How To Prevent Food From Sticking: వంట చేసేటప్పుడు కూరలు అడుగున అంటుకుని మాడిపోతే ఆ ఆనందమంతా ఆవిరైపోతుంది. రుచి చెడిపోవడంతో పాటు ఆ గిన్నెను తోముకోవడం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది నూనె ఎక్కువగా పోస్తుంటారు. కానీ ప్రతిసారీ అలా ఎక్కువ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా, తక్కువ నూనెతోనే కూరలు అడుగు అంటకుండా చేసుకోవడానికి కొన్ని సులువైన చిట్కాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఏదైనా వంటకం చేసే ముందు కడాయిలో కొద్దిగా నూనె వేసి, దాని అడుగు భాగం అంతటా బాగా పట్టించాలి. దీనికోసం చిన్న చెంచా లేదా సిలికాన్ బ్రష్‌ను ఉపయోగిస్తే నూనె సమానంగా పడుతుంది. ఇలా చేయడం వల్ల కూర అడుగున అంటుకునే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఇక ఉల్లిపాయలు, మసాలాలు వేయించే సమయంలో అవి గిన్నెకు అతుక్కుంటున్నట్లు అనిపిస్తే, వెంటనే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు చల్లాలి. దీనివల్ల మసాలాలు నాని, మాడిపోకుండా చక్కగా మగ్గుతాయి. అయితే పొడి కూరలు వండేటప్పుడు మాత్రం నీళ్లు చాలా తక్కువగా పోసుకోవాలి గుర్తుంచుకోండి. అలాగే కూరల్లో టమాటాలు వేయాల్సి వస్తే ముక్కలుగా కాకుండా టమాటా గుజ్జును వాడుకోవడం మంచిది. దీనివల్ల కూరకు మంచి గ్రేవీ రావడంతో పాటు తేమగా ఉండి మసాలాలు అడుగున అంటుకోకుండా ఉంటాయి.
మనం చేసే వంటల్లో పాత్ర వేడెక్కే విధానం కూడా చాలా ముఖ్యం. ఏ కూర చేసినా ముందుగా కడాయిని మీడియం మంటపై వేడి చేసి, ఆ తర్వాతే నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాతే తాలింపు గింజలు లేదా కూరగాయలు వేయాలి. ముఖ్యంగా ఖాళీగా ఉన్న నాన్-స్టిక్ కడాయిని ఎక్కువ మంటపై వేడి చేయకూడదని గుర్తుంచుకోండి. ఇక వంట చేసేటప్పుడు చాలామంది గిన్నెలో కూర వేసి అలాగే వదిలేస్తుంటారు. అలా కాకుండా అప్పుడప్పుడు గరిటెతో కలుపుతూ ఉండాలి. మంటను కూడా ఎప్పుడూ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ముఖ్యంగా నాన్-స్టిక్ పాత్రలు వాడేటప్పుడు చెక్క లేదా సిలికాన్ గరిటెలను మాత్రమే ఉపయోగిస్తే పాత్రలు పాడవకుండా ఉంటాయి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే నూనె తక్కువగా ఉన్నా రుచికరమైన వంటలను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.

