NTV Telugu Site icon

Heart attack: ఒత్తిడితోనే హార్ట్ ఎటాక్‌లు.. యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి

Heart Attack

Heart Attack

Heart attack: హార్ట్ ఎటాక్‌ ఇప్పుడు అందరిని భయపెడుతున్న పెద్ద సమస్య. హార్ట్ ఎటాక్‌కు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్న పలు ఘటనలు చూస్తున్నాం. చివరికి పాతికేళ్లు నిండని యువతలో కూడా గుండెపోటు వస్తుంది. గుండె పోటు రావడమే కాదు.. అదే గుండెపోటుతో మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. మనిషి మానసిక ఒత్తిడి స్థాయి పెరుగుతున్న కొద్దీ అధ్వానమైన ఫలితాలు వస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా ఇండియన్‌ హార్ట్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఢిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రి వైద్యుల బృందం ఈ అధ్యయనం చేసింది.

Read also:Hebha Patel : తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హెబ్బా పటేల్..

తీవ్రమైన, మితమైన గుండెపోటుతో జీబీ పంత్‌ ఆస్పత్రిలో చేరిన 903 మంది రోగులపై ఈ అధ్యయనం జరిగింది. ఇందులో భాగంగా ఒక నెలపాటు వారి ఒత్తిళ్ల స్థాయిని ఒక ప్రామాణిక పద్ధతిలో అధ్యయనం చేశారు. ఇందులో 92 శాతం మంది తీవ్రమైన అధిక ఒత్తిడి నుంచి మితమైన ఒత్తిడితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా యువతలో ఇది ఎక్కువగా ఉన్నట్లు వారి పరిశీలనలో తేలింది.
ఒత్తిడికి గుండెపోట్లకు మధ్య సంబంధం ఉందని తమ తొలి ప్రారంభ అధ్యయనంలోనే తేలిందని ఈ అధ్యయనకర్త డాక్టర్‌ మోహిత్‌ గుప్తా వెల్లడించారు. గత కొన్ని దశాబ్దాలుగా జీవనశైలి మారుతోంది.. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఒత్తిళ్ల స్థాయి గణనీయంగా పెరిగింది. దీంతో గుండె పనితీరుపై కూడా ప్రభావం పడుతోందని ప్రొఫెసర్‌ డాక్టర్‌ గుప్తా తెలిపారు. కొవిడ్‌ అనంతరం మన దేశంలో మానసిక ఒత్తిళ్ల ప్రభావం గుండెపోటులపై ఎలా ఉన్నది వెల్లడించే అధ్యయనం ఏమీ జరగలేదని ఆ స్టడీ తెలిపింది. ఆస్పత్రిలో చేరిన వారిలో మెజారిటీ రోగులు అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్ఫారెక్షన్‌ (తీవ్రమైన గుండెపోటు)కు గురైనట్లు వెల్లడించింది. ఇందులో 53 శాతం సివియర్‌ హార్ట్‌ ఎటాక్‌కు గురికాగా, 38 శాతం ఓ మోస్తరు గుండెపోటుకు గురైనట్లు పేర్కొంది. చాలా తక్కువ ఒత్తిడి ఉన్న వారు 9 శాతమే ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఒత్తిడితో హృదయ సంబంధ జబ్బులు పెరగడానికి ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడం, రక్తపోటు పెరగడం, ఇన్సులిన్‌ తగ్గడం అనేవి కారకాలుగా విశ్లేషించింది.

Read also: Maharashtra : దారుణం.. భర్తను బందించి మహిళపై సామూహిక అత్యాచారం..

ప్రస్తుతం గుండెజబ్బుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసులో వచ్చే హార్ట్ ఎటాక్ ఇప్పుడు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. యువత జీవనశైలిలో బాగా మార్పు వచ్చింది. చిన్నవయసులోనే అధిక ఒత్తిడితోపాటు బీపీ, షుగర్ వంటివి వస్తున్నాయి. అందుకే ఛాతినొప్పి, ఊపిరి ఆడకపోవడం, వికారం, మూర్ఛలా అనిపించడం, చెమటలు పట్టడం, అలసట, చేయి, మెడ, వీపు, దవడ, భుజాల భాగాల్లో నొప్పి ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగా ఉంటుంది. గుండెలో నొప్పి, పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా వైద్యున్ని సంప్రదించి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.