Site icon NTV Telugu

Moringa: “మునగ ఓ వరం”.. ఆకుల నుంచి వేర్ల వరకు చెట్టు నిండా ఔషధాలే..

Muringa

Muringa

Moringa: మునగ చెట్టును ఔషధ గుణాల ఖజానాగా నిపుణులు పేర్కొంటారు. ఈ చెట్టులోని ప్రతి భాగమూ విశేషమైనదే. మునక్కాయలు, ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ మన ఆరోగ్యానికి మేలుచేసే అనేక పోషకాలు, ఔషధ గుణాలతో నిండిపోయి ఉంటాయి. ముఖ్యంగా మునగాకు పోషక విలువలతో పాటు ఔషధ గుణాలను కలిగి ఉండటంతో ఆకు కూరల్లో అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మునగాకులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉండటంతో రక్తహీనతను తగ్గిస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. క్యాన్సర్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటాక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మునగాకు జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్దకం, బ్లోటింగ్, గ్యాస్ట్రైటిస్, అల్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. 100 గ్రాముల మునగాకు సుమారు 92 క్యాలరీల శక్తిని ఇస్తుంది. 6.7 గ్రాముల ప్రోటీన్, 440 మైక్రోగ్రాముల కాల్షియం, 0.85 మిల్లీగ్రాముల ఐరన్, 220 మైక్రోగ్రాముల విటమిన్ C అందిస్తుంది. అలాగే థయామిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ వంటి పుష్కలమైన పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. బీటా కెరోటిన్ విటమిన్ Aగా మారి కంటి చూపును మెరుగుపరుస్తుంది.

READ MORE: The Face of the Faceless: 21న తెలుగులో ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’

అయితే విటమిన్ C పోకుండా ఉండాలంటే మునగాకును ఎక్కువ సేపు ఉడికించకూడదు. మునగాకులో ఉండే ఐసోథియోసైనేట్స్ అనే పదార్థం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం కలిగి ఉంటుంది. ఇది ఆస్టియోఆర్థరైటిస్, క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఇన్‌ఫ్లమేషన్ సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటాక్సిడెంట్ రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తుంది. మునగాకు క్రమం తప్పకుండా తింటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మునగాకు లోని యాంటాక్సిడెంట్లు చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు అందించి సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మొత్తం మీద మునగాకు మన ఆరోగ్యానికి సమగ్ర రక్షణ కవచంలాంటిది. రోజువారీ ఆహారంలో మునగాకును ఏదో ఒక రూపంలో చేర్చుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చు.

Exit mobile version