మనిషికి మంచి ఆహారం.. సుఖమయమైన నిద్ర తప్పనిసరి.. ఇవి సరిగా లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వాళ్ళు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనిషి జీవితకాలం చాలా తక్కువగా మారింది. నిద్రపోయే సమయం కూడా దీనికి కారణమని చాలా మందికి తెలియదు.. కానీ ఇది నమ్మలేని నిజం. ఆలస్యంగా నిద్రించే వారు అనారోగ్య అలవాట్ల వల్ల ముందుగానే చనిపోతారని అధ్యయనం చెబుతోంది. రాత్రి వేళల్లో ఏదైనా పని చేసేవారు.. లేదంటే ఫోన్లు, టీవీలు ఎక్కువగా చూడటం వల్ల ఆలస్యంగా నిద్రపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిద్ర లేకపోవడం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిద్ర లేమి వల్ల కలిగే ప్రధాన సమస్యలు ఏంటో తెలుసుకుందాం…….
Read Also: Best ACs: బడ్జెట్ ధరల్లో బ్రాండెడ్ ఏసీలు.. వేసవికి ముందే కొనేయండి!
1. బరువు పెరగడం
నిద్ర లేకపోవడం.. ఊబకాయం మధ్య లోతైన సంబంధం ఉంది. సరైన నిద్ర లేకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. గ్రెలిన్ (ఆకలిని ప్రేరేపించే హార్మోన్) స్థాయిలు పెరుగుతాయి. దీంతో.. లెప్టిన్ (ఆకలిని తగ్గించే హార్మోన్) స్థాయిలు తగ్గుతాయి. ఈ క్రమంలో మీరు ఎక్కువ తినే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా అధిక కేలరీల ఆహారం, తీపి పదార్థాలు తినాలని అనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అదనంగా నిద్ర లేకపోవడం శరీర జీవక్రియ రేటును కూడా ప్రభావితం చేస్తుంది.. దీని వలన బరువు తగ్గడం కష్టమవుతుంది.
2. మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం
కేవలం శారీరకంగానే కాకుండా నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సరైన నిద్ర లేకపోతే, ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు పెరుగుతాయి. నిద్రలో మన మెదడు రోజూ జరిగే కార్యకలాపాలను ప్రాసెస్ చేస్తుంది.. దీంతో ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే.. నిద్రలో లోపం రావడం వల్ల మెదడు సరిగ్గా పనిచేయదు. ఇది మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, కోపంను కలిగిస్తుంది. దీర్ఘకాలిక నిద్ర లేమి ఆందోళన లేదా డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలకు కారణమవుతుంది.
3. రోగనిరోధక శక్తి బలహీనపడడం
నిద్ర మన శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సరైన నిద్ర లేకపోతే, శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వల్ల జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. అదనంగా నిద్ర లేమి శరీరంలో మంటలు పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను మరింత ప్రోత్సహిస్తుంది.
4. గుండె జబ్బుల ప్రమాదం
నిద్ర లేకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. నిద్రలో మన శరీరం రక్తపోటును నియంత్రించి, స్వీయ మరమ్మతులు చేస్తుంది. సరైన నిద్ర లేకపోతే రక్తపోటు పెరుగుతుంది. దీని వలన గుండెకు అదనపు ఒత్తిడి పడుతుంది. దీని ఫలితంగా అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీర్ఘకాలిక నిద్ర లేమి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది.
5. జ్ఞాపకశక్తి, దృష్టి తగ్గడం
మన మెదడుకు నిద్ర చాలా ముఖ్యం. ఇది జ్ఞాపకశక్తిని, అభ్యాస సామర్థ్యాన్ని, ఏకాగ్రతను కాపాడటానికి సహాయపడుతుంది. నిద్ర లేకపోతే, మెదడు పనిచేయడం నెమ్మది అవుతుంది. దీని వలన జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో కష్టపడతారు. నిద్ర లేమి అనేక ఇతర సామర్థ్యాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం. ఇది రోజు రోజూ చేసే పనుల్లో తప్పుల్ని పెంచుతుంది.