Site icon NTV Telugu

Health Tips: పొట్ట సమస్యతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే చాలు!

Tips To Reduce Belly Fat

Tips To Reduce Belly Fat

పొట్ట.. ఈమధ్య కాలంలో చాలామందిని బాధిస్తోన్న అతిపెద్ద సమస్య ఇది! ఇంట్లో తినడం, ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, తిరిగి ఇంటికి వెళ్ళగానే బెడ్‌పై పడిపోవడం.. ఇవే అందరి జీవితాల్లో రోజువారి దినచర్యలు అయిపోయాయి. శారీరక శ్రమ అన్నది ఏమాత్రం లేదు. దీనికితోడు జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారు. పిజ్జాలు, బర్గర్స్‌తో పాటు విచిత్రమైన ఆహారాల్ని తీసుకుంటున్నారు. తద్వారా పొట్టలో కొవ్వు బాగా పేరుకుపోతోంది. దీంతో పొట్టలు బస్తాలుగా మారిపోతున్నాయి. మన శరీరంలో ఒక ప్రత్యేక బ్యాగేజ్‌లాగా పొట్టలు తయారవుతున్నాయి.

కొందరికి మానసిక ఒత్తిడి, సరిపడినంత నిద్ర లేకపోవడం, జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్స్ వల్ల.. బానపొట్ట వచ్చేస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు వంటివి.. శరీరంలోని హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి.. ఆందోళనలు, ఒత్తిళ్ళు పెరుగుతాయి. దీని వల్ల కూడా పొట్ట లావు అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి, ఈ సమస్య నుంచి ఎలా బయడపడటం? చాలామంది రకరకాల కసరత్తులు చేసినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాక సతమతమవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సాధారణమైన టిప్స్. సమయానుకూలంగా సరైన ఆహారం, వ్యాయామం చేస్తే.. ఈ సమస్యని అధిగమించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆహార పదార్థాల విషయానికొస్తే.. పీచు అధికంగా ఉండే బీన్స్‌, బ్రోకలీ, బెర్రీ పండ్లు, అవకాడో, యాపిల్‌, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఫైబర్ ఎక్కువ శాతంలో ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా ఆ ఫైబర్ చేస్తుంది. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు కూడా తరచూ తీసుకోవాలి. వీటితో పాటు పొట్టపై ఒత్తిడి పడే కోర్‌ వ్యాయామాలు, బరువులెత్తడం, మెట్లెక్కడం.. వంటివి సాధన రెగ్యులర్‌గా చేయాలి. యోగా, ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాల్సిందే! ఈ టిప్స్ అన్నీ పాటిస్తే.. కచ్ఛితంగా పొట్ట సమస్యని పరిష్కరించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version