Gas Burner Cleaning: చాలా మంది గ్యాస్ బర్నర్‌ల నుంచి ‘‘పసుపు రంగు’’లో మంట రావడం చూస్తుంటాం. సాధారణంగా గ్యాస్ నీలి రంగులో వస్తుంది. ఇలా పసుపు రంగులో వస్తే మంట తక్కువగా వచ్చి, వంట చేయడానికి చాలా సమయం పడుతుంది. బర్నర్లపై పేరుకుపోయిన నూనె, మసాలా అవశేషాలు, కార్బన్ కారణంగా గ్యాస్ బర్నర్ల రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, చిన్న చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
ముందుగా ఇలా చేయాలి:
ముందుగా గ్యాస్ బర్నర్ శుభ్రం చేయడానికి ముందు గ్యాస్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి, బర్నర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలి. అనంతరం బర్నర్ క్యాప్, బర్నర్ హెడ్, గ్రిల్స్‌ను వేరు చేయాలి. ఒక పాత్రలో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా లిక్విడ్ డిష్‌వాష్ లేదా సబ్బు కలిపి, బర్నర్ భాగాలను 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. దీంతో పేరుకుపోయిన జిడ్డు, మురికి మెత్తబడుతుంది.
మరకలు పోవాలంటే ఇలా చేయండి:
బర్నర్‌పై ఉన్న మురికి మెత్తబడిన తర్వాత టూత్ బ్రెస్ లేదా మెత్తని బ్రష్‌తో బర్నర్‌ను శుభ్రం చేయాలి. మరకలు అలాగే ఉంటే బేకింగ్ సోడాతో కొద్దిగా నీరు లేదా వెనిగర్ కలిపి పేస్ట్ తయారు చేసి బర్నర్‌పై రాసి కొన్ని నిమిషాల తర్వాత రుద్దాలి. దీంతో మరకలు సులభంగా తొలిగిపోతాయి.
బర్నర్ రంధ్రాలు క్లీన్ అవ్వడం ముఖ్యం:
గ్యాస్ బయటకు వచ్చే చిన్న రంధ్రాల్లో మురికి పేరుకుపోతే మంట సరిగా రాదు. వాటిని శుభ్రం చేయానికి సేఫ్టీ పిన్ లేదా సన్నని మెటల్‌తో జాగ్రత్తగా పనిచేయాలి. శుభ్రం చేసిన తర్వాత అన్ని భాగాలను మంచి నీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడిచి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే స్టవ్‌పై అమర్చాలి.
ఈ తప్పులు అస్సలు చేయకండి:
వేడిగా ఉన్న బర్నర్ ను ఎప్పుడూ శుభ్రం చేయొద్దు. పదునైన కత్తి లేదా ఇతర వస్తువులతో బర్నర్లను గీకవద్దు. స్టీల్ స్క్రబ్బర్‌లో బర్నర్‌లను రుద్దవద్దు. పూర్తిగా ఆరని బర్నర్‌ను స్టవ్‌పై అమర్చవద్దు. గ్యాస్ స్టవ్‌ను ప్రతీ రోజూ తుడవడం, వారానికి ఒకసారి తేలికగా శుభ్రం చేయడం, నెలకు ఒకసారి బర్నర్ పూర్తిగా క్లీన్ చేయడం వల్ల గ్యాస్ వినియోగం తగ్గడంతో పాటు, వంట వేగంగా పూర్తవుతుంది.

