Why Can’t I Sleep: ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో, లేదంటే సమస్యతో జీవిస్తున్నారు. “సమస్యలు లేని మనిషి” ఉన్నాడంటే అది చాలా అరుదుగా కనిపించే విషయం అంటున్నారు. మీకు తెలుసా.. ఈ ఒత్తిడి అనేది మన జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశం అయిన నిద్రను దెబ్బతీస్తున్నాయని.. మానవ శక్తికి మూలం మంచి నిద్ర. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి రోజు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం అని చెబుతున్నారు. కానీ ఈ ఆధునిక జీవనశైలిలో చాలా మందికి సరిగ్గా నిద్రపట్టడం లేదంటే ఆశ్చర్యం లేదు. ఇంతకీ మీకు నిద్రపట్టకపోడానికి వెనక ఉన్న కారణాలు తెలుసా..
మధ్య రాత్రి నిద్రలో మేల్కొనడం సాధారణమా?
ఒక్కసారిగా అర్ధరాత్రి లేచిపోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. కానీ తరచూ రాత్రి సమయంలో మేల్కొని తిరిగి నిద్రపట్టకపోవడం సాధారణం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి మధ్యరాత్రి మేలుకువ రావడానికి దాహం, టాయిలెట్‌కు వెళ్లడం, చెడు కలలు వంటివి కారణాలుగా ఉండవచ్చు. కానీ ప్రతీరాత్రి ఇది జరిగితే, అది శరీరంలో ఏదో గందరగోళం జరుగుతోందనే సంకేతమని సూచిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల మధ్య మేల్కొనడం అనేది శారీరక లేదా మానసిక సమస్యల సూచన కావొచ్చని అంటున్నారు.
రాత్రి నిద్రకు భంగం కలిగించే ప్రధాన కారణాలు..
1. ఉద్రిక్తత: మనసులో ఉన్న ఆందోళనలు, ఒత్తిడులు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీంతో హృదయ స్పందన పెరగడం, రక్తపోటు మార్పులు రావడం, నిద్రకు అడ్డంకులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి సమయంలో శరీరం విశ్రాంతికి సిద్ధం కావడం కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు.
2. మందుల దుష్ప్రభావాలు: కొన్ని మందులు ముఖ్యంగా యాంటీడిప్రెసెంట్లు, డీకాంజెస్టెంట్లు లేదా ఇతర దీర్ఘకాలిక మందులు నిద్ర పద్ధతులను మార్చేస్తాయని చెబుతున్నారు. వీటి కారణంగా రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొనడం జరుగుతుందని అంటున్నారు.
3. వయస్సు ప్రభావం: వయసు పెరిగే కొద్దీ నిద్ర చక్రాలు (sleep cycles) మారుతాయని నిపుణులు చెబుతున్నారు. వృద్ధాప్యంలో శరీరంలోని జీవక్రియలు మందగించడం వల్ల లోతైన నిద్రకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. అందుకే వయసు పెరిగినవారిలో రాత్రిపూట తరచుగా మేల్కొనడం సాధారణంగా జరుగుతుందని పేర్కొన్నారు.
4. కాలేయం సమస్యలు: వైద్యుల ప్రకారం.. తరచూ తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల మధ్య మేల్కొంటుంటే, అది కాలేయం పనితీరు బలహీనంగా ఉండటానికి సూచన కావచ్చని చెబుతున్నారు. కాలేయం సరిగా పనిచేయకపోతే రక్త ప్రసరణలో మార్పులు జరిగి, నిద్ర భంగం ఏర్పడుతుందని అంటున్నారు.
5. ఇతర ఆరోగ్య సమస్యలు: గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆర్థరైటిస్, న్యూరోపతి, మెనోపాజ్, ప్రోస్టేట్ విస్తరణ, థైరాయిడ్ అసమతుల్యత, లేదా స్లీప్ అప్నియా వంటి వ్యాధులు కూడా నిద్రలేమికి ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు.
సౌకర్యవంతమైన నిద్ర కోసం వీటిని ప్రయత్నించండి..
1. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. పడుకునే ముందు ఆందోళనలు, ఆలోచనలు పక్కన పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
2. గడియారం చూడటం మానేయండి. “ఇంకా నిద్ర ఎందుకు రాలేదు” అని ఆలోచించటం వల్లే నిద్ర మరింత దూరమవుతుందని అంటున్నారు.
3. లోతైన శ్వాస తీసుకోండి. దీని ద్వారా ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతమవుతుందని సూచిస్తున్నారు.
4. బెడ్‌రూమ్ వాతావరణం మెరుగుపరుచుకోండి. గది శుభ్రంగా, చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు.
5. 20 నిమిషాల్లో నిద్ర రాకపోతే లేచి పుస్తకం చదవడం లేదా సాఫ్ట్ మ్యూజిక్ వినడం లాంటివి చేయాలని చెబుతున్నారు.
6. స్క్రీన్‌లకు దూరంగా ఉండండి. మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌లు విడుదల చేసే బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలాటోనిన్ను తగ్గిస్తాయి.
READ ALSO: Asia Markets Crash: ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి.. మళ్లీ కంపు లేపిన ట్రంప్!
