Protein Rich Foods: శరీరానికి సరిపడా ప్రోటీన్ అందకపోతే నీరసం, కండరాల బలహీనత లాంటి సమస్యలు వస్తాయి. మనం రోజూ తినే సాధారణ గోధుమ చపాతీలు, మల్టీ గ్రెయిన్ పుల్కాల వల్ల కడుపు నిండుతుందే కానీ, ఒంటికి కావాల్సినంత ప్రోటీన్ అందదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కండపుష్టి పెరగాలన్నా, రోగనిరోధక శక్తి బలంగా ఉండాలన్నా, షుగర్ కంట్రోల్‌లో ఉండాలన్నా మనం తినే రొట్టెల్లోనే ప్రోటీన్ శాతాన్ని పెంచుకోవాలి. అందుకోసం మూడు రకాల ప్రోటీన్ గింజల కాంబినేషన్‌తో ఒంట్లో బలాన్ని అమాంతం పెంచే స్పెషల్ ‘హై ప్రోటీన్ రొట్టె’ ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మూడు గింజలే అసలైన బలం..
ఈ హై ప్రోటీన్ రొట్టెలో వాడే పొట్టు తీయని పెసరపప్పులో 25 శాతం, వేరుశనగపప్పుల్లో 25 శాతం, నువ్వుల్లో 18 శాతం ప్రోటీన్ ఉంటుంది. వీటికి జొన్నపిండి, తాజా ఆకుకూరలు తోడైతే శరీరానికి కావాల్సిన పూర్తిస్థాయి పోషకాలు ఒకే రొట్టె ద్వారా అందుతాయి.
కావాల్సిన పదార్థాలు..
* నానబెట్టిన పొట్టు పెసరపప్పు – 1 కప్పు
* నానబెట్టిన బొబ్బర్లు – అర కప్పు
* జొన్నపిండి – అర కప్పు
* వేయించిన వేరుశనగల పొడి – అర కప్పు
* వేయించిన నువ్వుల పొడి – అర కప్పు
* పాలకూర తురుము – 1 కప్పు
* క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు చొప్పున
* పుదీనా, కొత్తిమీర – అర కప్పు చొప్పున
* పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము – 1 టేబుల్ స్పూన్ చొప్పున
* వాము, నిమ్మరసం, మీగడ – 1 టేబుల్ స్పూన్ చొప్పున
* పసుపు – కొద్దిగా (రుచికి సరిపడా ఉప్పు)
తయారు చేసుకునే విధానం..
ముందుగా నానబెట్టుకున్న పొట్టు పెసరపప్పు, బొబ్బర్లను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా (ముక్కచెక్కలా) గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో ఈ పెసలు, బొబ్బర్ల మిశ్రమాన్ని వేసి.. అందులో జొన్నపిండి, వేరుశనగ పొడి, నువ్వుల పొడి, కొద్దిగా నలిపిన వాము వేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం తురుము, పసుపు, క్యారెట్ తురుము, పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తో బాగా కలపాలి.
రొట్టెల కోసం పిండిని మరీ లూజ్‌గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుని, మూత పెట్టి అరగంట పాటు పక్కన ఉంచాలి. దీనివల్ల పిండి చక్కగా నాని రొట్టెలు మృదువుగా వస్తాయి. అనంతరం చపాతీ పీటపై ఒక తడి గుడ్డ వేసి, పిండి ముద్దను పెట్టి వేళ్లకు కాస్త నీళ్లు తడుపుకుంటూ మందంగా, గుండ్రంగా రొట్టెలా ఒత్తుకోవాలి. ఆ క్లాత్‌ను జాగ్రత్తగా తీసేసి, రొట్టెను పెనంపై వేసి సన్నని మంట (సిమ్) మీద కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత పైన కొద్దిగా మీగడ రాసి రెండోవైపు కూడా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన, బలాన్నిచ్చే హై ప్రోటీన్ రొట్టె రెడీ అవుతుంది. వీకెండ్స్‌లో మొలకలకు బదులుగా ఈ రొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.

