Calorie Deficit: బరువు తగ్గాలనుకునే వాళ్లు, జిమ్‌కు వెళ్లేవాళ్లు లేదా సోషల్ మీడియాలో ఫిట్‌నెస్ వీడియోలు చూసేవాళ్లు తరచూ వినే మాట కేలరీ డెఫిసిట్. కానీ ఈ మాట విన్నా చాలామందికి దాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలియదు. కొందరైతే “తక్కువ తినాలి” అని భావిస్తారు. మరికొందరు “ఆకలితో ఉండాలి” అని అనుకుంటారు. కానీ నిజానికి కేలరీ డెఫిసిట్ అర్థం అది కాదు. మన శరీరం రోజంతా ఎన్నో పనులు చేస్తుంది. ఊపిరి తీసుకోవడం, నడవడం, పని చేయడం, ఆలోచించడం, తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం వంటి పనులు చేయడానికి శరీరానికి ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ మనం తినే ఆహారం నుంచే వస్తుంది. రోజుకు శరీరం ఖర్చు చేసే ఎనర్జీకి సరిపడా తింటే బరువు అలాగే ఉంటుంది. అదే, శరీరం ఖర్చు చేసే కేలరీల కంటే కొంచెం తక్కువగా తింటే.. లోటు ఏర్పడుతుంది. ఆ లోటును పూరించడానికి శరీరం తనలో దాచుకున్న కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. ఇదే కేలరీ డెఫిసిట్. ఇక్కడినుంచే బరువు తగ్గడం మొదలవుతుంది.
READ MORE: Vijay Sethupathi : విజయ్ సేతుపతి.. సాయి పల్లవి.. మణిరత్నం భారీ ప్రాజెక్ట్
ఫిట్‌నెస్ నిపుణులు చెప్పేది ఏంటంటే.. కేలరీ డెఫిసిట్ అంటే ఆకలితో ఉండటం కాదు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా, కొంచెమైనా తక్కువ కేలరీలు తీసుకోవడం. అలా చేస్తే కొవ్వు తగ్గుతుంది. కానీ కండరాలు బలహీనపడవు, ఆరోగ్యం దెబ్బతినదు. ఈ అంశంపై సెలబ్రిటీలకు ట్రైనింగ్ ఇచ్చే ఫిట్‌నెస్ కోచ్ సమీర్ జౌరా ఓ ఉదాహరణ చెబుతారు. “మీ శరీరం రోజుకు 2000 కేలరీలు ఖర్చు చేస్తుంటే.. మీరు 1500 నుంచి 1700 కేలరీల వరకు తింటే చాలు. రోజుకు 300 నుంచి 500 కేలరీల డెఫిసిట్ ఉంటే అది సురక్షితం. మంచి ఫలితాలు కూడా వస్తాయి” అని విరణ ఇచ్చారు. కానీ దీని కంటే ఎక్కువగా తగ్గిస్తే సమస్యలు మొదలవుతాయని హెచ్చరించారు. మొదటి కొన్ని రోజులు బరువు త్వరగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత శరీరం నెమ్మదిగా నిజమైన కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. అదే నిజమైన ఫ్యాట్ లాస్. అలా సమయం గడిచే కొద్దీ శరీరం ఆకృతి కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు.
బరువు తగ్గడానికి కొందరు కేవలం డైట్‌పైనే ఆధారపడతారు. అలా చేసినా ఫలితం ఉంటుంది. రోజుకు 500 కేలరీలు తక్కువగా తింటే, దాదాపు 15 నుంచి 16 రోజుల్లో ఒక కిలో కొవ్వు తగ్గొచ్చు. కానీ ఇంకా మంచి మార్గం ఏంటంటే.. డైట్‌తో పాటు కాస్త శారీరక శ్రమ కూడా అవసరం. ఇవి రెండు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు, రోజుకు 300 కేలరీలు తక్కువగా తిని, మరో 200 కేలరీలు నడక లేదా వ్యాయామంతో ఖర్చు చేస్తే అదే ఫలితం వస్తుంది. కానీ ఈ విధానంలో శరీరం ఇంకా ఫిట్‌గా, బలంగా కనిపిస్తుంది.
READ MORE: Mahindra Bolero Neo: మహీంద్రా బొలెరో నియోపై రూ. 20 వేలు పెంపు.. పెరిగిన కొత్త ధరలు ఇవే!
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. చాలా తక్కువ తినడం.. అంటే రోజుకు 1000 లేదా 1200 కేలరీల కంటే తక్కువగా తినడం ప్రమాదకరం. అలా చేస్తే ఎప్పుడూ అలసటగా అనిపించడం, శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గిపోవడం, కండరాలు కరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. మహిళల్లో నెలసరి సమస్యలు రావచ్చు. పురుషుల్లో హార్మోన్ల ప్రభావం పడుతుంది. నిద్ర సరిగా ఉండదు, మూడ్ మారుతూ ఉంటుంది. ఎక్కువ రోజులు ఇలా చేస్తే ఎముకలు బలహీనపడటం, గుండె సమస్యలు రావడం కూడా జరుగుతుంది. అందుకే బరువు తగ్గాలంటే తొందరపడకుండా, ఓపికతో ముందుకెళ్లాలి. తీపి పానీయాల బదులు నీళ్లు తాగడం, బయట తినే అలవాటు తగ్గించడం, తెల్ల బియ్యం లేదా మైదా తగ్గించి మంచి ధాన్యాలు తినడం, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం, రోజూ కాస్త నడవడం వల్ల కేలరీ డెఫిసిట్ సహజంగా ఏర్పడుతుంది.