(మార్చి 7న ‘ఒసేయ్ … రాములమ్మా!’ 25 ఏళ్ళు)
అద్భుతాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఇండస్ట్రీ హిట్స్ గా నిలుస్తాయని కొన్ని చిత్రాలు నిరూపించాయి. సదరు చిత్రాలతోనే అదరహో అనిపించిన విజయశాంతి ‘లేడీ సూపర్ స్టార్’గా సంచలన విజయం సాధించిన చిత్రాలలో ‘ఒసేయ్ రాములమ్మా!’ ఓ అద్భుతం. అంతకు ముందు “ప్రతిఘటన, కర్తవ్యం” చిత్రాలలో తనదైన బాణీ పలికించిన విజయశాంతి ‘రాములమ్మ’గా చూపిన విశ్వరూపం మరపురానిది. మరువలేనిది. ఇక దర్శకరత్న దాసరి నారాయణ రావు ‘ఒసేయ్…రాములమ్మా!’ చిత్రాన్ని తీర్చిదిద్దిన వైనాన్నీ ఎవరూ మరచిపోలేరు. దాసరి ఫిలిమ్ యూనివర్సిటీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం దాసరి పద్మ సమర్పణలో రూపొందింది. 1997 మార్చి 7న విడుదలై విజయదుందుభి మోగించింది. ఇందులో కృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇక దాసరి నారాయణరావు పెద్దన్న అనే పాత్రలో నటించి అలరించారు.
బడుగులు, బలహీన వర్గాలవారిని ఉన్నవారు ఎలా తమ వాంఛల కోసం వాడుకొని వదిలేస్తుంటారో అందరికీ తెలిసిందే! ఈ నాటికీ కొన్ని ఊళ్ళలో వేళ్ళూని కొని ఉన్న ఫ్యూడల్ వ్యవస్థ, దానికి కొమ్ము కాసేవారి దౌర్జన్యం కళ్ళకు కడుతూ ‘ఒసేయ్…రాములమ్మా!’ చిత్రం పాతికేళ్ళ క్రితమే రూపొందింది. ఈ చిత్రకథలోకి తొంగి చూస్తే… రాములమ్మ తమ గూడెంలో అందరికీ అందుబాటులో ఉండే అమ్మాయి. ‘ఒసేయ్..రాములమ్మా’ అంటూ కేక వేస్తే చాలు, ఏం చేయాలంటూ వెళ్ళి చేతనైన పనిచేసి పెట్టే అమాయకురాలు. అలాంటి అమ్మాయి, తన కన్నవారు పనిచేసే దొర ఇంటికి పోయి పనిచేసుకుంటూ ఉంటే, పెద్ద దొర ఆ పసిపిల్లను లొంగదీసుకోవడం, దాంతో రాములమ్మ తల్లి కావడం జరుగుతాయి. రాములమ్మ ఓ బిడ్డకు జన్మనిస్తుంది. దొర తన అనుయాయులతో ఆ బిడ్డను, రాములమ్మను హైదరాబాద్ తీసుకుపోయి, గండిపేట గెస్ట్ హౌస్ లో పెట్టండని చెబుతాడు.
సగం దారిలో దొర ఆజ్ఙమేరకు రాములమ్మ బిడ్డను, ఆమెను, ఆమె కన్నవారిని చంపాలనుకుంటారు. రాములమ్మ పరారవుతుంది. ఆమె తల్లిదండ్రులు చనిపోతారు. అడవిలో ఉండే పెద్దన్నకు ఆ బాబు దొరుకుతాడు. ఇక రాములమ్మను వేరేవాళ్ళు చేరదీస్తారు. ఆమె వయసులో మరింత అందంగా కనిపిస్తుంది. తనను ఏ దొర అయితే నాశనం చేశాడో, అతని ఇంట్లోనే పని చేస్తుంటుంది. రాములమ్మను చూసి దొర కొడుకు మనసు పడతాడు. ఆమెను అందంగా అలంకరించి, దొర కొడుకు దగ్గరకు పంపుతారు. అయితే, నీతి తప్పని రాములమ్మ, తాను దొర వల్ల తల్లినయ్యాను కాబట్టి, ఆ నీచుణ్ణి కూడా కొడుకులాగే చూస్తుంది. వాడిని చంపేస్తుంది. రాములమ్మను దొర ముందు పడేస్తారు అతని మనుషులు. మిగిలిన ముగ్గురు కొడుకులను పిలిచి, చంపమంటాడు. దొరలతో పండితే తప్పులేదని చెప్పమంటారు. తాను ఎందుకు దొర కొడుకును చంపిందో దొరకే తెలిసేలా చెబుతుంది. దాంతో రెచ్చిపోయిన దొర, ఆమెను నీచంగా, నికృష్టంగా చంపమని చెబుతాడు. ఆమెను అభిమానించే ఒకతను తప్పిస్తాడు. పారిపోయిన రాములమ్మను కొమరన్న చేరదీస్తాడు. ఆమెను రాములక్కగా తీర్చిదిద్దుతాడు. దొర, అతని మనుషులు చేసే ప్రతి అన్యాయాన్ని ఎదిరిస్తూ, సామాన్యులకు న్యాయం చేసేలా చూస్తుంటుంది రాములమ్మ.
