NTV Telugu Site icon

World Obesity Day: భారత్‌లో పెరుగుతున్న ఊబకాయం బాధితులు

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 1975 నుంచి ప్రపంచంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే 2030 నాటికి ప్రపంచంలోని యుక్త వయసు కలిగి ఉన్నవారిలో సగం మంది అధిక బరువు, ఊబకాయం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న జనాభా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది.

ఇండియాలో ఊబకాయం ప్రాబల్యం 40.3 శాతంగా నమోదైంది. పురుషుల కంటే మహిళల్లో ఊబకాయం ఎక్కువగా ఉందని తేలింది. మహిళలు 41.88 శాతం మంది పురుషులు 38.67 శాతం ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంత జనాభాలో మహిళలు 44.17 శాతం పురుషులు 36.08 శాతం ఊబకాయాన్ని కలిగి ఉన్నారు. 40 ఏళ్లలోపు వారిలో మహిళలు, 45.81 శాతం పురుషులు 34.58 శాతం ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

చాలామంది మహిళలు ఇంటి పనుల కారణంగా తమ ఆహారం, ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో వాళ్లు ఊబకాయం బారిన పడుతున్నారు. ఇది క్రమంగా మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో కొవ్వు ఎంత పెరిగితే, ఇన్సులిన్ చర్యకు అంత అడ్డంకి ఏర్పడుతుంది. ముఖ్యంగా పొత్తికడుపు, కాలేయం, ప్యాంక్రియాస్‌లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఇన్సులిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. భారతీయుల్లో కాలేయం, ప్యాంక్రియాస్‌లో కొవ్వు నిల్వలు ఎక్కువగా కనిపిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 800 మిలియన్ల మంది ప్రజలు ఊబకాయంతో జీవితం గడుపుతున్నారు. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది అధిక బరువు , ఊబకాయం వచ్చే అవకాశపు అంచుల్లో ఉన్నారు. 2016లో 5-19 సంవత్సరాల వయస్సు గల 340 మిలియన్ల మంది పిల్లలు, యుక్త వయస్సులో ఉన్నవారు ఉండగా, 2020లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 39 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. అయితే క్రమం తప్పకుండా వ్యాయామాలు, ఆహార శైలిని మార్చుకోవడం ద్వారా ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.