Clean Fridge Door Rubber: రిఫ్రిజిరేటర్‌ను శుభ్రం చేసేటప్పుడు మనం సాధారణంగా లోపలి అరలు, డ్రాయర్లు, బయటి డోర్లను మాత్రమే శుభ్రం చేస్తాము. కానీ ఫ్రిజ్ డోర్ రబ్బర్ సీల్ (గాస్కెట్)ను శుభ్రం చేయడం చాలామంది మర్చిపోతుంటారు. నిజానికి ఫ్రిజ్‌లోనే అత్యధికంగా మురికి, బ్యాక్టీరియా, బూజు పేరుకుపోయే ప్రదేశం ఈ రబ్బర్ సీలే..! దాని వల్ల కలిగే నష్టాలు ఏంటి, దాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రిజ్ రబ్బరు సీల్‌పై బూజు ఎందుకు పడుతుంది.?
రిఫ్రిజిరేటర్ డోర్ రబ్బరు సీల్‌కు చిన్న చిన్న మడతలు, సందులు ఉంటాయి. ఫ్రిజ్ వాడే సమయంలో పాలు, పండ్ల రసాలు లేదా ఆహార కణాలు ఈ సందుల్లో పడిపోతుంటాయి. వీటితో పాటు ఫ్రిజ్ డోర్ తరచుగా తెరవడం, మూయడం వల్ల బయటి గాలి లోపలికి వెళ్లి అక్కడ తేమ చేరుతుంది. ఈ తేమ, ఆహార పదార్థాల కలయిక వల్ల ఆ సందుల్లో క్రమంగా నల్లటి బూజు రూపుదిద్దుకుంటుంది. రబ్బరు సీల్‌పై బూజు పెరిగితే అది తన స్థితిస్థాపకతను (Elasticity) కోల్పోతుంది. ఫలితంగా ఫ్రిజ్ డోర్ సరిగ్గా మూసుకోక, లోపలి చల్లటి గాలి బయటకు పోవడం వల్ల ఫ్రిజ్ శీతలీకరణ వ్యవస్థపై భారం పడి కరెంటు బిల్లు పెరుగుతుంది, అలాగే ఆహారం కూడా త్వరగా పాడైపోతుంది.
బేకింగ్ సోడా, వెనిగర్ , ఉప్పు పేస్ట్
ఫ్రిజ్ గాస్కెట్ శుభ్రానికి బేకింగ్ సోడా, వెనిగర్ అద్భుతంగా పనిచేస్తాయి. ఆహార శాస్త్ర పరిశోధనల ప్రకారం బేకింగ్ సోడాకు జిడ్డు, పసుపు మరకలు తొలగించే గుణంతో పాటు దుర్వాసనలను పీల్చుకునే శక్తి ఉంది. ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా తీసుకుని దానికి వెనిగర్ కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఒక మెత్తని గుడ్డను ఈ పేస్ట్‌లో ముంచి, పిండిన తర్వాత రబ్బరు సీల్‌పై ఉన్న మురికిని శుభ్రం చేసుకోవచ్చు. రబ్బర్ లోపలి సందులను శుభ్రం చేయడానికి ఒక పలుచని గుడ్డను ప్లాస్టిక్ చాప్‌స్టిక్ లేదా పుల్లకు చుట్టి, మెల్లగా మడతలలోకి జరిపి మురికిని తొలగించవచ్చు. అయితే రబ్బర్ చిరిగిపోకుండా ఉండటానికి పదునైన లోహపు వస్తువులను (కత్తులు, పిన్నులు) ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
రబ్బింగ్ ఆల్కహాల్‌తో లోతైన శుభ్రత
రబ్బరు సీల్‌లో మురికి చాలా రోజులుగా పేరుకుపోయి మొండిగా మారితే ‘రబ్బింగ్ ఆల్కహాల్’ బాగా ఉపయోగపడుతుంది. ఒక మెత్తటి గుడ్డపై కొద్దిగా ఆల్కహాల్ వేసి పిండిన తర్వాత, ఆ గుడ్డను ప్లాస్టిక్ కార్డ్ (ఉదాహరణకు పాత క్రెడిట్ కార్డ్) చుట్టూ చుట్టి, రబ్బరు సీల్ మడతల్లోకి మెల్లగా జారవిడచాలి. దీనివల్ల చేతులు లేదా సాధారణ గుడ్డలు చేరని లోతైన ప్రదేశాల నుంచి కూడా మురికి సులభంగా బయటకు వచ్చేస్తుంది.
టూత్‌పేస్ట్‌తో మెరిసే రబ్బర్ సీల్
ఇంట్లో ఉండే సాధారణ టూత్‌పేస్ట్‌తో కూడా రబ్బర్ గాస్కెట్‌పై ఉన్న జిడ్డు, పసుపు మరకలను వదిలించవచ్చు. రబ్బరు సీల్‌పై కొద్దిగా టూత్‌పేస్ట్ పూసి 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పాత టూత్‌బ్రష్‌ను తడిపి సందుల్లో సున్నితంగా రుద్దాలి. అనంతరం తడి గుడ్డతో టూత్‌పేస్ట్ అవశేషాలను తుడిచివేసి, ఆపై పొడి గుడ్డతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
శుభ్రం చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రబ్బరు సీల్‌ను ఏ పద్ధతిలో శుభ్రం చేసినా, చివరగా పొడి గుడ్డతో క్షుణ్ణంగా తుడవడం అత్యంత ముఖ్యం. మడతలలో నీరు లేదా తేమ ఉండిపోతే మళ్లీ త్వరగానే బూజు పట్టే అవకాశం ఉంది. శుభ్రం చేసే సమయంలో ద్రవాలతో పనిచేస్తుంటాం కాబట్టి ముందుగా ఫ్రిజ్ ప్లగ్‌ను సాకెట్ నుంచి తీసివేసి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడాలి. అలాగే బూజు వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా చేతులకు రబ్బరు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించడం మంచిది. రబ్బర్‌ను దెబ్బతీసే అమ్మోనియా లేదా ఘాటైన కెమికల్స్ వాడకుండా కేవలం ఇంట్లో లభించే సహజ పదార్థాలనే వాడటం శ్రేయస్కరం.

