గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువయ్యాయి. తీవ్ర ఒత్తిళ్లతో కూడిన జీవన శైలి, జంక్ ఫుడ్, సరిగా నీళ్లు తాగకపోవడం, డయాబెటిస్, ఆల్కహాల్ అలవాటు వంటివి దీనికి కారణం అవుతున్నాయి. తమకు కిడ్నీ సమస్యలు తీవ్రమయ్యాయని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. ఈ క్రమంలో చేసేదేమీ లేక ఇబ్బందులుపడుతూనే ఉన్నారు. ముందే లక్షణాలను గుర్తించగలిగితే.. త్వరగా చికిత్స తీసుకుని, సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎవరైనా వ్యక్తుల్లో ఉదయం పూట ఈ లక్షణాలు కనిపిస్తే… వారి కిడ్నీలు దెబ్బతింటున్నట్టుగా భావించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం…
CM Chandrababu: పోలవరం ఏపీకి జీవనాడి.. పూర్తయితే కరవుకు చెక్ పెట్టినట్లే..
ముఖం, కాళ్లు వాపు రావడం:
ఉదయం నిద్ర లేవగానే ముఖం, కాళ్లు వాపు కనిపించడం కిడ్నీ సమస్యలకు ప్రధాన లక్షణం అని డాక్టర్లు చెబుతున్నారు. తరచూ ఇలా జరుగుతుంటే… నిద్ర సరిగా లేకపోవడమో, మరొకటనో దీన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.
వికారం, వాంతులు కావడం:
సాధారణంగా రాత్రంతా నిద్రపోయి ఉదయం లేవగానే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఆకలి వేస్తుంది. కానీ ఉదయమే వికారంగా అనిపించడం, వాంతులు కావడం వంటివి కిడ్నీ సమస్యలకు లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి, పొట్టలో అసౌకర్యంగా మారడం వల్ల ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తీవ్రమైన నీరసం:
ఉదయం లేవగానే తీవ్రమైన నీరసంగా అనిపిస్తే కిడ్నీ వ్యాధుల లక్షణాల్లో ఒకటి. కిడ్నీలు రక్తంలోని విష/వ్యర్థ పదార్థాలను వడగట్టి మూత్రం రూపంలో బయటికి పంపేస్తాయి. అయితే.. కిడ్నీలు సరిగా పనిచేయకుంటే… ఆ వ్యర్థాలు రక్తంలోనే ఉండి తీవ్ర నీరసంగా అనిపిస్తుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
ఉదయం పూట శ్వాస సరిగా ఆడకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే కిడ్నీ వ్యాధుల లక్షణమేనని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు రక్తాన్ని సరిగా శుభ్రపర్చకపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు/వ్యర్థాలు చేరి… శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చేస్తాయని అంటున్నారు.
మూత్రం రంగు మారడం, దుర్వాసన:
ఉదయం లేవగానే మూత్రం పోసినప్పుడు నారింజ రంగు, ఎరుపు రంగులో వచ్చినా… ఎక్కువగా దుర్వాసన వస్తున్నా… కిడ్నీలలో సమస్య ఉన్నట్టే అంటున్నారు వైద్య నిపుణులు. తరచూ ఇలా జరుగుతుంటే నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు.