Jamun Juice: వేసవి కాలంలో దాహాన్ని తీర్చడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించే పండ్లలో నేరేడు పండు ఒకటి. ముదురు ఊదా రంగులో కనిపించే ఈ పండు వగరు, తీపి రుచుల కలయికతో ప్రత్యేక గుర్తింపు పొందింది. నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తాన్ని శుద్ధి చేయడం, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. ఈ పండ్లతో తయారుచేసే జ్యూస్ రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మరి ఈ జ్యూస్ ని ఎలా చేయాలో వివరంగా చూద్దామా..
కావలసిన పదార్థాలు:
* గింజలు తీసిన నేరేడు పండ్లు – 1 కప్పు
* బెల్లం లేదా తేనె – 1 టేబుల్ స్పూన్
* మిరియాల పొడి – చిటికెడు
* సైంధవ లవణం (బ్లాక్ సాల్ట్) – కొద్దిగా
* నిమ్మరసం – 1 చెంచా
* నీరు – అవసరమైనంత
తయారీ విధానం:
ముందుగా నేరేడు పండ్లను నీటితో రెండు లేదా మూడు సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పండ్లలోని గింజలను తీసేసి, కేవలం పండ్ల గుజ్జును మాత్రమే వేరుగా ఉంచాలి. మిక్సీ జార్‌లో నేరేడు పండ్ల గుజ్జు, కొద్దిగా నీరు, బెల్లం లేదా తేనె వేసి బాగా బ్లెండ్ చేయాలి. అలా వేసి మిరియాల పొడి, సైంధవ లవణం వేసి మరోసారి బాగా కలపాలి. అంతే సింపుల్ ఆరోగ్యకరమైన నేరేడుపండు జ్యూస్ రెడీ. అలా తయారైన జ్యూస్‌ను గ్లాసులో పోసి, చివరగా నిమ్మరసం కలిపి సర్వ్ చేయాలి. నేరేడుపండు జ్యూస్‌ను తయారు చేసిన వెంటనే తాగడం మంచిది. ఎక్కువసేపు నిల్వ ఉంచితే దాని సహజ రుచి, తాజాదనం తగ్గే అవకాశం ఉంటుంది.
నేరేడుపండు జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు:
* శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
* హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
* యాంటీఆక్సిడెంట్ల వల్ల కణాలకు రక్షణ కల్పిస్తుంది.
* మధుమేహ నియంత్రణలో కొంతమేర సహాయపడుతుంది.
* శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

