Idiyappam Recipe in Telugu: దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇడియప్పం (నూడుల్స్ లాంటి రైస్ కేక్) అత్యంత ప్రాచుర్యం పొందిన అల్పాహారం. ఇది కేవలం రుచికరమైనదే కాదు, నూనె లేకుండా ఆవిరిపై ఉడికించడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా హోటళ్లలో దొరికేంత సాఫ్ట్‌గా ఇంట్లో రావడం లేదని చాలామంది అనుకుంటుంటారు. అయితే ఈ సులభమైన పద్ధతిని పాటిస్తే, ఎవరైనా సరే ఇంట్లోనే మెత్తటి ఇడియప్పంను తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
- బియ్యం పిండి: 2 కప్పులు (స్టోర్‌లో దొరికే ఇడియప్పం పిండి అయినా వాడుకోవచ్చు)
- ఉప్పు: పావు టీస్పూన్
- నూనె: 2 టీస్పూన్లు (పిండి సాఫ్ట్‌గా రావడం కోసం)
- వేడినీళ్లు: తగినంత (బాగా మరుగుతున్న నీళ్లు మాత్రమే వాడాలి)
తయారీ విధానం:
1. పిండిని సిద్ధం చేయడం:
ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు , రెండు టీస్పూన్ల నూనె వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో బాగా మరిగించిన వేడినీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, బాగా వేడినీళ్లు పోయడం వల్ల బియ్యం పిండి కలిపేటప్పుడే సగం ఉడికిపోయి చాలా సాఫ్ట్‌గా తయారవుతుంది. పిండిని స్పూన్ లేదా స్పాచులాతో ముద్దలా అయ్యే వరకు కలుపుకుని, ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
2. మేకర్‌లో నింపడం:
ఇడియప్పం మేకర్ (మురుకుల గొట్టం వంటిది) లోపల అంటుకోకుండా ఉండటానికి కొద్దిగా నూనె రాయాలి. అలాగే మీ అరచేతులకు కూడా నూనె రాసుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు తగినంత పిండిని తీసుకుని మేకర్‌లో నింపుకోవాలి.
3. వడియాల్లా వత్తడం:
ఇడియప్పం ప్లేట్స్ లేదా మామూలు ఇడ్లీ ప్లేట్స్‌కు కొద్దిగా నూనె రాసి, పిండిని నింపి సర్క్యులర్ మోషన్‌లో (గుండ్రంగా) మీకు నచ్చిన మందంతో వత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా మీడియంగా ఉంటే త్వరగా ఉడుకుతాయి.
4. ఆవిరిపై ఉడికించడం:
ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడియప్పం ప్లేట్స్‌ను అందులో పెట్టి మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్‌లో సరిగ్గా 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీస్తే, పర్ఫెక్ట్‌గా ఉడికిన మెత్తటి ఇడియప్పం సిద్ధం..
దేనితో తింటే బాగుంటుంది?
ఇడియప్పంను క్రీమీ వెజిటబుల్ కుర్మాతో తింటే ఆ రుచే వేరు. నాన్-వెజ్ ప్రియులు చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీతో కూడా దీనిని ఆస్వాదించవచ్చు. అలాగే తమిళనాడులో దీనిని కొబ్బరి పాలు , బెల్లం కలిపిన మిశ్రమంతో కూడా తింటారు, ఇది పిల్లలకు చాలా ఇష్టమైన కాంబినేషన్.
ఎప్పుడూ తినే ఇడ్లీ, దోశలకు బదులుగా ఈసారి ఈ హెల్దీ అండ్ టేస్టీ ఇడియప్పంను మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ సింపుల్ స్టెప్స్ పాటిస్తే మీరు కూడా హోటల్ స్టైల్ రుచిని మీ ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.
