Site icon NTV Telugu

Ragi Soup: షుగర్ పేషెంట్లకు వరం, బాన పొట్టను కరిగించే ‘రాగి అస్త్రం’.. 10 నిమిషాల్లో ఇలా చేసేయండి!

Ragi Soup

Ragi Soup

Ragi Soup: మారుతున్న జీవనశైలిలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిస్‌తో బాధపడేవారు తమ ఆహారంలో రాగులను చేర్చుకోవడం ఎంతో మేలని నిపుణులు చెబుతుంటారు. అయితే రాగి ముద్ద, రాగి జావ బోర్ కొట్టిన వారికి ‘రాగి సూప్’ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. కేవలం 10 నిమిషాల్లో ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఈ సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – పావు కప్పు

వెన్న (బటర్) – 1 టేబుల్ స్పూన్

వెల్లుల్లి తరుగు – 1 టేబుల్ స్పూన్

పచ్చిమిర్చి తరుగు – అర టేబుల్ స్పూన్

ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు

కూరగాయలు (క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ, క్యాబేజీ) – ఒక్కోటి 1 టేబుల్ స్పూన్

మిరియాల పొడి – అర టీస్పూన్

సొంటి పొడి – పావు టీస్పూన్

నిమ్మరసం – అర చెక్క

ఉప్పు, కొత్తిమీర – తగినంత

తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు రాగి పిండిని తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి బటర్ వేయాలి. బటర్ కరిగాక వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి రంగు మారే వరకు వేయించాలి. ఆ తర్వాత క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ వంటి కూరగాయల ముక్కలన్నీ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. కూరగాయలు వేగాక ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా పంచదార వేసి కలిపి, మూడు కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు బాగా తెర్లుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి నీళ్లను పోస్తూ ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. సూప్ చిక్కబడుతున్న సమయంలో సొంటి పొడి వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లి స్టవ్ ఆపి, అర చెక్క నిమ్మరసం పిండుకుంటే వేడి వేడి రాగి సూప్ రెడీ.

ప్రయోజనాలు:
* రాగుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తుంది.

* ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.

* చలికాలంలో గొంతులో ఈ సూప్ పడుతుంటే ఎంతో ఉపశమనంగా ఉండటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది

* శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు రాగి సూప్ తాగడం వల్ల సహజంగానే ఐరన్ అందుతుంది. ఇది రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.

* ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. తద్వారా గుండెపోటు వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది.

* ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోయి, జీర్ణశక్తి పెరుగుతుంది.

* రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ముడతలు పడకుండా కాపాడి, మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి.

* అమినో యాసిడ్స్ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

* ఇందులో మనం చేర్చే వెల్లుల్లి, మిరియాలు, కూరగాయల వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరిగి జలుబు, దగ్గు వంటివి దరిచేరవు.

* గోధుమలు పడని వారు నిశ్చింతగా రాగి సూప్‌ను తమ డైట్‌లో చేర్చుకోవచ్చు.

READ ALSO: Job Market: అంబానీ, అదానీ కాదు.. దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్న కంపెనీలు ఇవే! టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Exit mobile version