How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!

Puffed Rice

Puffed Rice

How to Make Murmura at Home: సాయంత్రం పూట కరకరలాడేది, తేలికగా ఉండేది ఏదైనా తినాలనిపిస్తే అందరికీ వెంటనే గుర్తుచేసేది బొరుగులు లేదా మర్మరాలు. ఇవి ఇంట్లో ఉంటే చాలు.. క్షణాల్లో కారం బొరుగులు, ఘుమఘుమలాడే భేల్ పురి లేదా మంచి ఈవెనింగ్ చాట్ తయారైపోతుంది. సాధారణంగా మనం బొరుగులను మార్కెట్ నుంచే కొనుక్కొని తెస్తుంటాం. కానీ ఎలాంటి మెషీన్లు లేకుండానే, మనం ఇంట్లోనే చాలా ఈజీగా, ఫ్రెష్‌గా, క్రిస్పీగా తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? ప్రెజర్ కుక్కర్, కొద్దిగా ఉప్పు, బియ్యం ఉంటే చాలు.. కరకరలాడే బొరుగులు చిటికెలో రెడీ అయిపోతాయి. అయితే వీటి తయారీలో బియ్యం ఎంపికే చాలా కీలకం.

ఇంట్లో పర్ఫెక్ట్‌గా బొరుగులు రావాలంటే మనం రోజూ వండుకునే మామూలు బియ్యాన్ని వాడకూడదు. దీనికోసం ‘ఉప్పుడు బియ్యం’ (Parboiled Rice) మాత్రమే సరిపోతాయి. ఇవి కొద్దిగా పసుపు రంగులో, కాస్త లావుగా, పారదర్శకంగా ఉంటాయి. ఇలాంటి బియ్యంతోనే బొరుగులు బాగా ఉబ్బి, క్రిస్పీగా వస్తాయి. అలాగే కొత్త బియ్యం కంటే కాస్త పాతబడిన ఉప్పుడు బియ్యాన్ని వాడితే బొరుగులు పొడిపొడిగా, చక్కగా విచ్చుకుంటాయి. తయారీ విధానం కూడా చాలా సింపుల్. ముందుగా ఒక గిన్నెలో బియ్యం తీసుకుని, అందులో ఒక చిన్న స్పూన్ ఉప్పు, ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి బాగా కలపాలి. నీళ్లు ఎక్కువైపోకుండా చూసుకోవాలి, కేవలం బియ్యం గింజలకు ఉప్పు తడి పట్టేలా ఉంటే చాలు. ఆ తర్వాత ఈ బియ్యాన్ని ఒక ప్లేట్ లేదా పొడి గుడ్డపై పల్చగా పరిచి, ఎండలో లేదా ఫ్యాన్ కింద 10 నుంచి 15 నిమిషాలు ఆరబెట్టాలి. బియ్యం పూర్తిగా ఆరిపోయాకే వాడాలి. ఒకవేళ ఏమైనా తడి ఉందనుకుంటే, పాన్లో వేసి కాసేపు తేలికగా డ్రై రోస్ట్ చేస్తే తేమ మొత్తం పోతుంది.

ఇప్పుడు వెడల్పాటి ప్రెజర్ కుక్కర్ తీసుకుని, దానికి విజిల్, రబ్బర్ గాస్కెట్ తీసేయాలి. అందులో తగినంత నార్మల్ ఉప్పు వేసి పెద్ద మంటపై బాగా వేడెక్కించాలి. కుక్కర్‌పై మూతపెట్టి ఉప్పును బాగా వేడెక్కనివ్వవచ్చు. ఉప్పు బాగా వేడెక్కిన తర్వాత మంట తగ్గించి, ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యాన్ని కొద్దికొద్దిగా అందులో వేస్తూ నిరంతరం కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికే బియ్యం చిటపటలాడుతూ, పువ్వుల్లా ఉబ్బి బొరుగులుగా మారిపోతాయి. బియ్యం ఉబ్బిన వెంటనే వాటిని జల్లెడలోకి తీసుకుని ఉప్పును వేరు చేసేయాలి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని కూడా కొద్దికొద్దిగా బ్యాచ్‌ల వారీగా వేస్తూ బొరుగులు తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కుక్కర్‌లో ఒకేసారి ఎక్కువ బియ్యం వేయకూడదు. అలా వేస్తే బియ్యం సరిగ్గా ఉబ్బవు, పైగా మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొద్దికొద్ది మొత్తంలోనే వేస్తూ వేయించుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లోనే ఎంతో ఫ్రెష్‌గా, కరకరలాడే బొరుగులు తయారైపోతాయి. వీటిని టీ టైమ్‌లో స్నాక్‌గా తినొచ్చు, లేదా క్షణాల్లో భేల్ పురి, చాట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.