Kitchen Sink Tips: కిచెన్‌లో రోజూ గిన్నెలు తోమడం చాలా సాధారణ విషయమే. కానీ, ఎంత జాగ్రత్తగా ఉన్నా సింక్ దగ్గర పనిచేసేటప్పుడు నీళ్ల చుక్కలు, సబ్బు నాచు బట్టల మీద పడి తడిసిపోవడం అంతకన్నా పెద్ద సమస్య! ముఖ్యంగా స్నానం చేసి, శుభ్రమైన బట్టలు వేసుకుని వంటగదిలోకి వెళ్లినప్పుడు ఇలా బట్టలు తడిస్తే చాలు.. ఎక్కడ లేని చిరాకు వచ్చేస్తుంది. దానివల్ల మళ్లీ డ్రెస్ మార్చుకోవడమో, ఆ మరకలను ఉతకడమో అని ఇంకో పని నెత్తిన పడుతుంది. దీని కోసం ఏవేవో కొత్త వస్తువులు కొనాల్సిన అవసరం లేదు, భారీగా ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. మనం పనిచేసే విధానంలో, సింక్ దగ్గర చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఆ చిరాకు నుంచి చాలా సులువుగా బయటపడవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా బట్టలు తడవకుండా ఉండేలా చూసే ఆ 5 సులువైన ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
1. సింక్‌కు బాగా దగ్గరగా నిలబడొద్దు:
చాలామంది గిన్నెలు తోమేటప్పుడు సింక్‌కు బాగా ఆనుకుని నిలబడతారు. దీనివల్ల పాత్రల మీద పడే నీళ్లు ఎగిరి నేరుగా బట్టల మీదే పడతాయి. అందుకే సింక్‌కు కాస్త దూరంగా, కొద్దిగా వెనక్కి జరిగి నిలబడి గిన్నెలు తోమడం అలవాటు చేసుకోండి. కాస్త దూరం ఉండటం వల్ల నీటి చుక్కలు బట్టల వరకు రావు. ముఖ్యంగా పెద్ద పెద్ద పాత్రలు, బాండీలు, ప్లేట్లు కడిగేటప్పుడు ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది.
2. టాప్ వాటర్ ప్రెజర్ తగ్గించండి:
టాప్ స్పీడ్‌గా తిప్పేసి ఫుల్ ప్రెజర్‌తో నీళ్లు వదిలి గిన్నెలు కడిగితే నీళ్లు ఎగిరి పడటం ఖాయం. నీటి ప్రెజర్ ఎక్కువవడం వల్ల బట్టలే కాదు, సింక్ చుట్టుపక్కల ఉండే కౌంటర్ టాప్ అంతా తడిసిపోతుంది. అందుకే టాప్ వాటర్‌ను ఎప్పుడూ మీడియం లేదా అవసరాన్ని బట్టి తక్కువ ఫ్లోలో పెట్టుకోండి. ఒకవేళ మీ సింక్‌కి స్ప్రే నాజిల్ ఉంటే, దాని ప్రెజర్‌ను కూడా అదుపులో ఉంచి వాడటం మంచిది.
3. వాటర్‌ప్రూఫ్ ఆప్రాన్ వాడండి:
మీకు రోజూ బట్టలు తడిసిపోవడం పెద్ద సమస్యగా మారితే, వాటర్‌ప్రూఫ్ ఆప్రాన్ వాడటం చాలా బెస్ట్ ఆప్షన్. ప్లాస్టిక్ లేదా వినైల్ కోటింగ్ ఉన్న ఆప్రాన్ వేసుకుంటే నీళ్లు, సబ్బు నాచు బట్టల మీద పడకుండా అడ్డుకుంటుంది. గిన్నెలు తోమేటప్పుడే కాకుండా, కూరగాయలు కడిగేటప్పుడు, కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
4. సింక్ గట్టుపై చిన్న తువ్వాలు పరచండి:
మనం సింక్ దగ్గర నిలబడే వైపు గట్టుపై ఎప్పుడూ నీటి చుక్కలు నిలిచి ఉంటాయి. మనం ఆనుకున్నప్పుడు ఆ నీరు బట్టలకు అంటుకుని తడిసిపోతాయి. మీ దగ్గర ప్రత్యేకంగా సిలికాన్ స్ప్లాష్ గార్డ్ లేకపోతే, ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. సింక్ అంచు భాగంలో ఒక పాత చిన్న టవల్ లేదా గుడ్డను పరిచి ఉంచండి. అది ఎగిరిపడే నీటిని పీల్చుకోవడమే కాకుండా, చుట్టుపక్కల నీళ్లు విస్తరించకుండా చూస్తుంది.
5. చేతులు తుడుచుకోవడానికి దగ్గరలోనే టవల్ ఉంచుకోండి:
గిన్నెలు తోమేటప్పుడు చేతులు తడవడం సహజం. అయితే తడి చేతులతో పక్కకి వెళ్లి టవల్ తీసుకోవడం బద్ధకించి, చాలామంది ఆ తడి చేతులను వేసుకున్న బట్టలకే తుడిచేస్తుంటారు. దీనివల్ల బట్టలు ఇంకాస్త ఎక్కువ తడిసిపోతాయి. అందుకే సింక్‌కు అందుబాటులో ఒక చిన్న హ్యాండ్ టవల్ ఎప్పుడూ ఉంచుకోండి. వీలైతే గిన్నెలు కడిగేటప్పుడు దాన్ని నడుము దగ్గర కట్టుకున్నా సరే, అవసరం కాగానే వెంటనే చేతులు తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది.

