Clothes Washing Tips: బట్టలు ఉతకడం అనేది మన ఇంట్లో ప్రతిరోజూ జరిగే పనే. చాలామంది వాషింగ్ మిషన్‌లోనే ఉతికేసినా, కొన్నింటిని మాత్రం తప్పనిసరిగా చేత్తోనే ఉతకాల్సి వస్తుంది. ఎవరి బట్టలకైనా సరే చెమట మలీనాలు, దుమ్ము ధూళి లేదా ఆహార పదార్థాల మరకలు అంటుకుంటూనే ఉంటాయి. ఇలాంటి వాటిని వదిలించడానికి చాలామంది బట్టలను ఉతకడానికి ముందే డిటర్జెంట్ నీళ్లలో నానబెడుతుంటారు. కొందరైతే ఏకంగా రాత్రంతా బట్టలను నీళ్లలో ఉంచేసి ఉదయాన్నే ఉతుకుతుంటారు. ఇలా ఎంతసేపు నానితే బట్టలు అంత బాగా శుభ్రపడతాయని నమ్ముతుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల బట్టలు పాడైపోతాయనే విషయం మీకు తెలుసా? అసలు బట్టలను ఎక్కువసేపు నీళ్లలో, డిటర్జెంట్‌లో ఉంచితే వాటి నుంచి ఒకలాంటి దుర్వాసన వస్తుంది. కొన్ని బట్టల రంగు తగ్గిపోవడమే కాకుండా, సున్నితమైన వస్త్రాల దారాలు కూడా దెబ్బతింటాయి. అందువల్ల బట్టలను నానబెట్టడానికి కూడా ఒక సరైన పద్ధతి, సమయం ఉంటుంది. ఏ రకమైన బట్టలను ఎంతసేపు నానబెట్టాలి, ఏ పొరపాట్లు చేయకూడదనేది తెలుసుకుందాం.
బట్టలను ఉతకడానికి ముందు నానబెట్టడం ఎందుకు ముఖ్యం?
బట్టలను నేరుగా మిషన్‌లో లేదా బకెట్లో వేసి ఉతకడం కంటే కొద్దిసేపు నానబెట్టడం చాలాసార్లు మేలు చేస్తుంది. ముఖ్యంగా బట్టలపై చెమట, దుమ్ము లేదా మొండి మరకలు ఉన్నప్పుడు ఇది చాలా అవసరం. నీళ్లు, డిటర్జెంట్‌లో నానడం వల్ల బట్టలపై పట్టిన మురికి తేలికగా వదులుతుంది. దీనివల్ల ఉతికేటప్పుడు మరకలు సులభంగా పోతాయి. బట్టలను ఎక్కువగా రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే దీని అర్థం బట్టలను గంటల తరబడి లేదా రోజంతా నానబెట్టాలని కాదు. సరైన సమయం వరకు నానబెట్టడం మాత్రమే మంచి శుభ్రతకు సహాయపడుతుంది.
బట్టలను ఎంతసేపు నానబెట్టాలి?
బట్టలు ఎంత మురికిగా ఉన్నాయి, వాటి ఫ్యాబ్రిక్ ఎలాంటిదనే దానిపై నానబెట్టే సమయం ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ వేసుకునే సాధారణ బట్టలైతే.. వాటిపై ఉండే తేలికపాటి దుమ్ము లేదా సాధారణ మురికి పోవడానికి 30 నిమిషాల నుంచి 1 గంట వరకు నానబెడితే సరిపోతుంది. చెమట, తేలికపాటి మరకలు ఉన్న బట్టలైతే.. చెమట వాసన వస్తున్నా లేదా తినుబండారాల మరకలు అంటుకున్నా వాటిని దాదాపు 2 నుంచి 4 గంటల వరకు నానబెట్టవచ్చు. ఎక్కువగా మరకలు ఉన్న బట్టలైతే.. టవల్స్, మందపాటి కాటన్ బట్టలు లేదా పనుల్లో ఎక్కువగా మురికి అయిన దుస్తులను అవసరాన్ని బట్టి మరికొంత సమయం నానబెట్టవచ్చు. అయితే వీటికి డిటర్జెంట్ ప్యాకెట్‌పై ఉండే సూచనలు, బట్టల కేర్ లేబుల్‌ను తప్పకుండా చూసుకోవాలి.
రాత్రంతా నానబెడితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి?
చాలా ఇళ్లలో రాత్రిపూట బట్టలను డిటర్జెంట్ నీళ్లలో వేసి వదిలేసే అలవాటు ఉంటుంది. ఉదయాన్నే లేచి బట్టలు ఉతకడం సులభమనిపించినా, ప్రతిరోజూ ఇలా చేయడం సరైనది కాదు. ఎక్కువ సమయం నీళ్లలో ఉండిపోవడం వల్ల బట్టల నుంచి తేమ వాసన రావడం మొదలవుతుంది. ముఖ్యంగా బకెట్లో బట్టలు ఒకదానిపై ఒకటి ఒత్తిడిగా పడి ఉండి, ఎక్కువసేపు తడిగా ఉంటే ఇదే సమస్య వస్తుంది. ఇలా నానబెట్టడం వల్ల కొన్ని బట్టల రంగులపై కూడా ప్రభావం పడుతుంది. ముదురు రంగు బట్టల నుంచి రంగు పోయి వేరే బట్టలకు అంటుకోవచ్చు. అలాగే సిల్క్, ఉన్ని, లేస్ లాంటి సున్నితమైన బట్టల దారాలు ఎక్కువసేపు నీళ్లలో ఉండటం వల్ల బలహీనపడతాయి. కాబట్టి రాత్రంతా బట్టలను నానబెట్టే బదులు, కొద్దిసేపు నానబెట్టి సరైన సమయంలో ఉతుక్కోవడం చాలా మంచిది. అంతేకాదు.. బట్టలు ఉతికిన తర్వాత వాటిని బకెట్లో లేదా వాషింగ్ మిషన్‌లో ఎక్కువసేపు తడిగా ఉంచకూడదు. వెంటనే బయటకు తీసి చక్కగా ఆరబెట్టాలి.

