Site icon NTV Telugu

Paracetamol Pregnancy Safety: గర్భిణీలు పారాసెటమాల్ వాడితే ప్రమాదమా? ట్రంపరితనంలో నిజమెంత!

Tylenol Pregnancy Safe

Tylenol Pregnancy Safe

Paracetamol Pregnancy Safety: అగ్రరాజ్యాధినేతగా ఎప్పుడూ వార్తల్లో నిలవడం డోనాల్డ్ ట్రంప్‌కు అలవాటు అయిపోయింది. తాజాగా ఆయన గర్భిణీలు పారాసెటమాల్ వాడితే ప్రమాదం అనే వాదనను తీసుకొచ్చారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు గర్భిణీలు పారాసెటమాల్‌ వాడటంపై పెద్ద వివాదం చెలరేగుతుంది. అమెరికాలో పారాసెటమాల్‌ టైలెనాల్ అనే బ్రాండ్ పేరుతో చెలామణి అవుతుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టైలెనాల్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఆటిజం ప్రమాదం పెరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భిణీలు ఈ మందులు తీసుకోవడం కారణంగా పుట్టబోయే పిల్లలలో ఆటిజం రావచ్చని పేర్కొన్నారు. ఇంతకీ మనోడి వాదనలో నిజం ఎంత? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: OG : ఎట్టకేలకు కంటెంట్ ఇచ్చేశారు !

శాస్త్రీయ ఆధారాలు లేవు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాజీ చీఫ్ సైంటిస్ట్.. ప్రఖ్యాత శిశువైద్యురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలపై స్పందించారు. పారాసెటమాల్ సురక్షితమైన, ప్రభావవంతమైన మందు అని స్పష్టం చేశారు. పారాసెటమాల్ తయారీదారులు, అంతర్జాతీయ వైద్య సంస్థలు గర్భిణీ, పాలిచ్చే మహిళలకు పారాసెటమాల్ సురక్షితమైనదని, కానీ వైద్యుడి మార్గదర్శకత్వంలో మాత్రమే తీసుకోవాలని పేర్కొంటున్నట్లు తెలిపారు. పారాసెటమాల్-ఆటిజం మధ్య ఎటువంటి సంబంధాన్ని సమర్ధించడానికి ప్రస్తుతం ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు స్పష్టం చేశారు.

పారాసెటమాల్ టైలెనాల్ అనే బ్రాండ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగంలో ఉంది. ఈ మందు నొప్పి నివారిణిగా, జ్వరం తగ్గించేదిగా పనిచేస్తుంది. దీనిని సాధారణంగా తలనొప్పి, వెన్నునొప్పి, చిన్న ఆర్థరైటిస్ నొప్పి, కండరాల నొప్పులు, పంటి నొప్పులు వంటి వాటికి, అలాగే తాత్కాలికంగా జ్వరాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. పలువురు పిల్లల వైద్యులు మాట్లాడుతూ.. పారాసెటమాల్ అత్యంత సురక్షితమైన మందులలో ఒకటి అని చెబుతున్నారు. వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవడంలో ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నారు. ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టుల సమాఖ్య (FIGO) దీని వాడకాన్ని సిఫార్సు చేస్తుంది.

ట్రంప్ వాదనలో నిజం ఎంత..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో.. గర్భిణీ స్త్రీలు టైలెనాల్‌ను నివారించాలని సూచించారు. ఇది పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. అయితే ఆయన తన ప్రకటనలో ఎలాంటి కచ్చితమైన శాస్త్రీయ డేటాను లేదా వైద్య అధ్యయనాలను ఉదహరించలేదు. ఆయన తన ప్రకటనలో“మహిళలు దీనిని తీసుకోకపోతే హాని లేదు” అని పేర్కొన్నారు. టైలెనాల్‌ను తయారు చేసే కంపెనీ ట్రంప్ వాదనను ఖండించింది. “ఇప్పటి వరకు ఉన్న అన్ని పరిశోధనలు, శాస్త్రీయ డేటా పారాసెటమాల్ ఆటిజం మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని చూపిస్తుంది” అని స్పష్టం చేసింది.

పూర్తిగా సురక్షితం అయినా..
పారాసెటమాల్‌ను జ్వరం, ఇతరల నొప్పులను తగ్గించడానికి సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైద్యులు కామన్ రాసే మందులలో ఇది ఒకటి అని పలువురు వైద్యులు పేర్కొన్నారు. కండరాల బెణుకులు, తలనొప్పి, వెన్నునొప్పి, పంటి నొప్పులతో సహా అన్ని రకాల నొప్పులకు ఇది ప్రభావవంతంగా పని చేస్తుందని తెలిపారు. అన్ని ఔషధం లాగానే పారాసెటమాల్‌ను అధికంగా వాడటం, దీర్ఘకాలికంగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినడం వంటి హాని కలుగుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో అవసరమైన సమయంలో వైద్యుడి సూచన మేరకు ఉపయోగిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

READ ALSO: IRCTC Special Navratri Menu: నవరాత్రి స్పెషల్.. రైల్వేలో కొత్త మెనూ

Exit mobile version