Dahi Masala Khichdi Recipe: వేసవి కాలంలో బరువైన, మసాలా ఎక్కువగా ఉండే ఆహారాల కంటే తేలికగా జీర్ణమయ్యే వంటకాలను తినాలని చాలా మందికి అనిపిస్తుంది. ప్రతిరోజూ అదే పప్పు, అన్నం తింటూ విసుగొచ్చిన వారికి దహీ మసాలా కిచిడి ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పొచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. భారతీయ వంటకాలలో కిచిడీకి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా అనారోగ్య సమయంలో ఎక్కువగా తినే ఈ వంటకం, పెరుగు మరియు తేలికపాటి మసాలాలతో తయారు చేస్తే ఎంతో రుచిగా మారుతుంది. ముఖ్యంగా వేసవి మధ్యాహ్న భోజనానికి ఇది సరైన వంటకం. పెరుగు కలపడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా కడుపులో చల్లదనాన్ని కూడా కలిగిస్తుంది.
దహీ మసాలా కిచిడీకి కావలసిన పదార్థాలు
* బియ్యం – 1 కప్పు
* కందిపప్పు – అర కప్పు
* చిలికిన పెరుగు – అర కప్పు
* ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
* టమాటో – 1 (సన్నగా తరిగినది)
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
* పసుపు – 1 టీస్పూన్
* కారం పొడి – తగినంత
* గరం మసాలా – తగినంత
* ఆవాలు – 1 టీస్పూన్
* కరివేపాకు – 6 నుంచి 7 ఆకులు
* నూనె – 2 టీస్పూన్లు
* ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా బియ్యం, కందిపప్పును శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత ఒక పాన్‌లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ, టమాటో వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని సెకన్లు ఉడికించాలి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడిగిన బియ్యం, పప్పును అందులో వేసి మసాలాలతో బాగా కలియబెట్టాలి. అనంతరం 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో మధ్యస్థ మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత చిలికిన పెరుగు వేసి మరో 2 నుంచి 3 నిమిషాలు మంటపై ఉంచాలి. చివరగా కొత్తిమీర చల్లి వేడివేడిగా వడ్డించాలి. ఈ దహీ మసాలా కిచిడి వేసవిలో తేలికగా జీర్ణమవుతూ కడుపుకు ఉపశమనం ఇస్తుంది. పుదీనా చట్నీ లేదా పాపడ్‌తో కలిసి తింటే మరింత రుచిగా ఉంటుంది.