ఆమె దాడులను అదుపు చేయడానికి కృష్ణమోహన్ అనే ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తారు. అతని నిజాయితీ తెలుసుకున్న రాములక్క, ఆమె దళం లొంగిపోతారు. పెద్దన్నను కూడా అరెస్ట్ చేస్తారు. కృష్ణమోహన్ ను వేరే డిపార్ట్ మెంట్ కు బదిలీ చేయడంతో ఆయన ఎదురు తిరుగుతాడు. తన వల్ల అన్యాయం అయిన రాములమ్మను, ఆమెతో పాటు ఉన్నవారిని జైలు నుండి తప్పిస్తాడు. రాములమ్మను గోడ దాటిస్తూ ఉండగా, కృష్ణమోహన్ పోలీసు గుళ్ళకు బలి అవుతాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్న రాములమ్మను బయటకు తీసుకురావడానికి కస్టడీలో ఉన్న పెద్దన్నను తీసుకు వచ్చి, ఆమె ఉండే ప్రాంతంలో చిత్రహింసలు చేస్తారు. పెద్దన్నను తప్పించడానికి రాములమ్మ బయటకు వచ్చి, ఆయనను తీసుకు వెళ్తూండగా అతణ్ణీ పోలీసులు మట్టు పెడతారు. తరువాత రాములమ్మను మోసం చేసి, ఆమెను చేరదీసిన గుడిసెల రామసామి పోలీసులు పట్టుకొనేలా చేస్తాడు. రామసామిని అక్కడే చంపేసి జైలుకు పోతుంది రాములక్క. ఆమెకు ఉరి శిక్ష వేస్తారు. ఉరితీసే తలారికి సైతం ఒకప్పుడు సాయం చేసి ఉంటుంది రాములక్క. దాంతో ఆమె చేతులు వెనక్కి విరచినా, ఆ తలారి కట్లు బిగించడు. రాములమ్మ ఉరిశిక్షను కళ్ళారా చూడాలని దొర వస్తాడు. “దొరలు దొరలే… బానిసలు బానిసలే…” అంటూ విర్రవీగుతాడు. ఉరికంబం దగ్గర నుండి పరుగెత్తుకుంటూ వచ్చి, ఓ మిషన్ గన్ అందిపుచ్చుకొని, దొరను చితక బాది, వాడినే ఉరితీస్తుంది రాములమ్మ. చివరకు ఆమె పోలీసులకు లొంగిపోవడంతో కథ ముగుస్తుంది.
ఇందులో దొరగా రామిరెడ్డి నటించగా, మిగిలిన పాత్రల్లో రామ్ కీ, తెలంగాణ శకుంతల, సుత్తివేలు, శివపార్వతి, అశోక్ కుమార్, రఘునాథ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సమకూర్చిన సంగీతం పెద్ద ఎస్సెట్. ఆయన బాణీలకు డాక్టర్ సి.నారాయణ రెడ్డి, సుద్దాల అశోక్ తేజ, గూడ అంజయ్య, జయవీర్ రాసిన పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. అన్నిటి కన్నా మిన్నగా సినారె రాసిన టైటిల్ సాంగ్ “ఓ ముత్యాల కొమ్మా… ” అంటూ సాగే పాట అనూహ్యంగా జనం నోళ్ళలో నానింది. “రాములమ్మ ఓ రాములమ్మ…”, “లచ్చులో లచ్చన్నా…”, “ఓ చౌదరిగారు… ఓ నాయుడుగారు…”, “పుల్లలామంటివి కదరా…”, “ఏ అసురుడు…”, “అడ్డాలోరి బుడ్డయ్యా…”, “ఎరుపు రంగు యాడ ఉంటే…” అంటూ సాగే పాటలు సైతం ప్రేక్షకులను అలరించాయి.
ఈ చిత్రం ద్వారా విజయశాంతికి ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలిమ్ ఫేర్ అవార్డు దక్కాయి. వందేమాతరం శ్రీనివాస్ ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డుతో పాటు, ఫిలిమ్ ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఈ అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డులు చూరగొంది ‘ఒసేయ్… రాములమ్మా!’. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు రాబడి చూసింది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ద్విశతదినోత్సం జరుపుకుంది. దాసరి నారాయణ రావు, విజయశాంతి సినీజీవితాల్లో చివరి సూపర్ డూపర్ హిట్ గా ‘ఒసేయ్…రాములమ్మా!’ నిలచిపోయింది.