Nail Cutting : మన సంప్రదాయంలో సాయంత్రం వేళకు, ముఖ్యంగా సూర్యాస్తమయ సమయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, అందుకే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే సాయంత్రం తర్వాత చెత్త బయట వేయడం, డబ్బులు ఇవ్వడం లేదా గోళ్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదనే నియమం ఉంది. రాత్రిపూట గోళ్లు కత్తిరిస్తే ఇంట్లోని పెద్దలు మందలించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ నమ్మకం వెనుక కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాకుండా, లోతైన శాస్త్రీయ, భద్రతాపరమైన , ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి.
పూర్వ కాలంలో నేటిలా విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు కాబట్టి రాత్రిపూట కిరోసిన్ దీపాలు లేదా కొవ్వొత్తుల వెలుతురులో ఇళ్లన్నీ చీకటిగా ఉండేవి. తక్కువ వెలుతురు ఉండటం ఒక కారణమైతే, ప్రస్తుత కాలంలో మనం వాడుతున్న ఆధునిక నెయిల్ కట్టర్లు అప్పట్లో లేకపోవడం మరో కారణం. ఆ రోజుల్లో గోళ్లను కత్తిరించడానికి కత్తులు లేదా ఇతర పదునైన లోహపు ముక్కలను వాడేవారు. చీకటిలో వీటిని వాడటం వల్ల ప్రమాదవశాత్తూ వేళ్లు తెగి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉండేది. ఒకవేళ రాత్రివేళ పొరపాటున గాయం అయితే, వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లడం లేదా చికిత్స పొందడం ఆ రోజుల్లో కష్టంతో కూడుకున్న పనిగా ఉండేది. దీనికి తోడు కత్తిరించిన గోళ్ల ముక్కలు చీకటిలో ఎక్కడ పడ్డాయో తెలియక ఆహారంలో పడినా లేదా ఇతరుల కాళ్లకు గుచ్చుకున్నా ప్రమాదమే. అందుకే భద్రత, పరిశుభ్రత దృష్ట్యా రాత్రిపూట ఈ పనిని నివారించేవారు. కాలక్రమేణా ప్రజలు దీనిని ఖచ్చితంగా పాటించాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక వివరణలు, కథలను జోడించి ఒక నియమంగా మార్చారు.
ఆరోగ్య రీత్యా కూడా రాత్రిపూట గోళ్లు కత్తిరించడం మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. రోజంతా రకరకాల పనులు చేయడం వల్ల గోళ్లలో మురికి, క్రిములు చేరుతాయి. రాత్రిపూట చేతులు కడుక్కోకుండా గోళ్లు కత్తిరించినప్పుడు ఆ ముక్కలు పరుపులు లేదా సోఫాలపై పడితే, వాటిలోని బ్యాక్టీరియా సులభంగా వ్యాప్తి చెంది ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. పగటిపూట అయితే మనం గోళ్లను స్పష్టంగా చూసి శుభ్రంగా పారవేయవచ్చు, కానీ రాత్రిపూట అది సాధ్యం కాదు. ఇక ఆయుర్వేద కోణం ప్రకారం రాత్రివేళ చంద్రుని ప్రభావం శరీరంలోని శక్తులపై బలంగా ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో గోళ్లు కత్తిరించడం శరీర అంతర్గత సమతుల్యతను దెబ్బతీస్తుందని నమ్ముతారు.
మన గోళ్లు కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతాయి కాబట్టి, స్నానం చేసిన తర్వాత లేదా చేతులు కడిగిన తర్వాత గోళ్లు కత్తిరించుకోవడం చాలా మంచిది. ఆ సమయంలో గోళ్లు నీటిలో నాని మెత్తగా ఉంటాయి కాబట్టి అవి చిట్లిపోకుండా సులభంగా వస్తాయి. ఒకవేళ గోళ్లు మరీ గట్టిగా ఉన్నట్లయితే, కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో లేదా నూనెలో నానబెట్టి ఆ తర్వాత కత్తిరించుకోవాలి. గోళ్లు కత్తిరించిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కుని, ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాసుకుంటే గోళ్లు, చర్మం పొడిబారకుండా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు విద్యుత్, ఆధునిక నెయిల్ కట్టర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, పరిశుభ్రత , భద్రత దృష్ట్యా పగటిపూట గోళ్లు కత్తిరించుకోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం.

