How To Make Diya Without Oil: ఈ దీపావళికి మీ ఇంటిని మరింత అందంగా, కొత్తగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? అయితే మార్కెట్లో దొరికే ఖరీదైన దీపాలు, రకరకాల లైట్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. పైగా దీపంలో నూనె పోస్తే చాలు కిందకు కారి ఇల్లు మొత్తం మురికి అయిపోతుందనే టెన్షన్ కూడా అసలే వద్దు. ఈసారి కేవలం నీళ్లతో రాత్రంతా వెలిగే సరికొత్త డిజైనర్ దీపాన్ని మీ ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా మార్కెట్ నుంచి ఎలాంటి సామాగ్రి కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే పాత వస్తువులతో దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఈ వాటర్ క్యాండిల్ (Water Candle) తయారు చేయడానికి ముందుగా కొన్ని సాధారణ వస్తువులను సిద్ధం చేసుకోవాలి. ఒక శుభ్రమైన గాజు గ్లాసు (Glass Tumbler), కొద్దిగా నీరు, అలంకరణ కోసం ఆర్టిఫిషియల్ లేదా సహజమైన ఆకులు, గ్లాసును అందంగా తీర్చిదిద్దడానికి పాత నెయిల్ పెయింట్, దూది లేదా పూజకు వాడే కలావ్ దారం, పాత మొవ్వత్తి (Old Candle), నీటిపై తేలడానికి వీలుగా ఉండే చిన్న ఫ్లోట్ (Float), అలాగే గ్లాసును డెకరేట్ చేయడానికి కొన్ని రంగుల వస్తువులు అవసరమవుతాయి. అయితే, వత్తులను నీటిపై తేలడానికి ప్లాస్టిక్ లేదా టూత్‌పేస్ట్ ట్యూబ్ ముక్కలను మంట దగ్గర అస్సలు వాడకూడదు. దీనివల్ల వేడికి కరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, కేవలం దీపాల కోసం ప్రత్యేకంగా దొరికే హీట్-రెసిస్టెంట్ ఫ్లోట్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిది.
ఇక ఈ అందమైన నీటి దీపాన్ని తయారు చేసే విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. మొదటగా ఒక శుభ్రమైన గాజు గ్లాసు తీసుకుని అందులో కొద్దిగా నీరు పోసి, ఆకర్షణ కోసం కొన్ని ఆకులు వేయాలి. ఆ తర్వాత పాత నెయిల్ పెయింట్‌తో గ్లాసు బయటి వైపు చిన్న చిన్న చుక్కలు పెట్టి అలంకరిస్తే గ్లాసు చూడటానికి చాలా ఆకర్షణీయంగా మారుతుంది. అయితే నెయిల్ పెయింట్ కేవలం గ్లాసు బయటి వైపు మాత్రమే రాసి బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు దూది లేదా కలావ్ దారంతో చాలా పలుచగా ఉండే ఒక చిన్న వత్తిని తయారు చేసుకోవాలి. ఈ వత్తిని దీపాలు వెలిగించే ప్రత్యేకమైన ఫ్లోట్లో ఫిక్స్ చేయాలి.
తర్వాత ఇంట్లో మిగిలిపోయిన పాత మొవ్వత్తిని డబుల్ బాయిలర్ పద్ధతిలో కరిగించుకోవాలి. నేరుగా గ్యాస్ స్టవ్ మీద మొవ్వత్తిని కరిగించకూడదు. ఇలా కరిగిన మైనంలో మనం తయారు చేసుకున్న వత్తిని ఒకసారి ముంచి తీసి ఆరబెట్టాలి. దీనివల్ల వత్తి చుట్టూ మైనం సన్నటి పొరలా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి నూనెను కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా అందంగా అలంకరించి ఉంచుకున్న గాజు గ్లాసులో నీరు నింపాలి. ఆపై సిద్ధం చేసుకున్న ఫ్లోట్‌ను నీటిపై ఉంచి వత్తి సరిగ్గా సర్దుకోవాలి. వత్తి నీటిలో తడవకుండా, అలాగే గ్లాసులోని అలంకరణ వస్తువులు మంటకు దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలి. గ్లాసు కూడా వేడిని తట్టుకునేలా ఉండేదై ఉండాలి.
ఈ విధంగా ఎంతో సులభంగా వాటర్ డెకరేటివ్ దీపం సిద్ధమైపోతుంది. దీన్ని మీ ఇంటి గుమ్మం వద్ద వేసే రంగవల్లుల పక్కన లేదా హాల్లోని ఏదైనా మూలలో అమర్చుకుంటే ఇల్లు మొత్తం జిగేల్ మంటుంది. అయితే దీన్ని వెలిగించే ముందు భద్రతా చర్యలు చాలా ముఖ్యం. మంట పక్కన ఉండే వస్తువులు సురక్షితమైనవా లేదా అని గమనించాలి. వెలుగుతున్న దీపాలను ఎప్పుడూ గమనించకుండా వదిలేయకూడదు. రాత్రి పడుకునే ముందు వాటిని ఆర్పివేయడం మంచిది. ఒకవేళ రాత్రంతా కంటిన్యూగా వెలగాలని కోరుకుంటే బ్యాటరీతో పనిచేసే ఎల్ఈడీ క్యాండిల్స్ (LED Candles) వాడటం మరింత సురక్షితమైన పద్ధతి.

