Parenting Tips: వేసవి వచ్చిందంటే చాలు.. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి ప్రారంభానికి ముందే పాఠశాలలకు హాఫ్ డేస్ ప్రారంభమయ్యాయి. దీంతో పిల్లలు ఎక్కడ ఉండకుండా మండుటెండలో బయట తిరుగుతుంటారు. వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తూ ఆడుకునే వారికి ఈ ఎండలే శాపంగా మారుతుందని తెలియకపోవచ్చు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల అవి మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చర్మ సమస్యలను కూడా కలిగిస్తాయి. గాలిలో వెలువడే కాలుష్య కారకాలు, సూర్యుడి నుండి వచ్చే కఠినమైన UV కిరణాలు, వేడి వల్ల వచ్చే చెమట మొదలైనవి పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఈ వేసవిలో మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోకపోతే కలిగే సమస్యలివే..
వేసవి ఫ్లూ:
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఏడాది పొడవునా ఈ సమస్యలను కలిగి ఉంటారు. కాబట్టి వాటిని ఎండ తగలకుండా చూసుకోవాలి. సాయంత్రం లేదా ఉదయం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆడుకోవడానికి వారిని అనుమతించండి. వారికి సరైన పోషకాహారం అందించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
కీటకాలు కాటు:
వేసవిలో దోమల బెడద ఎక్కువ. దోమలే కాకుండా, పిల్లలు కీటకాల కాటుకు కూడా గురవుతారు. ఇది ప్రభావిత ప్రాంతంలో దురద, వాపుకు కారణమవుతుంది. డాక్టర్ సూచించిన విధంగా పిల్లలకు ప్రత్యేక దోమల వికర్షకాలను ఉపయోగించేందుకు ప్రయత్నించండి.
జీర్ణకోశ సమస్యలు:
కలుషిత ఆహారం తినడం లేదా కలుషితమైన పానీయాలు తాగడం వల్ల అనేక రకాల జీర్ణకోశ సమస్యలు వస్తాయి. కడుపునొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నాసిరకం, శుభ్రత లేని కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల హానికరమైన వైరస్‌లు, ఇతర టాక్సిన్స్ కారణంగా పిల్లలలో ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుంది.
డీహైడ్రేషన్:
వేసవి ఎండలకు ఆరుబయట ఆడుకుంటూ పిల్లలు నీళ్లు తాగడం మరిచిపోతున్నారు. ఫలితంగా, వారు సులభంగా డీహైడ్రేట్ అవుతారు. కాబట్టి రాబోయే వేసవిలో వారిని కనీసం రోజుకు 7,8 గ్లాసుల నీరు తాగేలా చేయండి. అలాగే పుచ్చకాయలు తినిపించడం, పండ్ల రసాలు ఇవ్వడం రీహైడ్రేషన్ డ్రింక్స్ అందించడం కూడా మంచిది.
చర్మ సమస్యలు:
వేడి , తేమతో కూడిన వాతావరణం పెరిగిన చెమటకు దారితీస్తుంది. ఫలితంగా ఎగ్జిమా, దురద వంటి అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. అదనంగా, చర్మంపై చెమటలు మరియు చర్మం యొక్క దురద కూడా సంభవించవచ్చు. కాబట్టి పిల్లలకు చెమట ఎక్కువగా పట్టినప్పుడు శుభ్రమైన గుడ్డతో తుడవడానికి ప్రయత్నించండి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించండి.