అమెరికాలో నోరోవైరస్ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు వందకు పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. నోరోవైరస్ అనేది వేగంగా వ్యాపించే వ్యాధి. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో నోరోవైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది. ప్రస్తుతం వందకు పైగా కేసులు నమోదైనట్లు సమాచారం. వాంతులు, విరేచనాలకు కారణమయ్యే అంటువ్యాధి వైరస్ పెరుగుదలపై ఆరోగ్య అధికారులలో ఆందోళన మొదలైంది.
ఈ వైరస్ సోకిన వాళ్లకు ఏం జరుగుతుంది?
ఈ వైరస్‌ను కడుపు ఫ్లూ లేదా కడుపు బగ్ అని పిలుస్తారు. జీర్ణకోశానికి ఈ వ్యాధి సోకుతుంది. వాంతులు, విరేచనాలు కలిగించి రోగులను డీహైడ్రేట్ చేసి మరిన్ని ఆరోగ్య సమస్యల బారిన పడేస్తుంది. వాంతులు , విరేచనాలతో మొదలై కడుపు లేదా ప్రేగులలో మంటకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. చాలా మంది వ్యక్తులు 1-3 రోజుల్లో కోలుకుంటారు. కానీ వ్యాప్తి బాగా ఉంటుంది. నోరో వైరస్ సోకిన వారి నుంచీ ఇది నేరుగా సోకే అవకాశముంది.
చైనాలో మరో వైరస్ విజృంభణ..
‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్(HMPV)’’ చైనాలో విజృంభిస్తోంది. చైనా వ్యాప్తంగా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నట్లు సోషల్ మీడియాలో రిపోర్టులు వెలువడుతున్నాయి. ఆస్పత్రుల మందు జనాలు బారులుతీరిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ప్రతీ చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్‌గా కొట్టిపారేస్తోంది.
హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు..
హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్‌ఎంపీవీ విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ.. ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి(China CDC) ప్రకటించాయి. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారిన పడే అవకాశాలు ఎక్కువ. కాగా.. మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే.. ఇది ప్రాణాంతకమేనా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందట..
ఇదిలా ఉంటే.. కాగా, సాధారణ జలుబుకు కారణమయ్యే శ్వాసకోశ వైరస్ మాదిరిగానే హెచ్‌ఎంపీవీ ఉందని భారత నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధిపతి అయిన డాక్టర్ అతుల్ గోయెల్ తెలిపారు. ఈ వైరస్ వల్ల పిల్లలు, వృద్ధుల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.అయితే సాధారణంగా చలికాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి పెరుగుతుందని అన్నారు. మరోవైపు దగ్గు లేదా జలుబు వంటి లక్షణాలు ఉంటే, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అతుల్ గోయెల్ తెలిపారు. ఇతరులకు దూరంగా ఉండాలని సూచించారు.జలుబు లేదా జ్వరానికి సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.