Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!

Coorgi Roti Recipe

Coorgi Roti Recipe

Coorgi Roti Recipe: ఇంట్లో భోజనం తర్వాత తరచూ అన్నం మిగిలిపోతూ ఉంటుంది. అదే అన్నం మళ్లీ తినడానికి చాలామందికి బోర్ కొడుతుంది. అలాంటి సమయంలో చాలామంది ఆ అన్నాన్ని పారేస్తుంటారు లేదా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ఆలోచిస్తుంటారు. మిగిలిపోయిన అన్నంతోనే రుచికరమైన రొట్టె ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.. కర్ణాటకలో దీన్ని కూర్గి రొట్టె అని పిలుస్తారు. దీనికి ఉడికించిన అన్నం, బియ్యం పిండి, ఉప్పు లాంటి ఇంట్లో ఎప్పుడూ ఉండే పదార్థాలే సరిపోతాయి. పిండి కలపడంలో మిగిలిపోయిన అన్నాన్ని వాడటమే ఈ రొట్టె ప్రత్యేకత.

పెనం మీద కాల్చిన తర్వాత నేరుగా గ్యాస్ మంట మీద కూడా కాలుస్తారు. దాంతో రొట్టె చక్కగా పొంగి, దాని మీద లేత గోధుమ రంగు మచ్చలు వస్తాయి. పైన కాస్త నెయ్యి రాసుకుంటే దీని రుచి ఇంకా పెరుగుతుంది. ఉదయం టిఫిన్‌లో అయినా, మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో అయినా మీకు నచ్చిన కూర, పప్పు లేదా చట్నీతో దీన్ని వడ్డించవచ్చు. ఇంట్లోనే సులభంగా కూర్గి రొట్టె చేసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

మిగిలిపోయిన లేదా వండిన అన్నం: 3/4 కప్పు
బియ్యం పిండి: 1 కప్పు
ఉప్పు: రుచికి తగినంత
నీళ్లు: అవసరానికి తగినంత
బియ్యం పిండి: ఒత్తుకోవడానికి
నెయ్యి: పైన రాసుకోవడానికి

కూర్గి రొట్టె ఎలా చేయాలి?

కూర్గి రొట్టె చేయడానికి ముందుగా వండిన అన్నాన్ని మిక్సీలో వేయండి. అందులో కొద్దిగా నీళ్లు పోసి బాగా రుబ్బుతూ మెత్తని పేస్ట్‌లా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ఒక పెద్ద గిన్నెలోకి తీయండి. అందులో బియ్యం పిండి, రుచికి తగినంత ఉప్పు వేయండి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ గట్టి పిండి ముద్దలా కలపండి. ఆ తర్వాత పిండి మీద మూత పెట్టి సుమారు 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి. 15 నిమిషాల తర్వాత పిండిని తీసి 8 సమాన భాగాలుగా చేసుకోండి. ఒక ముద్ద తీసుకుని పొడి బియ్యం పిండి సాయంతో గుండ్రని రొట్టెలా ఒత్తుకోండి. మిగతా ముద్దలతోనూ ఇలాగే రొట్టెలు చేసుకోండి. ఇప్పుడు ఒక పెనం వేడి చేసి దాని మీద రొట్టె వేయండి. రొట్టె పైభాగంలో చిన్నచిన్న బుడగలు కనిపించడం మొదలుపెట్టగానే తిప్పండి. రెండో వైపు కూడా కొన్ని సెకన్ల పాటు కాల్చండి. ఆ తర్వాత పెనం మీద నుంచి రొట్టె తీసి నేరుగా గ్యాస్ చిన్న మంట మీద పెట్టండి. రొట్టె పొంగడం మొదలై, దాని మీద లేత గోధుమ రంగు మచ్చలు వచ్చే వరకు రెండు వైపులా చక్కగా కాల్చండి. మిగతా రొట్టెలను కూడా ఇలాగే సిద్ధం చేసుకోండి. చివరగా వేడివేడి కూర్గి రొట్టె మీద కాస్త నెయ్యి రాసి మీకు నచ్చిన కూర, పప్పు లేదా చట్నీతో సర్వ్ చేయండి.