Panic Attack: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతీ మనిషి జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన అనేవి వారి భాగంగా మారిపోయాయి. నిరంతరం ఒత్తిడిలో జీవించడం అనేది చాలా మంది జీవితాల్లో సహజంగా జరిగే సాధారణ విషయంలా మారిపోయింది. కొన్నిసార్లు ఈ ఒత్తిడి, ఆందోళన అనేవి పెరిగిపోయి శ్వాస ఆగిపోతుందా లేదా మనిషి గుండె కొట్టుకోవడం నిలిచిపోతుందనే స్థాయికి వెళ్లిపోతుంది. దీనినే పానిక్ అటాక్ అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ స్థితిలో తీవ్రమైన భయం, అశాంతి మనిషిలో నెలకొంటాయి. ఇంతకీ ఈ పానిక్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ఎలా నివారించవచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Crypto : కరీంనగర్ క్రిప్టో గేమ్.. చివరికి ఎవరి చేతిలో లాభం..?
పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. పానిక్ డిజార్డర్ అంటే ఒక వ్యక్తి ఎప్పుడూ భయంతో కూడిన వాతావరణంలో బతకడం మొదలు పెడతాడో అప్పుడు ఆయనను ఆవరించే ప్రమాదకరమైన జబ్బు అని అన్నారు. ఈక్రమంలో ఆయన నిత్యం భయపడుతూ.. చెమటతో తడిచిపోవడం, చేతులు, కాళ్లలో జలదరింపులు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పానిక్ అటాక్ అనేది తెలియని భయం, ఒత్తిడి చేసే దాడులు అని పేర్కొన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. పానిక్ అటాక్ అనేది తప్పనిసరిగా మానసిక అనారోగ్యానికి సంకేతం కాదని నిపుణులు అంటున్నారు. కానీ అది తరచుగా సంభవిస్తూ, జీవితాన్ని ప్రభావితం చేస్తే మాత్రం, దానిని పానిక్ డిజార్డర్ అంటారని చెప్పారు. ఇది ఒక మానసిక ఆరోగ్య సమస్య అని, దీనికి ప్రత్యేక చికిత్స అవసరం అవుతుందని చెబుతున్నారు.
పానిక్ అటాక్‌లకు కారణాలు..
కొన్ని వ్యాధులు భయాందోళనలకు కారణమవుతాయి. ఉదాహరణకు గుండెపోటు, క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యలు మొదలైనవి మనిషిని భయాందోళనలకు గురిచేసే అవకాశాలను పెంచుతాయి. వైవాహిక జీవితంలో విభేదాలు, విడాకులు, సన్నిహితుడి మరణం, ఉద్యోగం కోల్పోవడం, ఉద్యోగం పోతుందనే భయం, ఆర్థిక నష్టం భయాందోళనలు పానిక్ అటాక్‌లకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో చాలా బాధలు అనుభవించిన, బాల్యం నుంచి కొన్ని చేదు జ్ఞాపకాలు భయపెట్టడం, అభద్రతా భావాన్ని కలిగించే వ్యక్తుల కారణంగా దీని బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒంటరితనం భయాందోళనలకు ప్రధాన కారణం అవుతుందని, భయాలను, భావాలను ఇష్టమైన వారితో పంచుకోలేకపోవడం, స్నేహితులతో మాట్లాడకపోవడం, భవిష్యత్తు భయాలు పానిక్ అటాక్‌లకు దారి తీయవచ్చని చెబుతున్నారు.
కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పానిక్ అటాక్‌ల కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కరోనా వైరస్ తరువాత తలెత్తిన పరిస్థితుల కారణంగా చాలా మంది ప్రజలు అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ జీవితాలను ముందుకు సాగిస్తున్నారు. COVID-19 తీవ్రమైన దశను దాటిన వారిలో, ఆసుపత్రిలో, లైఫ్ సపోర్ట్ పరికరాలపై జీవిస్తున్న వారిలో పానిక్ అటాక్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
పానిక్ అటాక్‌ను ఇలా నివారించవచ్చు..
సామాజికంగా చురుకుగా ఉండటం వల్ల పానిక్ అటాక్‌ను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘ శ్వాస తీసుకోవడం, ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రయత్నించండం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండంతో దీని నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. యోగా, ప్రాణాయామం పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయని చెబుతున్నారు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల భయం, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని అంటున్నారు.
READ ALSO: AI Boost CIBIL Score: క్రెడిట్ స్కోర్‌కు AI మైలేజ్.. ఓ లుక్ వేయండి
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
