సైకిల్ తొక్కడం కొందరికి చిన్నప్పటి సరదా. కాస్త పెద్దయ్యాక ఆ సైకిల్ ని మరిచిపోతుంటారు. మరికొందరికి కుక్కపిల్లల్ని, వివిధ పెంపుడు జంతువుల్ని ఇంట్లో పెంచుకుంటారు. జిహ్వ కో రుచి. మనిషి మనిషికో హాబీ. నాణేలు, కరెన్సీ నోట్లు, తపాలా బిల్లలు, శతాబ్దం నాటి పుస్తకాలు వంటి ప్రాచీన వస్తువులను చాలా మంది సేకరిస్తారు. మరికొందరు బుక్స్ అవీ సేకరిస్తారు. వీరందరికంటే భిన్నమయిన వ్యక్తి ఒకరున్నారు. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ పెండ్సే విభిన్నమయిన వ్యక్తి. ఆయనకు వింటేజ్ సైకిళ్ళు సేకరించడం హాబీ. హైదరాబాద్‌లో సుధాకార్స్ లా అన్నమాట. ఇక్కడ కార్లు వున్నట్టే ఆయన దగ్గర వందల మోడల్స్ సైకిళ్ళు వుంటాయి.
గత కొన్నాళ్ళుగా ఆయన వివిధ రకాల మోడల్స్ సైకిళ్ళు సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. వాటిని భద్రపరచడానికి తన ఇల్లును ఏకంగా మ్యూజియంగా మార్చేశారు. పుణె నగరంలోని కార్వేనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న విక్రమ్ పెండ్సేకు చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. డిగ్రీ చదువుతున్న సమయంలోనే.. మోటార్ సైకిల్ రిపేర్ గ్యారేజీని ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. విక్రమ్ తొలిసారి BSA సైకిల్‌ను 1995లో కొన్నాడు. ఇక, అక్కడ నుంచి అతడి సైకిల్ సేకరణ ప్రారంభమైంది.
Vikram Pendse .. Pune
100 ఏళ్ల నాటి పాత మోడల్ సైకిళ్లు ముచ్చట గొలుపుతూ పెండ్సే మ్యూజియంలో ఉన్నాయి. విక్రమ్ పెండ్సే సహోద్యోగి పాండురంగ్ గైక్వాడ్ ఈ మ్యూజియాన్ని ప్రారంభించాడు. గైక్వాడ్ ఒక సైక్లిస్ట్.. దక్షిణాసియా ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. వరుసగా పదిహేనేళ్లుగా పోటీల్లో కూడా పాల్గొన్నాడు. ఈ సైకిళ్ల మ్యూజియం ప్రస్తుతం పుణె ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన రైఫిల్‌తో కూడిన సైకిల్‌ను కూడా పెండ్సే ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఆ మ్యూజియంలో పెట్టడానికి చోటు చాలకుంటే.. గోడమీద సైకిల్స్ వుంచేశారు పెండ్సే. 1970 నాటి గేర్ సైకిళ్లను ఈ మ్యూజియంలో వుంచారు. ఆదివారాల్లో సాధారణ ప్రజలు ఈ మ్యూజియంకు వచ్చి ఇక్కడి సైకిళ్లను చూడొచ్చు. వాటి గురించి తెలుసుకోవచ్చు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు. అలనాటి సైకిళ్ళను చూస్తే పాత రోజులు గుర్తుకువస్తాయంటారు విక్రమ్ పెండ్సే.
BYPOLL: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల