Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్‌విచ్’.. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!

  • ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ శాండ్‌విచ్
  • బ్రేక్‌ఫాస్ట్, ఈవెనింగ్ స్నాక్స్‌కు బెస్ట్ ఆప్షన్
  • జ్యూసీ చికెన్ స్టఫింగ్‌తో అదిరే రుచి
  • పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే రెసిపీ
Chicken Sandwich

Chicken Sandwich

Cheesy Chicken Sandwich Recipe in Telugu: ఉదయం పూట ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే హడావుడిలో త్వరగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ ఏముంటుందా అని ఆలోచిస్తున్నారా? లేదా సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు ఐదు నిమిషాల్లో టేస్టీగా, కాస్త వెరైటీగా ఏదైనా తినాలనిపిస్తోందా? అయితే మీకోసం బెస్ట్ ఆప్షన్ ‘చికెన్ శాండ్‌విచ్’ (Chicken Sandwich). రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే ఈ శాండ్‌విచ్‌ను ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో, ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చు. చికెన్ ప్రియులకు కడుపు నింపే ఈ క్రేజీ అండ్ జ్యూసీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

  • చికెన్ ఉడికించడానికి:
  • చికెన్ (బోన్‌లెస్): 200 గ్రాములు
  • నీళ్లు: తగినన్ని
  • వెల్లుల్లి రెబ్బలు: 2 (కచ్చాపచ్చాగా దంచినవి)
  • ఉప్పు, మిరియాల పొడి: రుచికి తగినంత
  • ఇటాలియన్ సీజనింగ్: పావు టీస్పూన్ (ఆప్షనల్)
  • చికెన్ మిశ్రమం కోసం:
  • ఆలివ్ ఆయిల్: 2 టీస్పూన్లు
  • వెల్లుల్లి తరుగు: 1 టీస్పూన్ (సన్నగా తరిగినది)
  • ఉల్లిపాయ ముక్కలు: అర కప్పు (సన్నగా తరిగినవి)
  • ఎల్లో క్యాప్సికమ్: పావు కప్పు
  • గ్రీన్ క్యాప్సికమ్: అర కప్పు
  • ఉప్పు: పావు టీస్పూన్
  • మిరియాల పొడి: తగినంత
  • చికెన్ స్టాక్ (చికెన్ ఉడికించిన నీరు): కొద్దిగా
  • ఇటాలియన్ సీజనింగ్: అర టీస్పూన్
  • ఫిల్లింగ్ & టాపింగ్స్ కోసం:
  • మేయోనైస్: పావు కప్పు
  • రెడ్ చిల్లీ సాస్: 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర తరుగు: కొద్దిగా
  • శాండ్‌విచ్ బ్రెడ్ స్లైసులు: తగినన్ని
  • వెన్న (బటర్): కాల్చడానికి సరిపడా

తయారీ విధానం:
1. చికెన్ ఉడికించి తురమడం
ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్‌లో శుభ్రం చేసిన చికెన్, తగినన్ని నీళ్లు, దంచిన వెల్లుల్లి, మిరియాల పొడి, ఉప్పు , ఇటాలియన్ సీజనింగ్ వేయాలి. దీనిని మధ్యస్థ మంటపై (Medium Flame) 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెజర్ తగ్గాక చికెన్‌ను బయటకు తీసి చల్లారనివ్వాలి. (పప్పు ఉడికించిన నీటిని పారబోయకుండా పక్కన పెట్టుకోవాలి). చికెన్ చల్లారిన తర్వాత, దానిని చేత్తో చిన్న చిన్న పీచుల్లా (ష్రెడెడ్ చికెన్) విడదీసి పక్కన పెట్టుకోవాలి.

2. క్రంచీ వెజిటబుల్స్ వేయించడం
ఇప్పుడు స్టవ్‌పై ఒక పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ కాగాక సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఆ తర్వాత అందులోనే ఎల్లో , గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి, అవి కాస్త క్రంచీగా ఉండేలా మరికొద్ది సేపు మాత్రమే వేయించుకోవాలి.

3. జ్యూసీ చికెన్ స్టఫింగ్ సిద్ధం చేయడం
బాణలిలో వేగుతున్న కూరగాయల ముక్కల్లో ముందుగా తురిమి పెట్టుకున్న చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి , కొద్దిగా చికెన్ స్టాక్ (చికెన్ ఉడికించిన నీరు) పోయాలి. ఆ నీరంతా ఇగిరిపోయే వరకు సుమారు 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా ఇటాలియన్ సీజనింగ్ చల్లి, స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

4. క్రీమీ సాస్ కలపడం
ఒక వెడల్పాటి గిన్నెలో మేయోనైస్ , రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ క్రీమీ సాస్ మిశ్రమంలో మనం ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ వెజిటబుల్ మిశ్రమాన్ని , కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి అంతా కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి.

5. గ్రిల్ చేయడం & సర్వింగ్
ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసులను తీసుకుని, ఒక బ్రెడ్ స్లైస్‌పై ఈ చికెన్ మేయో మిశ్రమాన్ని సమానంగా పరచాలి (స్టఫింగ్ పెట్టాలి). దీనిపై మరో బ్రెడ్ స్లైస్ ఉంచి గట్టిగా మూసివేయాలి. ఇప్పుడు స్టవ్‌పై గ్రిల్ పాన్ లేదా నార్మల్ తవా వేడి చేసి కొద్దిగా వెన్న (బటర్) రాయాలి. సిద్ధం చేసుకున్న శాండ్‌విచ్‌ను పాన్‌పై ఉంచి, రెండు వైపులా వెన్న రాస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చి, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి.

అంతే.. ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి ‘చికెన్ శాండ్‌విచ్’ రెడీ! దీన్ని మధ్యలోకి త్రికోణాకారంలో కట్ చేసి, టొమాటో కెచప్ , పొటాటో చిప్స్‌తో సర్వ్ చేస్తే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.