NTV Telugu Site icon

PM Modi: ఊబకాయాన్ని ఓడించి.. ఫిట్‌గా ఉండేందుకు మంత్రం చెప్పిన ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్‌ హవేలిలో పర్యటించారు. సిల్వాసాలో నమో ఆసుపత్రిని ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.2,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన ఊబకాయం సమస్యను ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడుతారని ప్రధానమంత్రి ఒక నివేదికను ఉటంకిస్తూ అన్నారు. ప్రధానమంత్రి ఈ గణాంకాలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు. స్థూలకాయాన్ని ఓడించడానికి ప్రధాని మోడీ ప్రజలకు ఒక మంత్రాన్ని కూడా చెప్పారు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పుడు మారోసారి గుర్తు చేశారు. ప్రజలు వంట నూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు జీవనశైలిపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా 25 వేల జన ఔషధి కేంద్రాలను ప్రారంభిస్తుందని… తద్వారా ప్రజలు సరసమైన, నాణ్యమైన జనరిక్ ఔషధాలను పొందగలరన్నారు.

READ MORE: Zelensky: అమాంతం పెరిగిన జెలెన్ స్కీ ప్రజాదరణ.. ట్రంప్ ప్రధాన కారణం..

కాగా.. గతంలో ఆల్ ఇండియా రేడియో నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో.. ప్రధాని మోడీ ఊబకాయం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.. “పిల్లలలో ఊబకాయం సమస్య నాలుగు రెట్లు పెరగడం మరింత ఆందోళన కలిగించే విషయం” అని ఆయన అన్నారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఆహారంలో 10 శాతం తక్కువ నూనెను ఉపయోగించాలని సూచించారు. ఇది సవాలుగా తీసుకోవాలని సూచించారు. అలా చేయడం ద్వారా.. వారు మరో 10 మందికి ఇలాంటి సవాలు విసరగలరంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ సహా మరికొందరు ప్రముఖుల ఆడియో సందేశాలను కూడా ప్రధానమంత్రి వినిపించారు.. ఊబకాయాన్ని తగ్గించడానికి లేదా నివారించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

READ MORE: 10th Hall Tickets 2025: విద్యార్థులకు అందుబాటులో పదవ తరగతి హాల్ టికెట్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

“ఆహారంలో నూనెను తక్కువగా ఉపయోగించడం.. ఊబకాయంతో పోరాడటం అనేది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదు.. కుటుంబం పట్ల మన బాధ్యత కూడా” అని ప్రధాని మోడీ అన్నారు. ఆహారంలో నూనెను అధికంగా వాడటం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, అధిక ఒత్తిడి వంటి అనేక వ్యాధులు వస్తాయి. మన ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, మన భవిష్యత్తును బలంగా, ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా మార్చుకోవచ్చు… అంటూ మోడీ గతంలో సూచించారు.