NTV Telugu Site icon

Nipah Virus: అసలేంటి “నిపా వైరస్”.. దీనికి చికిత్స ఉందా..?

Nipah Virus

Nipah Virus

Nipah Virus: నిపా వైరస్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా కోజికోడ్ జిల్లాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి ఐదుగురికి సోకింది. ఇందులో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది. ఏడు గ్రామ పంచాయతీలను పూర్తిగా దిగ్భందించింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. గతంలో కూడా కేరళను నిపా వైరస్ బాధించింది. తాజాగా మరోసారి ఆ రాష్ట్రంపై విరుచుకుపడుతోంది. కొత్తగా వచ్చిన నిఫా వేరియంట్ ‘‘బంగ్లాదేశ్ వేరియంట్’’అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించింది.

1998లో మలేషియా, సింగపూర్ లోని పందుల పెంపకందారులలో మొదటిసారిగా ఈ నిపా వైరస్‌ని గుర్తించారు. గబ్బిలాలు, పందుల శరీర ద్రవాలైన లాలాజలం, మూత్రం వంటి వాటితో మనుషులకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన మనుషుల నుంచి ఇతర మనుషులకు సోకుతుంది. గబ్బిలాల్లో నిపా వైరస్ చాలా ఏళ్లుగా ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. గబ్బిలాల్లో వైరస్ మ్యుటేషన్లు చెంది, అత్యంత వ్యాప్తి చెందే వేరియంట్ గా పరివర్తన చెందుతోంది.

Read Also: Uttar Pradesh: కోడలిపై మామ అత్యాచారం.. విడిచిపెట్టిన భర్త..

లక్షణాలు, చికిత్స:

నిపాను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. అయితే ఈ వ్యాధిని నయం చేయడానికి టీకాలు లేవు. దీన్ని నివారించేందుకు వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి సరైన మందులు కానీ లేవు. వ్యాధి సోకిన 70 శాతం మరణాల రేటు ఉంటుంది. వ్యాధి వలన కలిగే లక్షణాలను అనుసరించి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తులు మొదట్లో జ్వరం, శ్వాసకోశ బాధ, తలనొప్పి మరియు వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. మెదడు వాపు , మూర్చ వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి కోమాకు దారి తీస్తుంది.

ముందుగా ఎక్కడ వ్యాపించింది:

మలేషియా, సింగపూర్ దేశాల్లో 1998 లో నిపా వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపుగా 300 మందికి సోకితే 100 కన్నా ఎక్కువ మందిని బలి తీసుకుంది. సోకిన వారిలో 72% మరియు 86% మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం.. 1998 నుండి 2015 మధ్యకాలంలో 600 కంటే ఎక్కువ మందికి నిపా వైరస్ సోకింది. 2001లో ఇండియా, బంగ్లాదేశ్ లో నిపా బయటపడింది. 2018లో కేరళలో ఈ వ్యాధి బయటపడింది. ఆ సమయంలో ఈ వ్యాధి వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019, 2021 మరోసారి కేసులు బయటపడ్డాయి. తాజాగా మరోసారి కేరళ రాష్ట్రాన్ని కలవరపెడుతుంది.