంబరం, బండ్ల గణేశ్, తిరుపతి ప్రకాశ్, ప్రసన్నకుమార్, సత్యప్రియ, సన, రజిత నటించారు. ఈ చిత్రానికి ఎస్.ఏ.రాజ్ కుమార్ సంగీతం ఓ ఎస్సెట్ గా నిలచింది. సీతారామశాస్త్రి, సామవేదం షణ్ముఖ శర్మ, భువనచంద్ర, ఇ.ఎస్.మూర్తి పాటలు పలికించారు. ఇందులోని “రోజావే చిన్ని రోజావే…”, “కిల కిల నవ్వే…”, “అడుగో మహరాజు…”, “చుక్కలన్ని ఒక్కటై…”, “ఝలకు ఝలకు…” అంటూ సాగే పాటలు అలరించాయి.

‘సూర్యవంశం’ చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ప్రముఖ దర్శకుడు విక్రమన్ కథ, దర్శకత్వంలో తమిళ ‘సూర్యవంశం’ రూపొందింది. తెలుగులో విజయం సాధించగానే ఈ చిత్రాన్ని పద్మాలయా సంస్థ హిందీలో అమితాబ్ బచ్చన్, సౌందర్య, జయసుధతో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో ‘సూర్యవంశం’ పేరుతోనే రీమేక్ చేశారు. అది అంతగా ఆకట్టుకోలేక పోయింది.

Read Also:Honor Killing: ఏపీలో పరువుహత్య.. కూతుర్ని దారుణంగా చంపిన తండ్రి