Site icon NTV Telugu

Parents’ responsibility : పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల బాధ్యత

Parenting And Gender Equality

Parenting And Gender Equality

పిల్లల మనోభావాలపై ప్రభావం చూపే అనేక అంశాల్లో, తల్లిదండ్రుల వ్యవహారశైలి చాలా ముఖ్యమైనది. వారు చేసే కొన్ని చిన్నచిన్న తప్పులు, పిల్లల ఆలోచనా ధోరణిని పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో తల్లిదండ్రుల మాటలు, నడవడి తీరు పిల్లల మీద ఊహించని ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మన సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్న ఒక దుర్వినియోగ పరంపర ఏమిటంటే ..

Also Read : Regina Cassandra : పీఆర్ చూసి ఛాన్స్‌లు.. ఇండస్ట్రీ రియాలిటీ పై రెజీనా ఓపెన్ టాక్

ఆడవాళ్లను చిన్నచూపు చూడటం, తక్కువ చేయడం. “ఆడపిల్లలా నడవొద్దు”, “నువ్వేమన్నా ఆడదానివా?”, “ఆడవాళ్ల పనులేంటి నీకూ?” లాంటి వ్యాఖ్యలు పెద్దల నోటి నుంచి పిల్లల ముందు వినిపిస్తూ ఉంటాయి. ఈ మాటలు చిన్నప్పటి నుంచే పిల్లల మనసుల్లో పిచ్చి గోడలు కట్టేస్తుంటాయి. ముఖ్యంగా పిల్లాడికి ఆడుకోవడానికి బొమ్మతుపాకీలు తెచ్చే తల్లిదండ్రులు, తమ కూతురి కోసం కిచెన్‌ సెట్‌ తెచ్చి ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం నీ పని అనే సూత్రాన్ని నాటితే. అబ్బాయిని దుకాణాలకు పంపే పేరెంట్స్‌, అమ్మాయిలకు ఇల్లు శుభ్రం చేసే పని అప్పగిస్తుంటారు. అంతేకాదు కుర్రాడు ఆసక్తి కొద్దీ.. గరిట పట్టుకుంటే.. ‘నీకెందుకురా ఆడవాళ్ల పనులు’ అంటూ బయటికి పంపిస్తుంటారు.

ఈ పరిస్థితిని మార్చాలంటే మొదట తల్లిదండ్రులే తమ అభిప్రాయాలను మార్చుకోవాలి…

పిల్లల అభిరుచులు, ఆసక్తుల పట్ల గౌరవం చూపాలి.

ఏ పని ఆడవాళ్లది, మగవాళ్లది అన్న భేదాలు పోగొట్టాలి.

పిల్లల నైపుణ్యం, శక్తిని బట్టి వాళ్లకు అనువైన అవకాశాలు ఇవ్వాలి.

ముఖ్యంగా, ఆడ – మగ అనే ప్రాతిపదికపై వ్యాఖ్యలు చేయడం మానేయాలి.

ఈ తరం తల్లిదండ్రులు తమ వైఖరిలో మార్పు తీసుకొస్తే.. వారి పిల్లలు లింగ సమానత్వాన్ని సహజంగా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడే మన సమాజాన్ని ఇన్నేళ్లుగా బాధిస్తున్న లింగ వివక్షకు గట్టి కుదుపు ఇవ్వడం సాధ్యమవుతుంది. మార్పు ఓ తరం నుంచే మొదలవుతుంది. ఆ మార్పుకు నాంది పలకాల్సింది మీరు – తల్లిదండ్రులే!

Exit mobile version