Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్‌లోనే ఘోరం!

Sample Registration Survey

Sample Registration Survey

Shocking Survey: మన దేశంలో వివాహ వ్యవస్థ.. కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహ బంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయని మన అందరం అనుకుంటాం. అయితే తాజా గణాంకాలు మాత్రం ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా భాగస్వామి లేని మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. విడాకులు తీసుకున్నవారు.. భర్త చనిపోయినవారు.. ఒంటరిగా ఉంటున్న మహిళల శాతం జాతీయ సగటు కంటే సౌత్‌లోనే ఎక్కువగా ఉందట… ఈ పరిస్థితికి కారణం ఏంటి…???

దేశంలో భాగస్వామి లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్యపై శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. జాతీయ స్థాయిలో ఈ సంఖ్య కాస్త తగ్గినా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ శాతం ఆందోళనకరంగా ఉంది. విడాకులు తీసుకున్నవారు, భర్త చనిపోయినవారు, భర్తకు దూరంగా ఉంటున్న వారి సంఖ్య ఐదు దక్షిణ భారత రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉంది. జాతీయ స్థాయిలో భాగస్వామి లేని మహిళల సగటు 5.4 శాతంగా ఉంటే పురుషుల శాతం కేవలం 1.6 శాతంగా నమోదైంది.

×
×
Ad

రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. తమిళనాడు ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడులో అత్యధికంగా 11.6 శాతం మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. కేరళ 10.4 శాతంతో రెండో స్థానంలో ఉండగా.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 8.6 శాతంతో ఉన్నాయి. తెలంగాణలో ఈ సంఖ్య 7.6 శాతంగా రికార్డ్ అయింది. ఇక దేశంలో అత్యల్పంగా బీహార్‌లో కేవలం 2 శాతం మంది మహిళలు మాత్రమే భాగస్వామి లేకుండా ఉన్నారు.

మహిళల వివాహ వయసుకు సంబంధించి కూడా ఈ రిపోర్ట్ కీలక విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు తగ్గుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. జాతీయ స్థాయిలో 2.1 శాతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపే వివాహం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 6.3 శాతం, జార్ఖండ్‌లో 4.9 శాతం బాల్య వివాహాలు నమోదయ్యాయి. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో బాల్య వివాహాలు దాదాపు సున్నా స్థాయికి చేరుకోవడం విశేషం.

పట్టణ.. గ్రామీణ ప్రాంతాల మధ్య మహిళల వివాహ వయసులో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సగటు వివాహ వయసు 22.6 ఏళ్లుగా ఉంటే.. పట్టణాల్లో ఇది 24.4 ఏళ్లుగా ఉంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో మహిళలు వివాహాన్ని కాస్త ఆలస్యంగా చేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యాశాతం, ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కువగా ఉండటమే విడాకులు, ఒంటరి జీవనానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న మహిళలు రాజీ పడి జీవించేందుకు ఇష్టపడకపోవడం కూడా ప్రధాన కారణం.