Happy Hormones Tips: హార్మోన్లు అనేవి మన శరీరంలో అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. ఇవి మానసిక స్థితి, నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, ఒత్తిడి, శక్తి, భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు మీకు హ్యాపీ హార్మోన్ల గురించి తెలుసా.. హ్యాపీ హార్మోన్లు అనేవి మానసిక స్థితిని, మెదడులో సానుకూల భావాలను పెంచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ హార్మోన్లు మానసిక అలసటను తగ్గిస్తాయని, భావోద్వేగ సమతుల్యతను కాపాడుతాయని చెబుతున్నారు. అందుకే మానసిక ఆరోగ్యానికి, మంచి జీవన నాణ్యతకు ఈ హార్మోన్ల సమతుల్యత చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.
READ ALSO: Off The Record: ఏపీ పాలిటిక్స్‌లోకి బొత్స వారసురాలు ఎంట్రీ..?
డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ అనేవి హ్యాపీ హార్మోన్లుగా వైద్యులు పేర్కొన్నారు. డోపమైన్ ప్రేరణ, స్వీయ-సంతృప్తి, ఉత్పాదకతతో ముడిపడి ఉంటుందని, అందుకే దీనిని రివార్డ్ హార్మోన్ అని కూడా పిలుస్తారని చెప్పారు. సెరోటోనిన్ మానసిక స్థితి, నిద్ర, ఆకలిని నియంత్రిస్తుందని, అలాగే శరీరానికి ప్రశాంతతను తెస్తుందని వెల్లడించారు. ఎండార్ఫిన్లు నొప్పిని తగ్గిస్తాయని, తక్షణ ఆనందాన్ని ఇస్తాయని, అందుకే వీటిని సహజ నొప్పి నివారణ మందులుగా పరిగణిస్తారని చెప్పారు. అదే సమయంలో ఆక్సిటోసిన్‌ను లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారని, ఇది నమ్మకం, కనెక్షన్, భావోద్వేగ బంధాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. ఈ హార్మోన్లన్నీ మానసిక సమతుల్యతను కాపాడుతాయని, ఒత్తిడిని తగ్గిస్తాయని, రోజువారీ పనులకు శక్తిని ఇస్తాయని వివరించారు. ఒకవేళ ఈ హార్మోన్లలలో ఏమైనా లోపం ఉంటే చిరాకు, విచారం, అలసట, ప్రేరణ లేకపోవటానికి దారితీస్తుందని, అందుకే వీటి సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచించారు.
శరీరంలో హ్యాపీ హార్మోన్‌ను ఎలా పెంచాలి..
హ్యాపీ హార్మోన్లను పెంచడానికి సులభమైన మార్గం జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, యోగా, నడక, నృత్యం లేదా ఏదైనా తేలికపాటి శారీరక శ్రమ ఎండార్ఫిన్‌లను పెంచుతుందని వెల్లడించారు. 15 నుంచి 20 నిమిషాలు ఎండలో కూర్చోవడం వల్ల సహజంగా సెరోటోనిన్ పెరుగుతుందని, తక్షణమే మానసిక స్థితి మెరుగుపడుతుందని తెలిపారు. మంచి నిద్ర అవసరం అని, ఎందుకంటే తక్కువ నిద్ర డోపమైన్, సెరోటోనిన్ రెండింటినీ తగ్గిస్తుందని హెచ్చరించారు. డార్క్ చాక్లెట్, అరటిపండ్లు, ఎండిన పండ్లు, పెరుగు, గుడ్లు, ఓట్స్, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. ఎందుకంటే ఇవి సంతోషకరమైన హార్మోన్లను పెంచుతాయని వెల్లడించారు.
వీటికి అదనంగా సన్నిహితులతో మాట్లాడటం, పెంపుడు జంతువులతో సమయం గడపడం, ధ్యానం చేయడం, ఇష్టమైన సంగీతం వినడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి డోపమైన్, ఆక్సిటోసిన్ రెండింటినీ పెంచుతాయని వైద్యులు సూచించారు. రోజులో మీ కోసం చిన్న చిన్న ఆనంద క్షణాలను సృష్టించుకోవడం, ఒత్తిడిని తగ్గించడం, సానుకూల మనస్తత్వాన్ని కొనసాగించడం అనేది భావోద్వేగ సమతుల్యతకు దోహదం చేస్తాయని వెల్లడించారు. అలాగే మొబైల్/స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలని, నీరు పుష్కలంగా తాగాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, చక్కెర తక్కువగా తీసుకోవాలని సూచించారు.
READ ALSO: 2026 T20 World Cup: 2026 టీ20 ఫైనల్ మ్యాచ్ ఈ రెండు టీంలకే.. : కెప్టెన్ సూర్య
