Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి

Milk Storage Tips

Milk Storage Tips

Milk Storage Tips: వేసవికాలంలో ఇంటిల్లిపాదిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో పాలు విరిగిపోవడం ఒకటి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పాలలో బ్యాక్టీరియా వేగంగా పెరిగి, మరిగించేలోపే పాలు పాడైపోతుంటాయి. ముఖ్యంగా ఉదయం తీసుకొచ్చిన పాలు కొద్దిసేపటికే విరిగిపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు.

అయితే, పాలు కొద్దిగా పాతబడ్డాయని అనిపించినా, బయట ఎక్కువ వేడి ఉన్నా పాలు మరిగించే సమయంలో అందులో చిటికెడు బేకింగ్ సోడా లేదా స్వీట్ సోడా కలపడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పాలలో పెరిగే లాక్టిక్ ఆమ్లాన్ని సమతుల్యం చేసి, పాలు విరిగిపోకుండా సహాయపడుతుంది. వేడి కారణంగా పాలలో ఆమ్లత్వం పెరిగితే పాలు త్వరగా పాడైపోతాయి. బేకింగ్ సోడాలో ఉండే క్షార గుణం పాల pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీంతో పాలు ఎక్కువసేపు తాజాగా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది.

ఇక, పాలను నిల్వ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్యాకెట్ పాలు అయినా, డెయిరీ నుంచి తీసుకొచ్చిన పాలు అయినా వెంటనే మరిగించడం మంచిది. ఎక్కువసేపు బయట ఉంచితే పాలు త్వరగా పాడవుతాయి. మరిగించిన వెంటనే వేడి పాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ముందుగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. లేదంటే ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత పెరిగి ఇతర ఆహార పదార్థాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది.

పాలు మరిగించే పాత్ర కూడా పూర్తిగా శుభ్రంగా ఉండాలి. పాత్రలో స్వల్పంగా పులుపు లేదా మిగిలిన ఆహార అవశేషాలు ఉన్నా పాలు విరిగిపోవచ్చు. అలాగే గిన్నెలో ముందుగా కొద్దిగా నీరు పోసి తర్వాత పాలు వేయడం వల్ల పాలు అడుగున అంటుకోకుండా ఉంటాయి. మాడిన వాసన కూడా రాదు. మొత్తంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో కూడా పాలను తాజాగా, సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు.