Heart Attack: ప్రస్తుతం టెక్ రంగంలో AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పేరు మార్మోగుతోంది. రానున్న కాలంలో మానవ జీవితాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇదే విధంగా ఏఐ మానవుడి ఉనికికి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. వైద్య పరిశోధనతో సహా వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతని సాధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడునుంది. పెద్ద డేటా సెట్‌లను విశ్లేషించడానికి, నమూనాలను గుర్తించడానికి, అంచనాలు రూపొందించడానికి AI సాంకేతికత ఉపయోగపడుతోంది.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో గుండెపోటు ప్రమాదం చాలా పెరిగింది. ఆరోగ్యవంతులైన వ్యక్తులు కూడా ఉన్నపళంగా గుండెపోటుతో చనిపోతున్నారు. చివరకు 30 ఏళ్ల లోపు ఉన్న యువతీయువకులు కూడా గుండెపోటు రిస్క్ కింద ఉండటం అందర్ని ఆందోళన పరుస్తోంది. ఇదిలా ఉంటే AI ఉపయోగించి ఒక దశాబ్ధం ముందే గుండెపోటు రిస్క్‌ని గుర్తించవచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సహాయపడనుంది.
బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్(బీహెచ్ఎఫ్) నిధుల సాయంతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ పరిశోధనను నిర్వహించింది. ఛాతినొప్పిని గుండెపోటుగా పోల్చుకోకపోవడం మరణాలకు కారణమవుతుంది. అయితే ఏఐ సాంకేతిక కారణంగా గుండెపోటు రిస్క్‌ని గుర్తించి సకాలంలో చికిత్స అందేలా, ప్రాణాలను కాపాడేలా సాయపడుతుంది.
Read Also: NCERT: చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠ్యాంశాలు.. NCERT కీలక సిఫార్సులు..
ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ చరలంబోస్ ఆంటోనియాడెస్ నేతృత్వంలోని పరిశోధన బృందం, యూకేలోని 8 ఆస్పత్రుల్లోని 40,000 మంది సాధారణ కార్డియాక్ సీటీ స్కాన్ డేటాను విశ్లేషించింది. వీరిని సగటున 2.7 ఏళ్లుగా పరిశోధించారు. గణనీయమైన కరోనరీ ఆర్టరీ(హృదయ ధమని)లో పూడికతో సంకుచితంగా ఉన్నవారు తీవ్రమైన గుండెపోటు లేదా మరణానికి గురయ్యే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ బృందం ఏఐని ఉపయోగించి ధమనులు, దాని చుట్టూ ఉన్న కోవ్వులో మార్పులపై సమాచారాన్ని, అలాగే ధమనుల్లో రక్తమార్గం సన్నగా ఉండటాన్ని, ఇతర క్లినికల్ ప్రమాదకారణాలపై సమగ్ర సమచారం ఉపయోగించి ఏఐ టూల్‌కి ట్రైనింగ్ ఇచ్చారు. దీని తర్వాత ఎక్కువ కాలం పాటు జరిపిన పరీక్షల్లో గుండె సంబంధిత ప్రమాదాలను స్వతంత్రంగా, ఖచ్చితంగా అంచనా వేయగలదని వెల్లడించింది.
ధమనుల్లో ఎలాంటి అడ్డంకుటు లేనివారిలో, వారి రక్తనాళాల్లో వాపు తక్కువగా ఉన్నవారితో పోలిస్తే ఇతరుల్లో గుండె సంబంధిత మరణాలు 10 రెట్లు ప్రమాదం ఎక్కువగా ఉందని స్టడీలో తేలింది. ఈ పరిశోధన బృందం 744 మంది రోగులకు సంబంధించి ఏఐ రూపొందించిన రిస్క్ స్కోర్ వైద్యులకు అందించింది. వీరిలో 45 శాతం కేసుల్లో వైద్యులు రోగుల ట్రీట్మెంట్ ప్లాన్ మార్చుకున్నారని కనుగొన్నారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న రోగుల వివరాలను అందించి మార్గనిర్దేశం చేయడం ద్వారా ఏఐ టూల్ గుండెపోటును ముందుగానే గుర్తించవచ్చని, నివారించవచ్చని పరివోధకులు తెలిపారు.