2022 Filmy Rewind: నలుపు వెనుకే తెలుపు… చీకటి వెనుకే వెలుగు అన్నట్టుగా ఈ యేడాదీ చిత్రసీమ విషాద వినోదాల కలబోతను తలపించింది. ఆగని కాల ప్రవాహంలో 2022 కీలక సంఘటనలకు, విశేష సందర్భాలకు సాక్షిభూతంగా నిలిచింది. తేదీల వారిగా వాటిని ఓసారి గుర్తు చేసుకుందాం.
జనవరి:
2: అర్థరాత్రి సెకండ్ షో తర్వాత హైదరాబాద్ కుకట్ పల్లి లోని శివపార్వతి థియేటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ దీనికి కారణమని ప్రాధమిక విచారణలో తేలింది.
6: మహేశ్ బాబు, మంచు లక్ష్మీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. మీనా కుటుంబ సభ్యులకూ కరోనా సోకింది.
10: కరోనా ఉదృతిని దృష్టిలో పెట్టుకుని ఏపీలో రాత్రి కర్ఫ్యూతో పాటు థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
10: ఖుష్ బూ, ఇషాచావ్లా కరోనా బారిన పడ్డారు.
10: ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ పై నటుడు సిద్దార్థ్ వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. అతనిపై మహిళా కమీషన్ ఫైర్ అయ్యింది.
11: ఏపీలో రాత్రి కర్ఫ్యూను 18వ తేదీ నుండి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
11: సైనా నెహ్వాల్ కు నటుడు సిద్ధార్థ్ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు.
11: ప్రముఖ గాయనీమణి లతా మంగేష్కర్, నటి కీర్తి సురేశ్ కరోనా బారిన పడ్డారు.
13: తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ సంస్థను నిర్వహిస్తున్న మోహన్‌బాబు తన పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
13: ఏపీ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు చిరంజీవి అమరావతి వెళ్ళి జగన్ ను కలిశారు. టిక్కెట్ రేట్లతో పాటు సినిమా రంగం సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
17: రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్ పరస్పర అవగాహనతో విడిపోతున్నట్టు ప్రకటించారు. వీరి వివాహం 2004లో జరిగింది.
17: బుల్లితెర ధారావాహిక ‘మహాభారత్’ లో కృష్ణుడి పాత్ర పోషించిన నితిష్ భరద్వాజ తన రెండో భార్యకు సైతం విడాకులు ఇచ్చాడు. 2009లో స్మిత గటెతో వివాహం జరగగా, 2019 నుండి వీరు విడివిడిగా ఉంటున్నారు.
25: కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సీనియర్ నటీమణి షావుకారు జానకి, జానపద గాయకుడు, ‘భీమ్లానాయక్’ ఫేమ్ మొగులయ్య, గాయకుడు సోనూ నిగమ్, దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేదిలకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. సీనియర్ నటుడు విక్టర్ బెనర్జీకి పద్మభూషణ్ ప్రకటించారు.
25: యంగ్ హీరో అదిత్ అరుణ్ తన పేరును త్రిగుణ్‌గా మార్చుకున్నాడు.
ఫిబ్రవరి:
6: నటి శ్రీసుధ భీమిరెడ్డి తో సహజీవనం కారణంగా ఏర్పడిన వివాదంతో సుప్రీమ్ కోర్టు నుండి సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుకు ఊరట లభించింది. సుప్రీమ్ కోర్టు అతనికి బెయిలు మంజూరు చేసింది.
10: చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్. నారాయణమూర్తి తదితరులు సీ.ఎం. జగన్ ను కలిసి సమావేశమయ్యారు.
15: ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేశారు. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చారు.
17: ఏపీలో టిక్కెట్ రేట్లపై ఏర్పాటు చేసిన కమిటీ తుది సమావేశం సెక్రటేరియట్‌లో జరిగింది.
17: ‘ఈ మాయపేరేమిటో’, ‘ఏక్ మినీ కథ’ చిత్రాల నాయిక కావ్యా థాపర్ మద్యం తాగి వాహనం నడపడమే కాకుండా ఓ వ్యక్తిని గాయపరచడంతో జుహూ పోలీసులు కేసు బుక్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
20: ఎఫ్.ఎన్.సి.సి. ప్రెసిడెంట్ ఆది శేషగిరి రావు నేపథ్యంలో కోవడ్ అనంతర పరిణామాలపై సినీరంగ ప్రముఖులు, వివిధ బాడీలకు చెందిన వారు సమావేశమై చర్చించారు.
22: సీనియర్ నటుడు నరేశ్ భార్య రమ్య రఘుపతిపై గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అయితే ఆమెతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తము కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నామని నరేశ్ తెలిపారు.
మార్చి
5: ప్రముఖ తమిళ దర్శకుడు బాలా తన భార్య మత్తుమలార్ కు విడాకులు ఇచ్చారు. 2004లో వీరి వివాహం కాగా, నాలుగేళ్ళుగా వీరు విడివిడిగా ఉంటున్నారు.
7: ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ల ను క్రమబద్ధీకరిస్తూ కొత్త జీవోను తీసుకొచ్చింది. కొత్త జీవో పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
8: ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపికైంది. సురేశ్ కొండేటి ప్రెసిడెంట్ గా, ఎం. లక్ష్మీనారాయణ జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యారు.
20:2019లో నడిగర్ సంఘంకు జరిగిన ఎన్నికల ఓట్లను వివిధ కారణాల వల్ల లెక్కించలేదు. తాజాగా కోర్టు ఆదేశాలను అనుసరించి ఓట్లు లెక్కించి, అధ్యక్షుడిగా నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తీ గెలుపొందినట్టు ప్రకటించారు.
22: పద్మ అవార్డుల ప్రదానోత్సవం న్యూ ఢిల్లీలో జరిగింది. మొగలయ్యతో పాటు గరికపాటి నరసింహారావు పద్మశ్రీ పురస్కారం స్వీకరించారు.
28: కరోనా కారణంగా రెండేళ్ళ పాటు ఆస్కార అవార్డు ప్రదానోత్సవం ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగలేదు. ఈసారి ఈ వేడుకను లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో వైభవంగా జరిపారు. ‘డ్యూన్’ చిత్రానికి ఏకంగా ఆరు అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రంగా ‘కోడా’, ఉత్తమ నటుడిగా విల్ స్మిత్, నటిగా జెస్సికా చాస్టెయిన్, దర్శకుడిగా జాన్ కాంపియన్ ఎంపికయ్యారు.
28: పద్మ అవార్డు ప్రదానోత్సవం రెండో విడత న్యూఢిల్లీలో జరిగింది. షావుకారు జానకి, సోనూ నిగమ్ పురస్కారాలు పొందారు.
ఏప్రిల్
3: రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో సమయానికి మంచి పార్టీలు జరగడం, డ్రగ్స్ వాడకంపై సమాచారం అందుకున్న పోలీసులు ఎక్సైజ్ అధికారులతో కలిసి దాడిచేసి 150 మందిని అరెస్ట్ చేశారు. అందులో నాగబాబు కుమార్తె, నటి నిహారిక, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు.
7: రాంగోపాల్ వర్మ ‘మా ఇష్టం’ మూవీ విడుదల కాకుండా నిర్మాత నట్టికుమార్ కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చారు.
24: ప్రముఖ నేపథ్య గాయని లతామంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ ను తొలిసారి ప్రధాని మోదీ అందుకున్నారు.
27: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు నారాయణ దాస్ నారంగ్ కన్నుమూయడంతో ఆయన స్థానంలో ఉపాధ్యక్షులుగా ఉన్న కొల్లి రామకృష్ణను ప్రెసిడెంట్ గా కార్యవర్గం ఎంపిక చేసింది.
28: కిచ్చా సుదీప్ ‘హిందీ ఎంతమాత్రం జాతీయ భాష కాదు’ అంటూ చేసిన వ్యాఖ్యలకు అజయ్ దేవ్ గన్ స్పందించిన తీరు వివాదాలకు తెరలేపింది. అజయ్ దేవ్ గన్ వ్యాఖ్యలను పలువురు దక్షిణాది నటీనటులు ఖండించారు. వారిద్దరూ ట్విట్టర్ వార్ కు ఫుల్ స్టాప్ పెట్టినా, నెటిజన్లు మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా ప్రవర్తించారు.
