Site icon NTV Telugu

Camphor Tree: పూజల్లో ఉపయోగించే కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా!

Camphor Tree

Camphor Tree

Camphor Tree: ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్‌ను నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో పూజలు, ఇతర మతపరమైన ఆచారాలు నిర్వహిస్తున్నారు. పూజ అంటే నిప్పు ఉండాల్సిందే.. ఆ నిప్పును అంటించాలంటే కర్పూరం కావాల్సిందేగా. వాస్తవానికి కర్పూరం అనేది అగ్గిపుల్ల వెలిగించిన వెంటనే మండుతుంది, అలాగే మందమైన, సువాసనను వెదజల్లుతుంది. మీలో ఎంత మందికి తెలుసు.. కర్పూరం ఎలా తయారు అవుతుందో.. ఎప్పుడైనా ఆలోచించారా.. పూజల్లో ఉపయోగించే కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారు అనేది?..

READ ALSO: Wines Tender : మద్యం షాపుల కోసం మహిళల పోటీ.. ఒకే మహిళ 150 షాపులకు దరఖాస్తు..

రెండు రకాలుగా కర్పూరం తయారీ..
మార్కెట్లో ప్రస్తుతం రెండు ప్రధాన రకాలుగా కర్పూరాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది సహజ కర్పూరం, రెండవది కర్మాగారాల్లో ఉత్పత్తి చేస్తున్న కృత్రిమ కర్పూరం. సహజ కర్పూరం అనేది “కర్పూరం చెట్టు” అనబడే చెట్టు నుంచి లభిస్తుంది. దీనిని శాస్త్రీయంగా సిన్నమోమం కాంఫోరా అని పిలుస్తారు. ఈ కర్పూరం చెట్టు సుమారు 50 నుంచి 60 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది, దీని ఆకులు గుండ్రంగా, 4 అంగుళాల వెడల్పుతో ఉంటాయి. వాస్తవానికి ఈ చెట్టు బెరడు నుంచి కర్పూరం తయారవుతుంది. కర్పూరం చెట్టు బెరడు ఎండిపోవడం ప్రారంభించినప్పుడు లేదా అది బూడిద రంగులోకి మారినప్పుడు, దానిని చెట్టు నుంచి తొలగిస్తారు. ఈ బెరడును వేడి చేసి, శుద్ధి చేసిన, తర్వాత పొడిగా రుబ్బుతారు. చివరగా దానిని అవసరమైన విధంగా వివిధ ఆకారాలలో తయారు చేస్తారు.

కర్పూరం చెట్టు చరిత్ర..
కర్పూరం చెట్టు ప్రధానంగా తూర్పు ఆసియాలో, ముఖ్యంగా చైనాలో ఉద్భవించిందని చరిత్రకారులు నమ్ముతారు. అయితే కొంతమంది వృక్షశాస్త్రజ్ఞులు ఇది జపాన్‌కు చెందినదని విశ్వసిస్తున్నారు. చైనాలో టాంగ్ రాజవంశం (క్రీ.శ. 618-907) కాలంలో కర్పూరం చెట్టును ఉపయోగించి తయారు చేసిన ఒక రకమైన ఐస్ క్రీం బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే ఈ చెట్టును అనేక ఇతర విధాలుగా కూడా ఉపయోగించారు. దీనిని చైనీస్ జానపద వైద్యంలో వివిధ రూపాల్లో ఉపయోగించారు. తొమ్మిదవ శతాబ్దంలో స్వేదనం పద్ధతిని ఉపయోగించి కర్పూరం చెట్టు నుంచి కర్పూరం తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.

భారతదేశంలో కర్పూరం కథ..
ఇదే సమయంలో భారతదేశం కూడా కర్పూరం ఉత్పత్తిపై పని చేస్తోంది. 1932లో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రంలో.. కలకత్తాలోని స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన ఆర్.ఎన్. చోప్రా, బి.ముఖర్జీ 1882-83లో లక్నోలోని హార్టికల్చర్ గార్డెన్‌లో కర్పూరం ఉత్పత్తి చేసే చెట్లను పెంచడంలో విజయం సాధించారని వెల్లడించారు. తరువాతి సంవత్సరాల్లో దేశంలోని అనేక ప్రాంతాలలో కర్పూరం చెట్ల పెంపకం పెద్ద ఎత్తున ప్రారంభమైంది.

కర్పూర చెట్లకు నల్ల బంగారం అనే పేరు ఎలా వచ్చింది…
కర్పూర చెట్టును నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన చెట్లలో ఒకటిగా పేర్కొంటున్నారు. ఈ చెట్టును కేవలం మతపరమైన ఆచారాలలో ఉపయోగించే కర్పూరం కోసం మాత్రమే కాకుండా, ముఖ్యమైన నూనె, వివిధ మందులు, పరిమళ ద్రవ్యాలు, సబ్బులు వంటి అనేక ఇతర ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కెమోటైప్స్ అని పిలువబడే ఆరు నిర్దిష్ట రసాయనాలు కర్పూర చెట్టులో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కెమోటైప్స్ ఏమిటంటే.. : కర్పూరం, లినాలూల్, 1,8-సినోల్, నెరోలిడోల్, సఫ్రోల్, బోర్నియోల్‌గా పేర్కొన్నారు.

కర్పూరం అధిక మొత్తంలో కార్బన్, హైడ్రోజన్ కలిగి ఉంటుంది. ఈ గుణాలు కలిగి ఉండటంతో ఇది చాలా కొద్ది వేడిని పొందిన వెంటనే మండడం ప్రారంభిస్తుంది. ఇంకా కర్పూరం చాలా అస్థిర పదార్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కర్పూరాన్ని కొద్దిగా వేడి చేసినప్పుడు, దాని ఆవిరి గాలిలోకి వేగంగా వ్యాపిస్తుందని, అలాగే ఇది వాతావరణ ఆక్సిజన్‌తో కలిపినప్పుడు చాలా సులభంగా మండుతుందని వెల్లడించారు.

READ ALSO: Dhanteras 2025: ధన్ త్రయోదశి రోజున ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే అంతే సంగతులు !

Exit mobile version