NTV Telugu Site icon

Myositis: సమంతకు వచ్చిన ‘మయోసైటిస్’ వ్యాధి అంటే ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి?

Samantha

Samantha

Myositis: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని చెప్పడంతో ప్రస్తుతం ఈ అంశం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. చాలా మంది ఈ వ్యాధి అంటే ఏంటో తెలియదని కామెంట్ చేస్తున్నారు. దీంతో దీని లక్షణాల గురించి కూడా తెలియదని చెప్తున్నారు. అయితే కొందరు వైద్యులు చెప్తున్న సమాచారం ప్రకారం మయోసైటిస్ అంటే చర్మ వ్యాధి అని తెలుస్తోంది. ఈ వ్యాధిని దీర్ఘకాలిక కండరాల వాపు అని కూడా అంటారని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి కండరాల నొప్పులు విపరీతంగా ఉంటాయని.. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరని అంటున్నారు. చిన్న పనులు చేస్తేనే వెంటనే నీరసించి పోవడం, క్షణాల్లో అలసిపోవడం, ఉన్నట్టుండి కింద పడిపోవడం లాంటి లక్షణాలు ఈ వ్యాధి కలిగి ఉంటుందని పలువురు వైద్యులు చెప్తున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే.. కూర్చున్న స్థానం నుంచి నిలబడటం కష్టంగా ఉంటుందని.. మెట్లు ఎక్కడం కష్టతరంగా మారుతుందని.. చేతులు ఎత్తడం కూడా కష్టంగా ఉంటుందని.. ఎక్కువసేపు నిలబడినా, నడిచినా అలసిపోతారని.. ఆహారాన్ని మింగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారని.. కనురెప్పలు, మోచేతులు, మోకాలు, పిడికిలిపై ఎరుపు లేదా ఊదారంగులో దద్దుర్లు వస్తాయని వైద్యులు వెల్లడించారు. అయితే మయోసైటిస్ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లలు, మహిళల్లో సోకుతుందని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Jr NTR Reacts On Samantha Health Live: డోంట్ వర్రీ సామ్.. సమంత హెల్త్ పై జూ.ఎన్టీఆర్

అమెరికాలో ప్రతి ఏడాది ఈ కేసులు కొత్తగా 1,600 నుంచి 3,200 వరకు నమోదవుతుంటాయి. ప్రస్తుతం ఆ దేశంలో 50 వేల నుంచి 75 వేల వరకు మయోసైటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని వైద్యులు అంచనా వేస్తున్నారు. అటు మయోసైటిస్ వ్యాధిలో ఐదు రకాలు ఉన్నాయట. డెర్మటో మయోసైటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్, జువెనైల్ మయోసైటిస్, పాలీ మయోసైటిస్, టాక్సిక్ మయోసైటిస్ అనే రకాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి నయం కావడానికి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ఏదీ లేదని.. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఫిజియోథెరపీ, వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్, యోగా వంటివి చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కాగా సమంత వ్యాధి గురించి తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. సమంత ధైర్యంగా ఉండాలని.. ఆమె త్వరగా కోలుకుని నార్మల్ కావాలని జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.