India’s True Biryani Capital: భారతదేశంలో బిర్యానీ ఒక వంటకం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం. జ్ఞాపకాలు, అభిమానం, ప్రాంతీయ గర్వం అన్నీ కలిసిన రుచి. ప్రతి ప్రాంతం తమదే అసలైన బిర్యానీ అని నమ్ముతుంది. కొన్ని చోట్ల కుంకుమపువ్వు సువాసన ఎక్కువగా ఉంటుంది.. మరికొన్ని ప్రాదేశాల్లో మసాలాల మంట నోటిని ఊరిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో బిర్యానీ లభిస్తుంది. ఇంతకీ “ఉత్తమ బిర్యానీ ఏది?” అనే చర్చలు వస్తే వాదనలు మామూలుగా ఉండవు. బిర్యానీకి అధికారికంగా “రాజధాని” ప్రకటించలేదు. కానీ.. బిర్యానీ రుచి తెలిసిన వారిలో ఎక్కువమంది ఒకే నగరాన్ని గుర్తు చేస్తారు. ఇక్కడ బిర్యానీ అప్పుడప్పుడు తినే వంటకం కాదు.. రోజువారీ జీవితంలో భాగం. ‘భారతదేశ బిర్యానీ రాజధాని’ మరేదో కాదు.. మన హైదరాబాదే.
READ MORE: AMOLED డిస్‌ప్లే, Zeiss ట్యూన్ కెమెరా, 90W ఫాస్ట్ ఛార్జింగ్తో Vivo V70, Vivo V70 Elite విడుదల..
హైదరాబాద్‌ను అధికారికంగా బిర్యానీ రాజధానిగా ప్రకటించకపోయినా.. ఆ పేరు ప్రేమతో ప్రజలే ఇచ్చారు. ఇక్కడి హైదరాబాదీ దమ్ బిర్యానీ దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాజవంశాల వంటశాలల్లో పుట్టి, తరతరాలుగా మెరుగుపడుతూ వచ్చిన ఈ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తక్కువ మంటపై దమ్‌లో నెమ్మదిగా వండటం, సువాసనగల బాస్మతి బియ్యం, నోట్లో కరిగిపోయే మాంసం, మసాలాలు ఇవే దీనికి బలం. ఎక్కువ నూనె లేకుండా, రుచులు సహజంగా కలిసేలా వండటం హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత. పొడవైన బాస్మతి బియ్యం, బాగా మసాలా పట్టిన మటన్ లేదా చికెన్, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, యాలకులు, లవంగాలు, బే ఆకులు, నెయ్యి లేదా నూనె .. ఇవన్నీ కలిస్తే వచ్చే ఫలితం ఘుమఘుమలాడే గాఢమైన రుచితో ఉండే బిర్యానీ.
READ MORE: Singer B Praak: సింగర్ బీ ప్రాక్‌కు లారెన్స్ గ్యాంగ్ హత్యా బెదిరింపులు
హైదరాబాద్‌లో బిర్యానీ ఒకే రకంగా ఉండదు. ఇక్కడే అనేక రుచులు కనిపిస్తాయి. ముడి మాంసాన్ని బియ్యంతో కలిసి దమ్‌లో వండే కచ్చి బిర్యానీ, ముందే వండిన మాంసాన్ని బియ్యంతో కలిపే పక్కి బిర్యానీ, రోజూ తినే చికెన్ దమ్ బిర్యానీ, ప్రత్యేక సందర్భాల్లో చేసే రిచ్ మటన్ బిర్యానీ. ప్రతి ఇంటికీ, ప్రతి హోటల్‌కీ తమదైన రహస్య పద్ధతి ఉంటుంది. హైదరాబాద్‌లో బిర్యానీ పండుగలకే పరిమితం కాదు. లంచ్‌కి ఆర్డర్ చేస్తారు. ప్రయాణాలకు ప్యాక్ చేస్తారు. అతిథులకు పెడతారు. ఎవరి బిర్యానీ బాగుంటుంది అన్నదానిపై చర్చలు సాగుతాయి. పెళ్లిళ్లు, కుటుంబ వేడుకలు, చిన్న పార్టీలు పెద్ద హాండి బిర్యానీ లేకుండా పూర్తవ్వవు. బిర్యానీకి తోడుగా మిర్చి కా సలాన్, రాయితా లేదా దహీ చట్నీ ఉంటాయి. చివర్లో డబుల్ కా మీఠా ఉంటే భోజనం సంపూర్ణం. హైదరాబాద్‌లో బిర్యానీ అంటే గుర్తుకొచ్చే పేర్లు కూడా ఉన్నాయి. ప్యారడైజ్, బావర్చి, షా గౌస్, కేఫ్ బహార్, మేహ్‌పీల్ ప్రతి చోట రుచి కొంచెం భిన్నంగా ఉన్నా, ఆత్మ మాత్రం ఒకటే అదే హైదరాబాదీ.
హైదరాబాద్‌కే కాకుండా దేశంలో మరెన్నో బిర్యానీలు ప్రసిద్ధి చెందాయి. లక్నోలో అవధీ బిర్యానీ నాజూకుగా, సువాసనతో ఉంటుంది. కోల్‌కతాలో ఆలుగడ్డతో చేసే బిర్యానీ ప్రత్యేకంగా నిలుస్తుంది. చెన్నై, ఆంబూర్, వెల్లూరు ప్రాంతాల్లో మసాలా ఎక్కువగా, ఘాటుగా ఉంటుంది. కేరళలో తలస్సేరి బిర్యానీ తేలికగా, సువాసనగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మంటతో కూడిన మసాలా బిర్యానీలు ప్రసిద్ధి. దేశం నలుమూలలా బిర్యానీ ప్రేమికులు ఉన్నా, బిర్యానీని జీవనశైలిగా మార్చుకున్న నగరం హైదరాబాద్. అధికారిక కిరీటం లేకపోయినా, అపారమైన ప్రజాదరణ, రాజస సంప్రదాయం, తరతరాలుగా నిలిచిన వంటక పద్ధతుల వల్ల హైదరాబాద్‌నే ప్రజల మనసుల్లో నిజమైన బిర్యానీ రాజధాని.