29: నటుడు గోపీచంద్ ‘లక్ష్యం -2’ సెట్ లో చిన్నపాటి ప్రమాదానికి గురయ్యాడు. మైసూర్ టెంపుల్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా కాలు జారి పడ్డారు.
మే:
1: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రి తలసాని, చిరంజీవి, శ్రీనివాసగౌడ్, మల్లారెడ్డి, భట్టి విక్రమార్క, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, గద్దర్, ఆర్. నారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
13: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రాసిన ‘నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ’ పుస్తకావిష్కరణ జరిగింది. ఇన్ఫోసిస్ సుధామూర్తి ఈ సభకు అధ్యక్షత వహించగా, జస్టిస్ రమణ వీడియో సందేశం పంపారు.
15: ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ ద్వితీయ వివాహం అమలీతో జరిగింది. 2008లో మౌనిక రిచర్డ్ ను ప్రేమ పెళ్ళి చేసుకున్న ఇమ్మాన్ 2021 డిసెంబర్ లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు. ఇప్పటికే వివాహం అయిన అమలికి ఓ పాప ఉంది.
16: నటి కరాటే కళ్యాణీ చిన్న పిల్లలను పెంచుకోవడం వివాదాస్పదమైంది. చైల్డ్ ప్రొటక్షన్ టీమ్ కు అందిన ఫిర్యాదు మేరకు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి, పిల్లల దత్తతకు సంబంధించిన పత్రాలు చూపించమంటూ కళ్యాణీ తల్లికి నోటీసులు అందించారు.
21: బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా నటి బిందుమాధవి నిలిచింది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఓ మహిళ విజేతగా నిలువడం ఇదే మొదటిసారి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కలిసి తొలిసారి ఓటీటీలో దీనిని ప్రసారం చేశారు. 84 రోజులు సాగిన ఈ షోలో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.
24 : ‘జబర్దస్త్’ ఫేమ్ రాచకొండ ప్రసాద్ (ఆర్పీ) వివాహ నిశ్చితార్థం విశాఖకు చెందిన లక్ష్మీ ప్రసన్నతో జరిగింది. ‘కిరాక్’ ఆర్పీ ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
26: గత యేడాది అక్టోబర్ లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి, 22 రోజుల పాటు జైలులో గడిపిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది.
28: ఎన్టీయార్ శతజయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ చౌరస్తాలో కృష్ణుడి గెటప్ లోని ఎన్టీయార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
జూన్:
2: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ సినిమా టిక్కెటింగ్ మార్కెట్ లోకి అడుగుపెడుతున్నట్టుగా జీవోను విడుదల చేసింది.
5: ప్రముఖ రచయిత, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కు బెదిరింపు లేఖలు అందాయి. ఇటీవల పంజాబ్ లో మూసేవాలా ను హత్య చేసిన మాదిరిగా సల్మాన్, సలీమ్ లను అంతమొందిస్తామంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
18: ‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్స్ సమయంలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వాటిపై ఆమె వివరణ ఇచ్చారు. హింస ఏ మతం పేరుతో చేసినా పాపమే నని ఆమె అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరారు.
21: తెలంగాణ స్టేట్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అనిల్ కుమార్ కూర్మాచలంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో 3 సంవత్సరాలు ఉంటారు.
22: వేతనాలు పెంచేవరకూ షూటింగ్స్ కు హాజరు కామంటూ ఫిల్మ్ ఫెడరేషన్ ను వివిధ యూనియన్లకు చెందిన నాయకులు ముట్టడించారు. ఛాంబర్ దీనిపై స్పందించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోమని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని హితవు పలికారు.
23: ఫిల్మ్ ఛాంబర్ లో ఫెడరేషన్ నాయకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. శుక్రవారం నుండి షూటింగ్స్ లో పాల్గొంటామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. దిల్ రాజు నేతృత్వంలో కో-ఆర్డినేషన్ కమిటీ నియమిస్తున్నట్టు ఛాంబర్, నిర్మాతల మండలి తెలిపాయి.
జూలై:
1: ఆన్ లైన్ టిక్కెటింగ్ విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో అమలుకు ఏపీ హైకోర్ట్ స్టే విధించింది.
3: నటుడు నరేశ్, పవిత్రా లోకేష్ సహజీవనం రసకందాయంలో పడింది. వీరిద్దరూ మైసూర్ లోని ఓ హోటల్ లో ఉండగా, రమ్య కొంతమంది వ్యక్తులతో వారిపై దాడికి దిగింది. దాంతో పోలీసుల సాయంతో వారు హోటల్ గది నుండి బయటపడ్డారు.
6: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజాను, సుప్రసిద్థ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
22: 68వ జాతీయ సినీ అవార్డుల ప్రకటన వెలువడింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపిక కాగా, బెస్ట్ కొరియోగ్రఫీకి సంధ్యారాజు (నాట్యం), మేకప్ కు టి.వి. రాంబాబు (నాట్యం), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (అల వైకుంఠపురములో) ఎంపికయ్యారు.
25: రాజ్యసభ సభ్యునిగా సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రమాణ స్వీకారం చేశారు.
25: సినిమా రంగ సమస్యలపై 27 మందితో ఓ కమిటీని వేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.
26: సామాజిక మాధ్యమాలలో అశ్లీల చిత్రాలు పెట్టినందుకు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పై ముంబైలోని చెంబూరులో కేసు నమోదు చేశారు.
26: ఆగస్ట్ 1 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది.
28: పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా చటర్జీకి సన్నిహితంగా మెలిగే ప్రముఖ నటి అర్పితా ముఖర్జీ నివాసాలలో సోదాలు జరిపిన ఈడీ అధికారులు కోట్ల రూపాయల నగదు లభించడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
28: చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి నేపాల్ లో నడిపిన కాసినో దందాపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో అమీషా పటేల్, ముమైత్ ఖాన్, ఈషా రెబ్బ తదితరుల ప్రమేయం ఉందని ప్రాధామిక విచారణలో తేలిందని వార్తలు వస్తున్నాయి.
31: నారాయణదాస్ నారంగ్ మరణానంతరం తాత్కాలికంగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న కొల్లి రామకృష్ణ పదవి కాలం ముగియడంతో కార్యవర్గ సభ్యులు మెజారిటీ నిర్ణయంతో బసిరెడ్డి ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆగస్ట్ 1 నుండి షూటింగ్స్ ఆపివేయాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాన్ని ఫిల్మ్ ఛాంబర్ బలపరిచింది.
ఆగస్ట్:
23: ఆగస్ట్ 25 నుండి అత్యవసరమైన చిత్రాల షూటింగ్స్ జరుపుకోవచ్చని, సెప్టెంబర్ 1 నుండి అన్ని సినిమాల షూటింగ్స్ కు అనుమతి ఇవ్వబోతున్నామని ఛాంబర్, నిర్మాతల మండలి ప్రతినిధులు తెలిపారు. వివిధ యూనియన్లతో జరిపిన చర్చలు సఫలీకృతం అయినట్టు వారు పేర్కొన్నారు.
29: స్టార్ యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో తనని వేదిస్తున్నారంటూ నెటిజన్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా విజయ్ దేవరకొండపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి తీశాయి.
29: ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘రుద్రమదేవి’ చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ ఇచ్చినా, సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించలేదని ఆరోపిస్తూ, సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది.
సెప్టెంబర్
18: కశ్మీర్ లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సినిమాల ప్రదర్శన తిరిగి ప్రారంభమైంది. దక్షిణ కశ్మీర్ లోని సోషియాన్, పుల్వామా ల్లో ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ లను జమ్ము – కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇందులో ‘ట్రిపుల్ ఆర్’తో పాటు, ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రాలను ప్రదర్శించారు.
20: అంతర్జాతీయ ఉత్తమ చిత్రం కేటగిరికి గానూ ఆస్కార్ కు భారత్ నుండి గుజరాతీ సినిమా ‘చెల్లో షో’ ఎంపికైంది. టి.ఎస్. నాగాభరణ ఛైర్మన్ గా వ్యవహరించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ ఈ సినిమాను ఎంపిక చేసింది.
