Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్‌లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి

Soft Roti Tips

Soft Roti Tips

Soft Roti Tips: రొట్టెలు గట్టిగా ఉంటే.. తినడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. అదే మొత్తగా.. పూరి పొంగినట్టుగా పొంగి ఉంటే.. ఇష్టంగా లాగిస్తారు.. ఇంట్లో రోజూ రొట్టెలు చేసేవారికి అవి మెత్తగా, పొంగి రావడం చాలా ముఖ్యం. అయితే పలు సందర్భాల్లో రొట్టె పెనం మీద పొంగకుండా చదునుగా ఉండిపోవడం, అంచులు గట్టిగా మారడం, వత్తేటప్పుడు పిండి ముడుచుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. చాలామంది దీనికి పెనం వేడి లేదా వత్తే విధానమే కారణమని భావిస్తారు. కానీ, చాలా సందర్భాల్లో అసలు సమస్య పిండిని కలిపే విధానంలోనే ఉంటుంది.

పిండి మరీ గట్టిగా, మరీ జిగటగా ఉండకూడదు
మెత్తటి రొట్టెల కోసం పిండి ముద్ద సరైన స్థితిలో ఉండటం చాలా అవసరం. పిండి మరీ గట్టిగా ఉంటే రొట్టెలు వత్తేటప్పుడు చిరిగిపోవడంతో పాటు, కాల్చిన తర్వాత గట్టిగా మారుతాయి. అదే సమయంలో ఎక్కువ నీటిని కలిపితే పిండి జిగటగా మారి రొట్టెలు చేయడం కష్టమవుతుంది. అందుకే పిండిని కలిపేటప్పుడు నీటిని ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొద్దికొద్దిగా కలపాలి. పిండి మెత్తగా, నునుపుగా ఉండేలా చూసుకోవాలి. వీలైతే పిండి కలపడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది..

పిండికి విశ్రాంతి ఇవ్వడం మర్చిపోవద్దు
పిండి కలిపిన వెంటనే రొట్టెలు చేయడం కూడా వాటి నాణ్యతపై ప్రభావం చూపుతాయి.. పిండిని మెత్తగా కలిపిన తర్వాత ఒక పాత్రలో పెట్టి మూత లేదా తడి వస్త్రంతో కప్పి 20 నుంచి 30 నిమిషాల పాటు ఆగడం మంచిది.. ఇలా చేయడం వల్ల పిండి మరింత మెత్తగా మారుతుంది. రొట్టె వత్తేటప్పుడు పదేపదే ముడుచుకుపోవడం లేదా తిరిగి కుంచించుకుపోవడం కూడా తగ్గుతుంది. అంటే, పిండి కలిపిన తర్వాత కాస్త టైం తీసుకోకుండా వెంటనే రొట్టెలు చేస్తే అవి గట్టిగా మారే అవకాశం ఉంటుంది.

రొట్టెను అన్ని వైపులా సమానంగా వత్తాలి
ఇక, పిండి సిద్ధమైన తర్వాత రొట్టెలను వత్తే విధానం కూడా చాలా ముఖ్యం. రొట్టె మధ్య భాగం ఎక్కువ మందంగా, అంచులు మరీ పల్చగా ఉండకూడదు. అన్ని వైపులా దాదాపు సమానమైన మందంతో ఉండేలా చూసుకోవాలి.. అంటే, అంతా సమానంగా వచ్చేలా వత్తాలి.. అలాగే రొట్టె వత్తేటప్పుడు ఎక్కువగా పొడి పిండిని ఉపయోగించకూడదు. అవసరమైనంత మాత్రమే పొడి పిండిని ఉపయోగించాలి. ఎక్కువగా పొడి పిండి అంటుకుంటే రొట్టె పొడిగా మారే అవకాశం ఉంటుంది.

పెనం సరైన వేడిలో ఉండాలి
రొట్టె బాగా పొంగడానికి పెనం ఉష్ణోగ్రత కూడా కీలకం. పెనం తక్కువగా వేడిగా ఉంటే రొట్టె సరిగ్గా ఉడకకుండా పొడిగా మారవచ్చు. అదే పెనం మరీ ఎక్కువ వేడిగా ఉంటే రొట్టె బయట భాగం త్వరగా కాలిపోయి, లోపల సరిగ్గా ఉడకకపోవచ్చు. అందుకే ముందుగా పెనాన్ని తగినంత వేడి చేసి రొట్టెను వేయాలి. రొట్టెపై లేత గోధుమ రంగు మచ్చలు కనిపించినప్పుడు సరైన సమయంలో తిప్పాలి. మరోవైపు కూడా ఉడికిన తర్వాత మళ్లీ తిప్పి మెల్లగా నొక్కితే రొట్టె బాగా పొంగే అవకాశం ఉంటుందన్నమాట..

ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి
మొత్తంగా.. మెత్తటి, పొంగిన రొట్టెల కోసం పిండిని మరీ గట్టిగా లేదా జిగటగా కలపకపోవడం, పిండి కలిపిన తర్వాత 20–30 నిమిషాలు టైం తీసుకోవడం.. రొట్టెను సమానమైన మందంతో వత్తడం, పెనాన్ని సరైన ఉష్ణోగ్రతలో ఉంచడం ముఖ్యమైనవి. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే ఇంట్లో తయారు చేసే రొట్టెలు మరింత మెత్తగా, మృదువుగా మరియు చక్కగా పొంగేలా చేసుకోవచ్చు అన్నమాట..