NTV Telugu Site icon

Prabhas Eeshwar: ఇరవై ఏళ్ళ ‘ఈశ్వర్’

Eeshwar Movie

Eeshwar Movie

Prabhas Eeshwar: అప్పటికే తెలుగు చిత్రసీమలో వారసుల హవా విశేషంగా వీస్తోంది. టాప్ ఫోర్‌లో ముగ్గురు సినిమా రంగానికి చెందిన వారసులే. తరువాతి తరం టాప్ స్టార్స్ లోనూ మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటివారు అలరిస్తున్న సమయమది. తమ అభిమాన హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా ఆయన తమ్ముని తనయుడు ప్రభాస్ అరంగేట్రం చేస్తున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందంతో చిందులు వేశారు. ప్రభాస్ కు ‘యంగ్ రెబల్ స్టార్’ అంటూ టైటిల్ ఇచ్చేసి ఆయన మొదటి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూడసాగారు. వారిని మురిపించడానికి ప్రభాస్ ‘ఈశ్వర్’గా జనం ముందు నిలిచారు. జయంత్ సి.ఫరాన్జీ దర్శకత్వంలో నటనిర్మాత అశోక్ కుమార్ తమ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ‘ఈశ్వర్’ 2002 నవంబర్ 11న విడుదలైంది.

కథ విషయానికి వస్తే.. తల్లి లేని ఈశ్వర్ అల్లరి చిల్లరగా ధూల్ పేటలో తిరుగుతూ ఉంటాడు. అతని తండ్రి గుడుంబా కాస్తూ ఉంటాడు. ఈశ్వర్ తండ్రి సుజాత అనే ఆమెను పెళ్ళాడతాడు. ఆమెకు ఇరవై ఏళ్ళ నుంచీ ఈశ్వర్ తెలుసు. అందువల్ల ఈశ్వర్ అంటే అభిమానం చూపిస్తుంది. కానీ సవతి తల్లిని ఈశ్వర్ ఎప్పుడూ ఏవగించుకుంటూ ఉంటాడు. ఈశ్వర్ ఓ సారి రోడ్ లో ఇందు అనే అమ్మాయిని చూసీ చూడగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఈశ్వర్ ను ప్రేమిస్తుంది. అయితే ఇందు తండ్రి దుర్గా ప్రసాద్ కు ధనగర్వం ఉంటుంది. పేదలంటే అసహ్యించుకుంటూ ఉంటాడు. అతను ఆ ఏరియాకు ఎమ్మెల్యే. దాంతో మరింత రెచ్చిపోతూ ఉంటాడు. ఈశ్వర్, ఇందు ప్రేమ తెలిసి, ఈశ్వర్ ను అంతం చేయాలని చూస్తాడు. తండ్రి ఊళ్ళో లేని సమయంలో ఈశ్వర్‌తో ఇందు చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంది. అతను రాగానే ఈశ్వర్ ను పోలీసులతో కుల్లబొడిపిస్తాడు. ఇందు కనిపించదు. దాంతో ఆమెను ఏంచేశారోనని దుర్గాప్రసాద్ ఈశ్వర్ తండ్రి, సవతితల్లిని కూడా హెచ్చరిస్తాడు. చివరకు ఇందు, ఈశ్వర్ నే కోరుకుంటూ ధూల్ పేట వస్తుంది. అది తెలిసిన తండ్రి ఈశ్వర్ సవతి తల్లిని చిత్రహింసలకు గురి చేస్తాడు. ఆ దాడిలో ఆమె చనిపోతుంది. ఆమెను చూడటానికి పోలీసులు ఈశ్వర్ ను తీసుకు వస్తారు. దహనసంస్కారాలు కాగానే, ఈశ్వర్ దుర్గాప్రసాద్ మనుషులను చితగ్గొడతాడు. ఇందును పెళ్ళాడి తల్లి ఆత్మకు శాంతి చేకూర్చాలని చూస్తాడు. పెళ్ళి జరుగుతూ ఉండగా, దుర్గాప్రసాద్ పోలీసులను వేసుకొని వస్తాడు. ధూల్ పేట జనం తిరగబడతారు. తండ్రిని కాలుతో తన్నిన దుర్గా ప్రసాద్‌ను ఈశ్వర్ బాదేస్తాడు. అందరూ అతడిని చంపబోతారు. ఈశ్వర్ వదిలేయమని చెబుతాడు. అదే సమయంలో దుర్గాప్రసాద్ సొంత కొడుకు కూడా వచ్చి, చెల్లెలి పెళ్ళిని బలపరుస్తాడు. దుర్గాప్రసాద్ లోనూ మార్పు వస్తుంది. చివరకు ఈశ్వర్ తో కూతురు పెళ్ళి జరిపిస్తాడు దుర్గాప్రసాద్.

ఇందులో ఈశ్వర్‌గా ప్రభాస్, ఇందుగా శ్రీదేవి (ఓనాటి అందాలతార మంజుల కూతురు) నటించగా, మిగిలిన పాత్రల్లో శివకృష్ణ, రేవతి, అశోక్ కుమార్, ధీరజ్ కృష్ణ, రవికాంత్, హనుమంతు, అశోక్ కుమార్, అభినయ కృష్ణ, అల్లరి సుభాషిణి, పావలా శ్యామల ఇతర పాత్రధారులు. ఈ చిత్ర నిర్మాత అశోక్ కుమార్ హీరోయిన్ తండ్రిగా నటించారు. ఈ నాటి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఇందులో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా కనిపించడం విశేషం. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన ఎస్సెట్. కృష్ణంరాజు పాత చిత్రాలలో పోలిన సంభాషణలు కొన్ని ఇందులో వినిపిస్తాయి. “రెండువందల పదకొండు… అది మా ఇంటి నంబర్ కాదు.. నా వంటిపై పడ్డ దెబ్బలు… దెబ్బకు దెబ్బ తీయకపోతే… నా అబ్బకు పుట్టినవాణ్ణి కాను…” అంటూ ప్రభాస్ చెప్పిన వైనం అభిమానులను కిర్రెక్కించింది.

ఈ సినిమాకు ఆర్.పి.పట్నాయక్ బాణీలు కట్టగా, సీతారామశాస్త్రి పాటలు పలికించారు. ‘అమీర్ పేటకు ధూల్ పేటకు షెహరొకటేరా…’,‘గుండెలో వాలవా.. చెలి చిలకా..’, ‘ఓలమ్మో ఓలమ్మో..’, ‘ధిందిరనా ధిందరనా..’, ‘ఇన్నాళ్ళూ చూడకున్నా..’, ‘కోటలోని రాణి..’ అంటూ సాగే పాటలు అలరించాయి. సినిమాలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం, సన్నివేశాలు కూడా పాతగా కనిపించడంతో పెద్దగా అలరించలేకపోయింది. అయితే నటునిగా ప్రభాస్ కు మంచి మార్కులే సంపాదించి పెట్టింది.
(నవంబర్ 11న ‘ఈశ్వర్’కు 20 ఏళ్ళు)