టీ, బ్రెడ్, బిస్కెట్లు, చిప్స్.. చివరికి తాగే నీళ్లలో కూడా ప్రోటీన్ ఉందంటూ మార్కెట్లో రకరకాల ఉత్పత్తులు దర్శనమిస్తున్నాయి. పెరుగుతున్న ‘ప్రోటీన్ క్రేజ్’ను క్యాష్ చేసుకునేందుకు అనేక కంపెనీలు ప్యాకెట్‌పై పెద్ద అక్షరాలతో ‘హై ప్రోటీన్’ అని రాసి ప్రచారం చేస్తున్నాయి. అయితే, ప్యాకెట్‌పై ప్రోటీన్ అని రాసి ఉన్నంత మాత్రాన అది ఆరోగ్యకరమైన ఆహారమని నమ్మకూడదని ప్రముఖ న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్ రాయన్ ఫెర్నాండో హెచ్చరిస్తున్నారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా సమయం లేనప్పుడు ప్రోటీన్ బార్లు, ప్యాకేజ్డ్ స్నాక్స్ తింటుంటారు. కానీ, వాటిని కొనేముందు కవర్ వెనుక ఉన్న లేబుల్ చూసి నాలుగు ముఖ్యమైన విషయాలు తనిఖీ చేయాలని ఆయన సూచిస్తున్నారు.
ప్రోటీన్ మూలం ఏంటి? ఎంత పరిమాణంలో ఉంది?
మొదటిగా ఆ ఉత్పత్తుల్లో ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందో పదార్థాల జాబితా (Ingredients List)లో చూడాలి. వే (Whey), పాలు, గుడ్లు లేదా సోయా వంటి నాణ్యమైన మూలాల నుంచి ప్రోటీన్ వస్తోందో లేదో గమనించాలి. శాకాహార లేదా ప్లాంట్-బేస్డ్ ఉత్పత్తులయితే అందులో వాడిన ప్రోటీన్ బ్లెండ్ ఏంటో చూడాలి. ఒకవేళ ఇంగ్రెడియెంట్స్ లిస్ట్‌లో పామాయిల్, మైదా లేదా స్టార్చ్ వంటివి మొదటి వరుసలో ఉంటే, ఆ ఉత్పత్తిలోని ప్రోటీన్ క్లెయిమ్‌లను నమ్మకపోవడమే మంచిది. అలాగే ప్యాకెట్‌పై ప్రోటీన్ అని రాసి ఉన్నప్పటికీ, ఒక్క సర్వింగ్‌కు నిజంగా ఎంత గ్రాముల ప్రోటీన్ అందుతుందో న్యూట్రిషన్ లేబుల్‌లో స్పష్టంగా తనిఖీ చేసుకోవాలి.
దాగి ఉన్న చక్కెరలు (Hidden Sugars)
ప్రోటీన్ స్నాక్ అని ప్రచారం చేసినంత మాత్రాన అందులో చక్కెర ఉండదని అనుకోవడానికి వీల్లేదు. చాలా కంపెనీలు రుచి కోసం లిక్విడ్ గ్లూకోజ్, కార్న్ సిరప్, ఫ్రక్టోజ్ సిరప్‌లను ఉపయోగిస్తాయి. వీటితో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచే ‘మాల్టోడెక్స్ట్రిన్’ (Maltodextrin) వంటి పదార్థాలు ఉన్నాయో లేదో ఇంగ్రెడియెంట్స్ జాబితాలో సరిచూసుకోవాలి. ప్యాకెట్ ముందు భాగంలో ఉండే ఆకర్షణీయమైన ప్రకటనలను చూడకుండా, వెనుక వైపు ఉన్న లేబుల్‌ను తిరగేసి ‘టోటల్ షుగర్స్’ , ‘యాడెడ్ షుగర్స్’ ఎంతున్నాయో పరిశీలించడం చాలా ముఖ్యం.
క్యాలరీలు-ప్రోటీన్ నిష్పత్తిని సరిపోల్చండి
ప్రోటీన్ బార్ కొనేముందు అందులోని క్యాలరీలు, ప్రోటీన్ నిష్పత్తిని పోల్చి చూడాలని ఫెర్నాండో సిఫార్సు చేస్తున్నారు. ఉదాహరణకు, 150 నుంచి 180 క్యాలరీలు ఉండి కనీసం 10 నుంచి 12 గ్రాముల వరకు ప్రోటీన్ అందించే ఉత్పత్తులు మంచి ఎంపికగా ఉంటాయి. అలా కాకుండా దాదాపు 300 క్యాలరీలు ఉండి, చాలా తక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటే.. ప్రోటీన్ కోసం ఆ బార్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే, ప్రతీ ఒక్కరి శారీరక అవసరాలు, తినే ఆహార అలవాట్లను బట్టి క్యాలరీల అవసరం మారుతుంటుంది.
ప్రోటీన్ బార్లకు, ఎనర్జీ బార్లకు తేడా తెలుసుకోండి
చాలామంది ప్రోటీన్ బార్లను, ఎనర్జీ బార్లను ఒకటే అనుకుంటారు. కానీ రెండూ వేర్వేరు. ప్రోటీన్ బార్లు శరీరానికి ప్రోటీన్ అందించేలా రూపుదిద్దుకుంటే, ఎనర్జీ బార్లు ఎక్కువగా కార్బోహైడ్రేట్ల ద్వారా తక్షణ శక్తిని ఇవ్వడంపై దృష్టి పెడతాయి. కాబట్టి ఆకలిగా ఉన్నప్పుడు కనబడిన బార్‌ను ప్రోటీన్ కోసమేనని భ్రమపడి తీసుకోకూడదు. కవర్ వెనుక ఉన్న సమాచారాన్ని చదివి అది ఏ రకమైన బార్ అనేది స్పష్టంగా తెలుసుకోవాలి.
సహజమైన ఆహారమే మేలు
ప్యాకేజ్డ్ ప్రోటీన్ ఉత్పత్తులు ఎప్పుడైనా అత్యవసర సమయాల్లో అనుకూలంగా ఉంటాయి తప్ప, రోజువారీ సహజ ఆహారానికి ప్రత్యామ్నాయం కాజాలవు. గుడ్లు, చికెన్, పనీర్, టోఫు, చేపలు, పాలు, పప్పుధాన్యాలు, గింజల నుంచి వచ్చే ప్రోటీన్ శరీరానికి ఎంతో శ్రేయస్కరం. వ్యక్తుల వయస్సు, రోజువారీ శారీరక శ్రమను బట్టి ప్రోటీన్ అవసరాలు మారుతుంటాయి. అందుకే ఇకపై మార్కెట్లో ప్రోటీన్ ప్యాకెట్ కనిపిస్తే వెంటనే నమ్మేయకుండా, వెనక్కి తిప్పి లేబుల్ చదవడం అలవాటు చేసుకోండి!

