వైద్య విజ్ఞానం ఎంతగా పురోగమిస్తున్నా, కొన్ని సందర్భాల్లో వైద్యుల సమయస్ఫూర్తి, నైపుణ్యం మాత్రమే ప్రాణాలను నిలబెట్టగలవు. అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో మృత్యువుకు చేరువైన ఓ తొమ్మిది నెలల శిశువును రాష్ట్రాలు దాటించి ఎయిర్ లిఫ్ట్ చేసి, నెల రోజులకు పైగా పోరాడి పునర్జన్మ ప్రసాదించారు కిమ్స్ వైద్య బృందం.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్ ప్రాంతానికి చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి మొదట సాధారణ జలుబు, దగ్గు ప్రారంభమయ్యాయి. అయితే వారం రోజుల్లోనే పరిస్థితి విషమించి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ (అడెనోవైరల్ న్యూమోనియా) కారణంగా శ్వాస అందక శిశువు విలవిలలాడింది. రాయపూర్‌లోని స్థానిక ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో పరిస్థితి చేజారిపోతుందని వైద్యులు గుర్తించారు.
ఈ క్లిష్ట సమయంలో కిమ్స్ కడల్స్ పీడియాట్రిక్ ట్రాన్స్‌పోర్ట్ బృందం రంగంలోకి దిగింది. నిపుణులైన వైద్యులు రాయపూర్‌కు చేరుకుని, ఆ పసికందును విమాన బృందాల సమన్వయంతో వెంటిలేటర్‌పైనే సురక్షితంగా హైదరాబాద్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేశారు. హైదరాబాద్‌లోని పీడియాట్రిక్ ఐసీయూలో చేర్చిన తర్వాత శిశువుకు తీవ్రమైన ‘ARDS’ తో పాటు ఊపిరితిత్తుల చుట్టూ గాలి చేరే ‘న్యూమోథొరాక్స్’ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. హై-ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ (HFOV) వంటి అత్యాధునిక చికిత్సలు అందించినా ఫలితం లేకపోవడంతో, వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
పీడియాట్రిక్ ఐసీయూ హెడ్ డా. పరాగ్ డెకాటే ఆధ్వర్యంలోని బృందం , కార్డియోథొరాసిక్ సర్జన్లు కలిసి శిశువుకు ‘VA ECMO’ చికిత్సను ప్రారంభించారు. ఈ యంత్రం ఊపిరితిత్తులు , గుండె చేయాల్సిన పనిని తాత్కాలికంగా నిర్వహిస్తూ శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. సుమారు 25 రోజుల పాటు ఆ పసికందు ఎక్మో యంత్రంపైనే ఉండి మృత్యువుతో పోరాడింది. ఈ చికిత్సా కాలంలో వైద్య బృందానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అధిక వైరల్ లోడ్, అంతర్గత రక్తస్రావం, రక్తపోటులో మార్పులు వంటి ఆటంకాలను అధిగమిస్తూ వైద్యులు రాత్రింబవళ్లు శ్రమించారు. క్రమంగా చిన్నారి ఊపిరితిత్తులు కోలుకోవడంతో ఎక్మో , వెంటిలేటర్ నుండి విజయవంతంగా వేరు చేశారు. మొత్తం 45 రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది.
PM Modi: వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన..!
పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ డా. పరాగ్ డెకాటే మాట్లాడుతూ, “ఎక్మో వంటి అత్యాధునిక ‘రెస్క్యూ థెరపీలు’ అందుబాటులో ఉండటం వల్ల ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలను కాపాడగలుగుతున్నాం. వెంటిలేటర్‌పై ఉన్న శిశువును రాష్ట్రాలు దాటించి తీసుకురావడం , సుదీర్ఘ కాలం ఎక్మోపై ఉంచడం అనేది మా వైద్య బృందం సమష్టి కృషితోనే సాధ్యమైంది” అని తెలిపారు. ఈ అద్భుత విజయంలో పీడియాట్రిక్ ఐసీయూ నిపుణులు డా. కళ్యాణ్ కె, డా. అవినాష్ రెడ్డి పి, డా. వినోద్ కుమార్, డా. మాధురి కె, కార్డియోథొరాసిక్ సర్జన్ డా. సందీప్ , ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డా. రవి తేజ కీలక పాత్ర పోషించారు. మృత్యువు అంచుల దాకా వెళ్లిన తమ బిడ్డను క్షేమంగా తిరిగి ఇచ్చిన కిమ్స్ వైద్యులకు శిశువు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