25: ఎఫ్.ఎన్.సి.సి. కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో కె.ఎల్. నారాయణ, అల్లు అరవింద్, సురేశ్ బాబు కు చెందిన ప్యానల్ ఘన విజయం సాధించింది. జి. ఆది శేషగిరిరావు అధ్యక్షులుగా విజయం సాధించారు.
27: అలనాటి ప్రముఖ నటీమణి ఆశా పరేఖ్ (79)కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ అవార్డ్ ను ప్రకటించింది. కేంద్ర సెన్సార్ బోర్డ్ తొలి మహిళా ఛైర్ పర్సన్ గా ఆమె సేవలు అందించారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘దిల్ దేకే దేఖో’తో హీరోయిన్ అయ్యారు.
30: దాదా సాహెబ్ పురస్కారంతో పాటు జాతీయ సినిమా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అందచేశారు.
అక్టోబర్
1: అల్లు స్టూడియోస్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. అల్లు రామలింగయ్య శతజయంతిని పురస్కరించుకుని ప్రచురించిన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
9: 67వ ఫిల్మ్ ఫేర్ సౌతిండియన్ అవార్డ్స్ బెంగళూరులో జరిగాయి. ఉత్తమ చిత్రంగా ‘పుష్ప’, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా సాయి పల్లవి, దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. జీవన సాఫల్యపురస్కారాన్ని అల్లు అరవింద్ కు అందించారు.
26: ‘లైగర్’ సినిమా పంపిణీ దారులు కొందరు తనను వేదిస్తున్నారంటూ పూరి జగన్నాథ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
26: సరోగసి ద్వారా పిల్లలను పొందిన నయనతార, విఘ్నేష్ చట్టప్రకారమే వ్యవహరించారంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ నియమించిన కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది.
27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
29: అరుదైన కండరాల వ్యాధికి తాను గురైనట్టు స్టార్ హీరోయిన్ సమంత ప్రకటించింది. ఆమె నటించిన ‘యశోద’ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేయడం సంచలనంగా మారింది.
31: ఎన్టీయార్ శత జయంతి సందర్భంగా అమెరికాలో ఉన్న అలనాటి నటి ఎల్. విజయలక్ష్మిని ఇండియాకు పిలిపించి, ఎన్టీయార్ పురస్కారంతో సత్కరించారు.
నవంబర్
3: ఎపీ ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా పోసాని కృష్ణ మురళీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
18: ‘లైగర్’ మూవీ పెట్టుబడుల విషయమై నిర్మాతలు ఛార్మి, పూరి జగన్నాథ్ లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.
20: 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫీ) గోవాలో మొదలైంది. ఈ యేడాది నాలుగు చిత్రాలకు ఇండియన్ పనోరమా కేటగిరిలో చోటు దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ 2022 అవార్డుకు మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేసినట్టు ప్రారంభోత్సవ వేడుకలో ప్రకటించారు.
28: గోవాలో ఇఫీ ముగింపు ఉత్సవంలో చిరంజీవి ‘బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు.
30: ‘లైగర్’ మూవీలో పెట్టుబడుల విషయమై ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మీలను విచారించిన ఈడీ తాజాగా విజయ్ దేవరకొండను విచారణకు పిలిపించింది.
డిసెంబర్
3: న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ‘ట్రిపుల్ ఆర్’ దర్శకుడు రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా ఎంపిక చేసింది. దీంతో ‘ట్రిపుల్ ఆర్’కు ఆస్కార్ ఆశలు మరింత మెరుగయ్యాయి.
12: అగ్రకథానాయకులతో చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.
12: లాస్ ఏంజెల్స్ లోని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి (ట్రిపుల్ ఆర్)ని ఎంపికచేసింది.
16: సినీ నిర్మాత దాసరి కిరణ్ ను తిరుమల తిరుపతి దేవస్థాన కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియామక పత్రం జారీ చేసింది.
18: బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. 40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని శ్రీహాన్ షో నుండి డ్రాప్ అయ్యాడు. కానీ వ్యూవర్స్ చాయిస్ శ్రీహానే అంటూ నాగార్జున కొసమెరుపు ఇచ్చారు.