వాతావరణ మార్పు, మారిన ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయస్సులోనే అన్ని రోగాలు వస్తున్నాయి.. ముఖ్యంగా నడుం నొప్పి కూడా ప్రధాన సమస్యగా మారింది.. 30 ఏళ్ల లోపే నడుము నొప్పి, వెన్నునొప్పి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతున్న జీవన అలవాట్లు, ఉద్యోగాలు, ఎక్కువ సమయం కూర్చుని ఫోన్లు వాడటం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. నడుం నొప్పికి చెక్ పెట్టే కొన్ని సింపుల్ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి పడుకునే సమయంలో.. పరుపు మరీ మెత్తగా, మరీ గట్టిగా ఉండకుండా బల్లపరుపుగా, సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. మీకు బోర్లా పడుకునే అలవాటు ఉంటే.. ఆ అలవాటును తగ్గించుకోవాలి. పక్కకు తిరిగి పడుకున్నపుడు కాళ్ల మధ్యలో, వెల్లకిలా పడుకున్నపుడు మోకాళ్ల కింద దిండు పెట్టుకోవాలి. పదేళ్లకు ఒకసారి అన్నా పరుపును మార్చాలి..
అధిక బరువులను ఒక్కసారిగా ఎత్తడం వల్ల నడుమునొప్పి రావడం, నడుము పట్టేయడం జరుగుతుంటాయి. బరువులు ఎత్తేటపుడు జాగ్రత్తగా ఉండాలి. పాదాలు పూర్తిగా నేలపై ఆనించి.. కడుపుని బిగించి బరువులను ఎత్తితే.. నడుమునొప్పి రాదు.
ఇకపోతే ఎక్కువ సమయం ఒకేచోట కూర్చుని ఉండటం వల్ల కాళ్లు, చేతుల్లో కండరాలు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. రక్తప్రసరణ సరిగ్గా అవ్వదు. కాబట్టి ఉదయం లేవగానే.. కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వాకింగ్, యోగా వంటివి రెగ్యులర్ గా చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు నడుము నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కారు డ్రైవ్ చేసేటపుడు సీటులో నడుము వెనుక దిండును పెట్టుకోవాలి.. దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కాస్త విరామం తీసుకోవాలి..
అదే విధంగా..స్త్రీలు ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్ ను వాడుతుంటారు. ఎక్కువగా దీనిని ఒకవైపునే తగిలించుకుంటు ఉంటారు. దీనివల్ల భుజాలు వంగిపోయి మెడ, నడునొప్పి వస్తాయి. అలా ఒకవైపునే కాకుండా.. తరచూ బ్యాగుని కుడి, ఎడమలకు మారుస్తూ ఉండటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు..
ఇక మన తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..మనం తినే ఆహారం కూడా నడుంనొప్పికి కారణం కావొచ్చు. కెఫీన్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. ఎక్కుగా పొట్టు ధాన్యాలు, సోయా, నట్స్, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించినా నొప్పి తగ్గకుంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది..